ఎలక్టోరల్ బాండ్స్ వివరాల సమర్పణలో…
వెంటనే బాండ్స్ నెంబర్లతో పాటు వివరాలు అందించాలని ఆదేశం
విచారణను సోమవారానికి వాయిదా వేసిన ధర్మాసనం
న్యూదిల్లీ, మార్చి 15 : ఎలక్టోరల్ బాండ్స్ కేసులో ఎస్బిఐ తీరుపై సుప్రీమ్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ఆదేశాలు పాటించలేదంటూ ఎస్బిఐకి సుప్రీమ్ రాజ్యాంగ ధర్మాసనం నోటీసులు జారీచేసింది. బాండ్స్ వివరాలు వెల్లడిరచిన ఎస్బిఐ..ఆ బాండ్స్ నెంబర్లను అందజేయక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్స్ నెంబర్లు లేకపోవడంతో ఎవరు ఎవరికిచ్చారన్న విషయం తెలియడం లేదని రాజ్యాంగ ధర్మాసనం ఫైర్ అయ్యింది. అన్ని వివరాలను వెల్లడిరచాలని గతంలో ఇచ్చిన తీర్పులో వెల్లడిరచినా.. ఎస్బిఐ పట్టించుకోకపోవడంతో సీజేఐ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీమ్ కోర్టు ధర్మాసనం. అప్పటిలోగా ఎస్బిఐ వివరణ ఇవ్వాలని సుప్రీమ్ కోర్టు ఆదేశించింది. కాగా, సీల్డ్ కవర్లో గతంలో ఇచ్చిన వివరాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని రిజిస్ట్రీకి సుప్రీమ్ ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు..సీల్డ్ కవర్లో ఇచ్చిన వివరాలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో శనివారం సాయంత్రం 5 గంటలకల్లా ఉంచాలని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘానికి అందించిన వివరాలు సరిగా లేవని అసహనం వ్యక్తం చేసింది. అన్ని వివరాలు చెప్పాలని గతంలో ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసినా.. అందుకు విరుద్ధంగా వ్యవహరించా రన్నారు సీజేఐ చంద్రచూడ్. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఎస్బిఐని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.





