Take a fresh look at your lifestyle.

ఎవరిది రైతు ప్రభుత్వం..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికివారే తమదే అసలైన రైతు ప్రభుత్వమని కితాబిచ్చుకుంటున్నాయి. దేశానికి వెన్నెముక, రైతే రాజు అంటూ వారికోసం ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నట్లుగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాల చేతలుమాత్రం రైతులు ఉద్యమించక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో సమగ్ర మార్పులు తీసుకొస్తున్నామన్న మిషతో కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలపై ఏం జరిగిందో తెలియందికాదు. ఆ చట్టాలను అమలు చేస్తే వ్యవసాయరంగాన్ని సమాధి చేసినట్లే అవుతుందని దేశవ్యాప్తంగా రైతన్నలు ఆందోళన చేపట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. దేశంలోని రైతాంగాన్నంతా ఆందోళనకు గురిచేసినా, దేశ రాజధాని నగరానికి చుట్టుపక్కల ఉన్న పంజాబ్‌, ‌హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ‌రాష్ట్రాలకు చెందిన వేలాది రైతులు దిల్లీ వీధుల్లో సంవత్సరంపాటు ఆందోళన చేపట్టిన సంఘటన నిజంగా చరిత్రలో మరిచిపోలేనిది. ఎర్రటి ఎండలో, కుండపోత వర్షంలో, ఎముకలు కొరికే చలినికూడా లెక్క చేయకుండా తమకు తీవ్ర నష్టాన్ని కలిగించే ఆ మూడు చట్టాలను రద్దు చేయాలని ఆనాటి వారి ఉద్యమానికి ప్రపంచ దేశాలుకూడా సానుభూతి ప్రకటించాయి. మహిళలు, పిల్లలతో సహా రోడ్లమీదనే వంటవార్పు చేసుకుంటున్నా ఏడాది కాలం కేంద్ర ప్రభుత్వం బెట్టు వీడకుండా చేసిన తాత్సర్యానికి సుమారు ఏడు వందల యాభై వరకు రైతులు మృత్యువాత పడ్డారు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు సమీపిస్తుండడంతో విధిలేక కేంద్రానికి రైతులు వ్యతిరేకిస్తున్న ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకోక తప్పలేదు. అప్పుడు కూడా మరో కోణంలో ఈ చట్టాలను అమలు పర్చాలన్నదే కేంద్రం ఆలోచన. అయినా తమది రైతాంగ అనుకూల ప్రభుత్వమనే కేంద్రం చెబుతుంది.

మొదటినుండి తమది రైతాంగ ప్రభుత్వంగా చెబుతున్న తెలంగాణ సర్కార్‌ ఈ ‌మొత్తం ఎపిసోడ్‌కు చలించిపోయింది. దిల్లీ ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించింది. ం•ష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాని, నిన్నగాక మొన్న తెలంగాణలో జరిగిందేమిటి? ప్రజలకు, ప్రజాప్రతినిధులకు తెలియకుండానే మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌ముసాయిదా తయ్యారైందట. రెండు పంటలు పండించుకుంటున్న రైతుల పొలా)ను మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌పరిధిలోకి తీసుకురావడంలో ప్రజాప్రతినిధుల, ప్రభుత్వ ప్రమేయమేమీలేదని తేల్చేశారు. ఒకటికాదు రెండు పట్టణాల్లోకూడా తాము ఆమోదించిన మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌ముసాయిదాకు బదులుగా, సంబంధిత • అధికారులు మరో ప్లాన్‌ను ప్రభుత్వానికి పంపించారంటూ పాలకులు చేతులు దులుపుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయరంగాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకువొస్తున్నామంటున్న ప్రభుత్వం, మరో పక్క పరిశ్రమలు, ఇతర కమర్షియల్‌ ‌రంగాలకోసం పచ్చని పంట పొలాల్లో ఇండస్ట్రీయల్‌ ‌కారిడార్‌ ‌నిర్మాణానికి ప్రణాళిక రచించడాన్ని రైతన్నలు తట్టుకోలేక పోయారు. అదే జగిత్యాల, కామారెడ్డి మున్సిపల్‌ ‌పరిధిలోని పలు గ్రామాల ప్రజలను ఆవేశానికి గురిచేసింది. ధర్నాలు, రస్తారోకోలు, రోడ్లపై వంటావార్పులతో గత నలభై అయిదు రోజులుగా ఈ రెండు పట్టణాల పరిధిలోని గ్రామస్తులంతా సంఘటితంగా ఉద్యమించక తప్పని పరిస్థితి ఏర్పడింది. చివరకు మహిళలు స్థానిక శాసనసభ్యుడి ఇంటిని ముట్టడించక తప్పలేదు.

భూమిని నమ్ముకుని జీవిస్తున్న తమను భూమికి దూరం చేయవద్దంటూ ఐక్య పోరాటాన్ని కొనసాగించారు. దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. ఈ రెండు పట్టణ మున్సిపాలిటీలు ఈ విషయంపైన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లుగా తీర్మానించాల్సివచ్చింది. విచిత్రమేమంటే ఈ రెండు మున్సిపల్టీలు తీర్మానం చేసేక్రమంలో అధికారులను తప్పుపట్టడం. ఇంత గందరగోళానికి కారణం అధికారులేఅన్నది చివరగా తేల్చేశారు. వారిపైన చర్యలు తీసుకుంటామంటూ రైతాంగాన్ని అనునయించే ప్రయత్నం చేశారు. మరో విచిత్రమేమంటే అప్పుడుగాని అక్కడ సమీపంలో ప్రభుత్వ భూమి ఉన్నదన్న విషయం వారికి గుర్తుకు రావడం.

ఎట్టి పరిస్థితిలోనూ వ్యవసాయ భూమిని ఇండస్ట్రీయల్‌ ‌జోన్‌లోకి వెళ్ళనీయమని, అవసరమైతే ప్రభుత్వ భూమినే అందుకు వినియోగిస్తామని ఆయా మున్సిపాలిటీ చైర్మన్ల్లు, స్థానిక ఎంఎల్‌ఏ ‌చెప్పడం చూస్తుంటే మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రూపొందించడానికి ముందు ప్రభుత్వ భూమిని వీరు కనీసం పరిగణలోకి తీసుకోలేదన్నది స్పష్టమవుతున్నది. అసలు ఈ ఆందోళన రైతులు చేపట్టిందికాదు.. రైతుల ముసుగులో ప్రతిపక్ష రాజకీయ నాయకులు చేపట్టిన ఆందోళన అంటూ అధికారపక్షం చేస్తున్న విమర్శ, తాము రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ ‌సరైందేనన్న భావన కలిగించేదిగా ఉంది. మున్సిపాల్టీల్లో ఏకపక్షంగా చేసిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమోదించాల్సిఉంది. ఆ తర్వాత అందరి ఆమోదంతో కొత్త ముసాయిదా తయారు చేయాల్సిఉంది. ఏదిఏమైనా రైతులు ఉద్యమిస్తే తప్ప ఈ రైతాంగ ప్రభుత్వాలు తమ ‘మాస్టర్‌ ‌ప్లాన్‌’‌ను సవరించుకునేట్లు లేవు.

Leave a Reply