ప్రయోగాత్మకంగా 9 జిల్లాలలో అమలు
అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు
ప్రజాతంత్ర, హైదరాబాద్ : రక్తహీనత, పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి న్యూట్రిషన్ కిట్ పేరుతో ఏప్రిల్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు తెలిపారు.రాష్ట్రంలోని 9 జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కేసీఆర్ కిట్ వల్ల ప్రభుత్వ దవాఖానాలలో ప్రసవాల సంఖ్య 56 శాతానికి పెరిగిందన్నారు. 2017 జూన్ 2 నుంచి 10.85 లక్షల కిట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రూ.407 కోట్లతో 22 మాతా శిశు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామనీ, వీటిలో 16 పూర్తి కాగా మరో 8 ఏర్పాటు దశలో ఉన్నాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు తీసుకున్న చర్యల ఫలితంగా మాతా శిశు సంరక్షణ విషయంలో గణనీయమైన ప్రగతి సాధించామనీ, 2014 నుంచి 2021 వరకు ఎంఆర్ 92 నుంచి 83కు తగ్గిందన్నారు. రాష్ట్రంలో సి సెక్షన్లు బాగా తగ్గాయనీ, వీటిని మరింత తగ్గించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సి సెక్షన్ల విషయంలో మహిళల్లో చైతన్యం పెరగాలనీ, ఉమ్మడి పాలనలో వచ్చిన అంటు రోగాలలో ఇదొకటని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాలను నిర్వీర్యం చేశారనీ, ప్రైవేటు దవాఖానాలను ఎక్కువగా ప్రోత్సహించారిన వివరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత చర్యల ఫలితంగా దవాఖానాలలో ప్రసవాలు 56 శాతానికి పెరిగాయనీ, 75 శాతం తీసుకుపోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.