ఎయిడెడ్‌ ఉద్యోగుల వేతన వెతలకు విముక్తి కోరుతూ ఒక విన్నపం

కుటుంబంలో కష్టాలు, కన్నీళ్ళు కలిగినప్పుడు ‘‘నేనున్నాను’’, మీరు నిమ్మలంగా ఉండండి అని ఆ కుటుంబ పెద్ద భారం మీదేసుకుని బాధ తీరుస్తాడు. తెలంగాణ రాష్ట్ర కుటుంబ పెద్ద అయిన మా గౌరవనీయ ముఖ్యమంత్రిగారికి, బతుకు వెతల లోతుల్లోంచి పుట్టిన ఒక వేదనాగీతం ఈ లేఖ.
మీరు మాకు ప్రభువు. అంటే తండ్రి. మేము మీ ప్రజలము అంటే పిల్లలం.
నాయినా! (గౌరవ ముఖ్య మంత్రిగారు)  నేను (మేము) ఎయిడెడ్‌ ‌డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను(ము). ఒక ప్రత్యేక సందర్భలో ప్రత్యేకంగా ఏర్పాటైనవి ఎయిడెడ్‌ ‌విద్యా సంస్థలు. పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యనందించే ఉద్దేశ్యంంతో ఏర్పాటైనవి. అటువంటి ఎయిడెడ్‌ ‌డిగ్రీ కాలేజీల్లో అన్ని విద్యార్హతలతో అంటే, P.G., NET, SET, M.Phil., Ph.Dలతో లెక్చరర్గా ఇంటర్వ్యూలను ఎదుర్కొని ఎన్నిక చేయబడ్డాను (ము). ఎన్నికైంది మొదలు ఈనాటివరకు నా వేతన వెతలు తీరలే. తీరుతాయి… తీరుతాయి… అని 25 ఏండ్ల నుంచి ఎదురు చూస్తూనే… ఉన్న (ఉన్నాం). 25 ఏండ్ల వయస్సున్నప్పుడు ఉద్యోగంలో చేరిన (ం). ఈ ఎదురు చూడటంలోనే 25 ఏండ్లు గడిచిపోయినయ్‌. ఇప్పుడు 50 ఏండ్లు మీద పడింది వయసు.
నాయినా! (ముఖ్యమంత్రి సర్‌) ‌మీ ఏలుబడిలో నా(మా) బ్రతుకు(లు) గాడినపడుతుంది ఇగ నా(మా) కష్టాలు తీర్నయి అని ఆశపడ్డనే. కానీ తీరలే. ప్రతినెల టైంకి జీతంరాక, 3 నెలలకో 4 నెలలకో ఒకసారి వచ్చే విధానమే ఇంకా కొనసాగుతుండడంతో చస్తూ బ్రతుకుతూ, బ్రతుకుతూ చస్తూ, చావలేక, బ్రతకలేక, కన్నపిల్లల మీద కడుపుతీపితో ఏదో బ్రతికేస్తున్నా(ం). పిల్లలనైనా బాగా చదివిం చుకుందాం అనుకుంటే, జీతం సరిగా రాక, పిల్లలకు కూడా అరకొర చదువులే ఇస్తున్న(ం). ఇల్లు కొనుక్కుందామని బ్యాంక్కెళ్తే మూన్నెల్లకోసారొచ్చే జీతాలతో సిబిల్‌ ‌స్కోర్‌ ‌జీరో నంబర్ను చూసి, బ్యాంకోళ్ళు లోన్‌ ‌కూడా ఇయ్యట్లేరు. ఇల్లు లేకపోతే పాయె, ఇంటి కిరాయైనా మంచిగ టైంకి ఇచ్చి, గౌరవంగా బ్రతుకుదామనుకుని, అయినోళ్ళ దగ్గరో, చుట్టాల దగ్గరో అప్పడగబోతే, నెలకు సరిగ జీతంరాదు, అప్పెట్ల తీరుస్తవ్‌? ‌మిత్తెట్ల కడ్తావ్‌? అని దగ్గరొల్లు కూడా దూరం కాబట్టిరి.
