- కేసీఆర్‌పై కోపంతో బిజెపి వైపు చూడొద్దు
- వొచ్చే జనవరిలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం
- గెలిస్తే ఆరు నెలల్లో చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్
- మెట్‌పల్లి పర్యటనలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
మెట్‌పల్లి(జగిత్యాల), ప్రజాతంత్ర, మార్చి 11 : ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతులు రాజకీయ పార్టీల చుట్టూ తిరగనవసరం లేదని, ఏకమై పోరాడితే…వారి వెంటే రాజకీయ పార్టీలు వొస్తాయని, చక్కెర ఫ్యాక్టరీ ఎట్ల తెరుచుకోదో.. పసుపు బోర్డు ఎట్ల రాదో చూద్దామని అన్నారు. శనివారం జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి పట్టణంలో ఆ పార్టీ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నరసింగా రావు, కృష్ణారావులతో కలిసి హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్‌తో పాటు ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా అధికారంలోకి వొచ్చిన 100 రోజుల్లోనే మెట్పల్లి ప్రాంతంలో ఉన్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న కేసీఆర్ ఇప్పటివరకు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించక రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. వొచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు.
రైతుల పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, రాజకీయ ప్రయోజనాల కంటే రైతుల మేలుకె కాంగ్రెస్ కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. రూ. 3లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చక్కెర కర్మాగారాన్ని నడపలేరా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చక్కెర కర్మాగారాన్ని కూడా నడిపించలేని కేసీఆర్ రాష్ట్రాన్ని నడపడానికి అర్హత లేదని ధ్వజమెత్తారు. పసుపు బోర్డు తెస్తానన్న వ్యక్తి శంకరగిరి మాన్యాలు తిరుగుతుండని నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వం ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. వరి వేస్తే ఉరే అని ప్రకటించిన కేసీఆర్ సర్కార్‌కు ప్రభుత్వంలో కొనసాగే అర్హత లేదని ఆగ్రహించారు. తెలంగాణను సీడ్ బౌల్ అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు పరిశ్రమలను మూసేస్తున్నారని, తెలంగాణలో వ్యవసాయాన్ని చంపేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి రైతులు కీలక పాత్ర పోషించారని అన్నారు. హర్యానా మాదిరిగా ఇక్కడి రైతులు లాభసాటి పంటలు పండిస్తారని, పదిమందికి పని కల్పించి, పట్టెడన్నం పెట్టి ఇక్కడి రైతులు ఆదుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
గోదావరి జిల్లాల కంటే ఈ ప్రాంత రైతులు గొప్పగా సేద్యం చేసి శ్రీమంతులుగా ఎదిగారని కీర్తించారు. షుగర్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో మూత పడలేదని, కేసీఆర్ అధికారంలోకి వొచ్చిన మరుక్షణం షుగర్ ఫ్యాక్టరీని మూసేశారని తెలిపారు. ఆత్మ గౌరవంతో బతికే రైతులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి కెసిఆర్ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. ఈ ప్రాంతంలో పర్యటించిన కవిత 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారని ఇప్పటికీ రెండు వేల రోజులు గడిచినా షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలేదని చక్కర కర్మాగానం ముగిసిన అధ్యాయమని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం బిఆర్‌ఎస్ పార్టీ ద్వంద ప్రమాణాలకు నిదర్శనమని రేవంత్ మండిపడ్డారు. అందుకే కవితను 100 మీటర్ల గోతి తీసి ప్రజలు 2018 ఎన్నికల్లో బొంద పెట్టాలని రేవంత్ అన్నారు. మా ఆత్మగౌరవం ముగిసిన అధ్యాయమైతే…తెలంగాణలో కేసీఆర్ అధికారం కూడా ముగిసిన అధ్యాయమే అవుతుందని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
10 లక్షల ఎకరాల చెరుకు రైతులను ఆదుకునే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల కోసం 0.1 శాతం నిధులు కేటాయించలేరా? అని అన్నారు. కేసీఆర్ అధికార మదాన్ని అణచివేయాలని రైతులను కోరారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలపై పోరాడి చట్టాలను మోడీ వెనక్కు తీసుకునేలా చేసిన ఘనత రైతులదని ప్రశంసించారు. మోదీ మెడలు వంచిన హర్యానా రైతుల స్ఫూర్తితో రైతులంతా ఏకం కావాలని కోరారు. రాష్ట్రంలో చత్తీస్ ఘడ్ మోడల్ పాలన అవసరం అని అన్నారు. చత్తీస్ ఘడ్ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 9 వేలు ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. తాను కేసీఆర్‌కు నేను సవాల్ విసురుతున్నానని…వ్యవసాయ మంత్రి వొస్తడా, ఐటీ మంత్రి వొస్తడా వారి ఇష్టమని…కాంగ్రెస్ పాలన, బీఆరెస్ పాలనపై చర్చ పెడదామని అన్నారు. తమది రైతులను ఆదుకునే విధానం కాగా.. బీఆరెస్‌ది రైతు ఆత్మహత్యల విధానం అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.