Take a fresh look at your lifestyle.

ఏపిలో ఉద్రిక్తంగా అంగన్వాడీల చలో విజయవాడ

  • ఎక్కడిక్కడ అంగన్‌వాడీల అరెస్ట్
  • ‌నగరంలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు

విజయవాడ, మార్చి 20 : అంగన్వాడీలు చేపట్టిన చలో విజయవాడ ఉద్రిక్తంగా మారింది. నగరంలకి రాకుండా వారిని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి నిర్బంధించారు.  సోమవారం ఉదయం విజయవాడ ధర్నా చౌక వద్దకు చేరుకున్న వందలాది అంగన్వాడీలను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. దౌర్జన్యంగా పోలీసులు లాక్కెళ్లడంతో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. పోలీసుల నిర్బంధాన్ని లెక్కచేయ కుండా అంగన్‌వాడీలు దూసుకుని వచ్చారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు.అరెస్టయిన వారిలో అంగన్వాడి యూనియన్‌, ‌సిఐటియు నేతలు సిహెచ్‌.‌నర్సింగరావు, సుబ్బారావమ్మ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌. ‌బాబురావు, తదితరులున్నారు. విజయవాడలో అరెస్ట్ అయిన అంగన్వాడి మహిళలతో పోలీస్‌ ‌స్టేషన్లన్నీ కిక్కిరిశాయి. కళ్యాణ మండపాల్లో ను అంగన్వాడీలను నిర్బంధించారు.

అయినప్పటికీ నిరసనకారులు తమ ఆందోళనలను పోలీస్‌ ‌స్టేషన్లలో కొనసాగించారు. ఏలూరు రోడ్డు, పడవల రేవు, బిఆర్‌టిఎస్‌ ‌రోడ్‌ ‌లో అంగన్వాడీలు బైఠాయించి నిరసన చేపట్టడంతో కాసేపు ట్రాఫిక్‌ ‌స్తంభించింది. అంగన్వాడీలపై ప్రభుత్వ దమనకాండను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌. ‌బాబురావు ఖండించారు. చలో విజయవాడకు తరలివస్తున్న అంగన్వాడీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగించారు. ఈ నేపథ్యంలో … సిహెచ్‌.‌బాబురావు మాట్లాడుతూ … సిఐటియు పిలుపుమేరకు ఆందోళనకు వస్తున్న అంగన్వాడీ మహిళలను దౌర్జన్యంగా అరెస్టులు చేయడం శోచనీయమన్నారు. వివిధ పోలీస్‌ ‌స్టేషన్లలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీల ఆందోళనకు సిపిఎం మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. పోలీస్‌ ‌స్టేషన్ల వద్ద అంగన్వాడీలకు సిఐటియు, సిపిఎం నేతలు సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు. పెత్తందారులపై యుద్ధం అంటూ పేద మహిళ అంగన్వాడీలపై ప్రభుత్వం యుద్ధం చేస్తున్నదని విమర్శించారు. ముందస్తు అనుమతి కోరినా ధర్నాకు అనుమతి ఇవ్వకుండా వచ్చినవారిని వచ్చినట్టు విచక్షణారహితంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, అంగన్వాడీల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని సిహెచ్‌.‌బాబురావు డిమాండ్‌ ‌చేశారు. ముఖ్యమంత్రి అంగన్వాడీల కోర్కెలపై ఇచ్చిన హాలను నిలబెట్టుకోవాలన్నారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని, వారి చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని కోరారు. అంగన్‌వాడీలు సోమవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి నిర్బంధాన్ని ప్రయోగించారు. పలు జిల్లాల్లో అంగన్‌వాడీలను, సిఐటియు నాయకులను అడ్డుకొని అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారు. కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. కొందరికి 149 సిఆర్‌పిసి కింద నోటీసులు ఇచ్చారు. విజయనగరంలో జిల్లాలో 91 మంది అంగన్‌వాడీలను, పలువురు సిఐటియు నాయకులను అరెస్టు చేసి బొబ్బిలి, బాడంగి, విజయనగరం రూరల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్లకు తరలించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, ఎమ్మిగనూరు, మంత్రాలయంలో పలువురు సిఐటియు, అంగన్‌వాడీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

Leave a Reply