ఒక పండుగ లేదు, పబ్బం లేదు, పండుగెళ్ళిపోయినంక ‘చచ్చినోని పెండ్లికి వచ్చిందే కట్నం’ అన్నట్లు, ఎన్నడో పడే జీతం, పండుగనాడు పడ్డ బాధను ఎన్నడు తీర్చలె. చదువుకుంటందుకు సరిగ్గ ఫీజే కడ్తలేరు, మీరేం తల్లిదండ్రులు? అని కడుపున పుట్టిన పిల్లలు వెక్కిరిస్తుంటే కండ్ల నీళ్లొస్తున్నయ్‌. ‌నాయనా! (ముఖ్యమంత్రి సర్‌) ‌మస్తు బాదైతుందే. బతుకులు చితికిపోతున్నయ్‌. ఎయిడెడ్‌ ‌వ్యవస్థలోని ఈ నెల తప్పిన జీతాల వల్ల మా బతుకులు గతి తప్పుతున్నయ్‌. ఆస్తులిచ్చి, అంతస్తులిచ్చి, ఉన్నత చదువులు చదివించి, ఉద్యోగమొచ్చే దాగా కండ్లల్ల వొత్తు లేసుకుని పెంచిన తల్లిదండ్రుల్నే వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న పిల్లలున్న నేటి కాలంలో, జీతాలు సరిగారాక, అరకొర చదువులు చదివించే మాలాంటి తల్లిదండ్రులు రేపటి గతేంటి!
తెలంగాణ రాష్ట్రం సాధించుకుని నేటికి 10 ఏండ్ల పొద్దు. దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ తరుణంలో అన్ని రంగాల ఉద్యోగులు ఆనందంగ ఉన్నరు, ఒక్క ఎయిడెడ్‌ ఉద్యోగులం తప్ప.
మన తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన అన్ని పోరాటాల్లో మా ఎయిడెడ్‌ ఉద్యోగులం పాలుపంచుకున్నం. పెన్‌ ‌డౌన్‌ ‌లు చేసినం. సస్పెండైనమ్‌. ‌తెలంగాణ రాష్ట్ర ఏర్పడినంక ‘‘జై తెలంగాణ’’ అని నినదించినం.
నాయినా! మీరు ముఖ్యమంత్రి అయినంక ఎంతమందికో వరాలు ఇస్తిరి కదా! ఆ వరాల జల్లులల్ల పాతనంత కడుక్కొని, సబ్బండ వర్గాలు కొత్తగ బ్రతకబట్టె. ఆఖరికి సర్వీసులో, వయసులో మాకంటే 20 ఏండ్ల చిన్నవాళ్ళు అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఇయ్యాల రెగ్యులర్‌ ఉద్యోగులైరి. మేము (ఎయిడెడ్‌) ‌మాత్రం ఆ రోజు ఏడున్నమో, ఈరోజు కూడా ఇంకా ఆడనే ఉన్నం.
2018 సం••లో ఎయిడెడ్‌ ‌కాలేజీల్లో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి, గవర్నమెంట్‌ ‌కాలేజీల్లో వేసిండ్రు, గవర్నమెంట్‌ ‌కాలేజీల్లో వేసేస్తే, మేము కూడా గవర్నమెంట్‌ ఉద్యోగులమేమో, ఇప్పటి నుంచి జీతాలు నెలనెల ఒకటో తారీఖున వస్తయేమో అనుకున్నం. కానీ, పెంక మీది నుంచి తీసి, పొయ్యిలో వేసిండ్రని తరువాత తెలిసింది.
మీ వల్ల వరాలు పొందిన మీ అక్కలు, చెల్లెల్లు మీ పేరును వాళ్ళ చేతుల మీద చెరిగిపోని పచ్చబొట్లుగా వేయించుకుంటుంటే ఈ మధ్య వార్తల్లో చూసినం. ఎటూకాని, ఈ ఎయిడెడ్‌ం‌చి మమ్మల్ని గవర్నమెంట్లో కలిపితే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 500మంది మా ఎయిడెడ్‌ ఉద్యోగులం మీ పేరును మా గుండెలమీద వేయించుకుంటం నాయినా.
ధన్యవాదములతో దయగల్ల తండ్రికి (ప్రభుత్వానికి) ప్రేమతో, ఆర్తితో ఒక కూతురు (ఎయిడెడ్‌ ఉద్యోగి)

– డా. కూరెళ్ళ అహల్య
Asst. Professor of Sanskrit
గవర్నమెంట్‌ ‌డిగ్రీ కాలేజి, మల్కాజిగిరి
80747 97024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *