- గ్రూపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు
- లైబ్రరీలో విద్యార్థులకు సకల వసతులు
- సిద్దిపేటలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రారంభం
- వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు
- ప్రతిపక్షాల పరిస్థితి దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కటేయమన్నట్టుందని ఎద్దేవా
- ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపు
సిద్దిపేట, ఏప్రిల్ 25(ప్రజాతంత్ర బ్యూరో) : జాబ్ స్పేస్ యాప్ ద్వారా ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మెసేజ్ ద్వారా తెలిసిపోతుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ఉచిత భోజనం కార్యక్రమం, స్టడీ మెటీరియల్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. గ్రూప్ వన్, గ్రూప్ 2లో ఇంటర్వ్యూ లేకుండా వ్రాత పరీక్షల ద్వారా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తామన్న ఆయన.. 500పైగా గ్రూప్ వన్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఇక, గ్రూప్ వన్‌లో కూడా 95శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌దేనని ప్రశంసించారు. అలాగే గ్రూప్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలను తొలగించామని అన్నారు.
కేవలం మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని అన్నారు. 317జీవో తెచ్చి అన్ని జిల్లాల ఉద్యోగులకు న్యాయం చేస్తున్నాం, దీనిపై ప్రతిపక్షాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 317జీవో పై సారాంశం తెలవకుండ బండి సంజయ్ ఎందుకు దీక్ష చేపట్టారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయన్నట్లు ఉన్నాయంటూ సెటైర్లు వేశారు. ఇక, కేంద్రం 15 లక్షల 65 వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తుందో బండి సంజయ్ తెలపాలని డిమాండ్ చేశారు. మూడు లక్షల ఉద్యోగాలు రైల్వేలో ఖాళీగా ఉన్నాయి.. బీజేపీ నేతలను ప్రశ్నిస్తే సోషల్ వి•డియాలో ట్రోలింగ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఉద్యోగాలు ఇస్తామంటే వి•కే పాలాభిషేకం చేస్తామన్నారు. తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో అగ్రామిగా ఉన్నదని, బీజేపీ నేతలు నోరు పారేసుకొనడం తప్ప అసలు విషయం మాట్లాడరని ఎద్దేవా చేశారు. బీజేపీ డబుల్ ఇంజన్ గ్రోత్ ఎక్కడకి పోయిందని హరీష్‌రావు నిలదీశారు. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, యువత ఆలోచించాలని సూచించారు..
బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణకు రావాల్సిన 23 నవోదయ స్కూళ్లను తేవాలని సవాల్ చేశారు. ఇదిలావుటే సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నర్సింగ్ చేసిన వారికి నూటికి నూరు శాతం ఉద్యోగాలు వొస్తాయన్నారు. తెలంగాణలో నర్సుల కొరత చాలా ఉందన్నారు. కొరోనా సమయంలో నర్సులు.. పాజిటివ్ రోగులకు ఎంతో సేవా చేసి, వారి ప్రాణాలను కాపాడారని ప్రశంసించారు. ప్రస్తుతం ప్రారంభించిన నర్సింగ్ కాలేజీలో 400 మంది విద్యార్థులు చదువుకోవచ్చని తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ కూడా పెంచామని గుర్తు చేశారు. రూ. 33 కోట్లతో నర్సింగ్ కాలేజీకి సంబంధించిన సొంత భవనాన్ని నిర్మిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలె…
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇటీవల రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారని..అందుకు అనుగుణంగా వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రజా ప్రతినిధులకు సూచించారు. సోమవారం సిద్ధిపేట నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జిల్లాలో మొత్తం 412 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయనీ, అందులో 225 ఐకేపీ, 10మార్కెట్ కమిటీ, 187పిఏసిఎస్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.
ఇప్పటికే ధాన్యం ఐకేపీ, మార్కెట్ కేంద్రాల్లోకి రాబోతున్నందున ఎంపిపిలు, జడ్పిటిసిలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కో అప్‌రేటివ్ ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలను చెప్పారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. అకాల వర్షాలు కురిసినా, గాలి దుమారాలు పెట్టినా రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. టార్ఫలిన్ కవర్లు అందుబాటులో ఉండే విధంగా చొరవ చూపాలని కోరారు. ప్రతి రోజూ ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. సిఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనాలన్నారు ఆ దిశగా ప్రజాప్రతినిధులు పని చేయాలని సూచించారు.
పండగలా టిఆర్‌ఎస్ ఆవిర్భావం వేడుకలు…
సిఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీగా రాష్ట్రాన్ని సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్న పార్టీకి 21 ఏళ్లు నిండాయని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ నెల 27న టిఆర్‌ఎస్ పార్టీ 21 ఏళ్ల ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు, ఈ ప్లీనరీకి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులకు మాత్రమే ఆహ్వానం ఉందని చెప్పారు.
మిగతా పార్టీ శ్రేణులు అందరూ పట్టణంలోని అన్ని వార్డులలో వార్డు పార్టీ అధ్యక్షులు, గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు జెండా ఎగరవేయాలని కోరారు. ప్రతి పల్లెలో గులాబీ జెండాలు ఎగరవేయాలన్నారు. పండగలా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం గ్రామ స్థాయి నుండి పార్టీ శ్రేణులు, పార్టీ కమిటీలు అనుబంధ కమిటి సభ్యులు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయలని సూచించారు.