- 17 లక్షల 60 వేల పక్కా ఇళ్ల నిర్మాణాలు
- 17వేల కాలనీలను ప్రభుత్వం నిర్మిస్తుంది
- ప్రతి ఎమ్మెల్యే గర్వపడేలా చేస్తున్నాం
- ఇల్ల నిర్మాణంపై అసెంబ్లీలో సిఎం జగన్ వివరణ
అమరావతి, మార్చి 17 : ప్రతీ ఎమ్మెల్యే గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. 17 లక్షల 60 వేల పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపడుతామని పేర్కొన్నారు. 17వేల కాలనీలను ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. 30 లక్షల 76 వేల మందికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని జగన్ ప్రకటించారు. ఏపీ అసెంబ్లీలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంపై చర్చ సందర్భంగా సిఎం మాట్లాడారు. ఇళ్ల స్ధలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణాలపై ఈరోజు జరుగుతున్న చర్చా కార్యక్రమంలో చాలామంది శాససనభ్యులు అందరూ చక్కగా మాట్లాడారు. మంత్రి రంగనాథరాజు కూడా సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ప్రతి శాసనసభ్యుడు కూడా సగర్వంగా ఏ నియోజకవర్గంలో అయినా వెళ్లి తిరుగుతూ.. నేను ఫలానా పని చేశాను అని సగర్వంగా చెప్పుకునే గొప్ప కార్యక్రమం ఈ రోజు జరుగుతుందని సిఎం అన్నారు. మామాలుగా ఎమ్మెల్యేలు ఏదైనా నియోజకవర్గంలో తిరగడం మొదలుపెడితే నాకు పెన్షన్ రాలేదనో.. ఇల్లు లేదనో, ఫలానా స్కీం అందలేద నో, అర్హత ఉండి కూడా రాలేదనే రకరకాల ఫిర్యాదులు వినిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి శాసనసభ్యుడు సగర్వంగా, కాలర్ ఎగరేసుకునే పరిస్థితుల్లో ఉన్నామని జగన్ అన్నారు. ప్రతి పథకం పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావు లేకుండా జరుగుతుంది. పథకంలో అర్హత ఉంటే చాలు మన పార్టీయా, తన పార్టీయా అని చూసే కార్యక్రమం కూడా ఎక్కడా జరగడం లేదు. తన, మన భేదం కూడా చూపించడం లేదు.
కులం, ప్రాంతం, మతం, చివరకి పార్టీ కూడా చూడకుండా ఇవాళ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈరోజు దాదాపు 30.76 లక్షల ఇళ్ల స్ధలాల పట్టాల పంపిణీ చేయడంతో పాటు, తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇవి దేవుడి దయతో త్వరితగతిన పూర్తయిన తర్వాత ఈ 30.76 లక్షల అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరి చేతిలో రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి పెట్టినట్లే. అంత గొప్ప కార్యక్రమం జరుగుతుందన్నారు. సొంత ఇల్లు ఉండాలని, కట్టుకోవాలని, దాని కోసం జీవితమంతా సంపాదించిన దాన్నంతా తీసుకుని కట్టుకోవాలని కలలు గనే కార్యక్రమం. సమాజంలో సొంత ఇల్లుతో వారికి స్టేటస్ వస్తుంది. భద్రతతో పాటు భరోసా కూడా వస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా పేదరికంలో ఉండ ఇబ్బందులు పడుతున్న అగ్రవర్ణాలకు కూడా మేలు జరిపించే కార్యక్రమం జరుగుతుంది. పేదవాళ్లకు ఈ ఇళ్లపట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా ఒక మహాయజ్ఞం చేశారు. దీని కోసం 71,811 ఎకరాల భూమిని వివిధ రూపాలుగా సేకరించాం. ఈ భూమి విలువ కనీసం రూ.25 వేల కోట్లు ఉంటుంది. ఈ రూ.25 వేల కోట్ల విలువ చేసే భూమిని మనం 30.76 లక్షల అక్క చెలెమ్మల చేతిలో పెట్టాం. 30.76 లక్షల ఇళ్లలో టిడ్కోకు సంబంధించి 2.62 లక్షల ఇళ్లు కూడా ఉన్నాయి. అందులోనూ అన్‌డివైడెడ్ షేర్ అప్ ల్యాండ్ వారికి వస్తుంది. కొత్తగా 17,005 కాలనీలు వస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 13 వేల పంచాయతీలు ఉంటే.. కొత్తగా 17 వేల కాలనీలు ఏర్పాటవు తున్నాయి. కొన్ని చోట్ల ఆ కాలనీలు చూస్తే.. మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయితీ సైజులో కనిపిస్తున్నాయి.
అందుకే ఇవాళ ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నాం. 7,005 వైయస్సార్ జగనన్న కాలనీల్లో తొలిదశలో 10,067 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్లు కడుతున్నాం. మొత్తం రూ.28 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. దేవుడి దయ వల్ల ఈ స్ధాయిలో మన ఇళ్ల స్ధలాలు సేకరించడం జరిగింది. కేంద్రం నుంచి కూడా మనకు సహాయం అందుతుంది. కాబట్టి ప్రధానమంత్రి మోదీకి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు. 7,005 కాలనీలలో త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ ఇటువంటి మౌలిక సదుపాయాలతో పాటు స్కూల్స్, ఆస్పత్రులు, సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మౌలిక సదుపాయాల కోసమే రాబోయే రోజుల్లో రూ.32,909 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. దీనికి కొద్ది సమయం పడుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని సంవత్సరాల పాటు ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతూ పోతుందన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో కూడా కలిపి గమనించిన్లటైతే.. ఇంటి విస్తీర్ణం రూరల్‌లో ఇంచుమించు 215 చదరపు అడుగులు. ఇవాళ మనం కడుతున్న ఇంటి విస్తీర్ణం 340 చదరపు అడగులు ఉంటుందన్నారు. ఎలా తగ్గించగలిగితే పేదవాడికి మెరుగ్గా ఇళ్లు కట్టంచగలుగుతామని చెప్పి రకరకాల ఆలోచనలు చేసి ఒక కార్యాచరణ రూపొందించాం.అందులో భాగంగానే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా డోర్లు, పెయింటింగ్, శానిటరీ, ఎలక్టిక్రల్ సామాగ్రి వంటి 14 రకాల నాణ్యమైన సామాగ్రిని తీసుకువచ్చామన్నారు. ఇవన్నీ ఎకనామిక్ బూస్ట్‌ను తీసుకురావడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కార్మికులకు 21.4 కోట్ల పని దినాల లబ్ది జరుగుతుంది.
వృత్తి నైపుణ్యం ఉన్న కార్మికులకు మరో 10.60 కోట్ల పని దినాలు లభిస్తాయి. ఇవన్నీ గ్రామ స్ధాయిలో రావడం వల్ల, గ్రామస్ధాయి ఎకానలో పెద్ద బూస్ట్ వస్తుంది. రాష్ట్ర జీఎస్‌డీపీ పెరుగుదలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్లను జీ ప్లస్ త్రీ పద్ధతిలో మూడు కేటగిరీల్లో నిర్మిస్తున్నాం. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆ ఇళ్లు కడుతుండగా, వాటిలో 300 చదరపు అడుగుల ఇంటిని పేదలకు పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 1,07,814 ఇళ్లు పూర్తి కాగా, మరో 63,306 ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. గత జనవరిలో ఆ ఇళ్ల పంపిణీ మొదలుపెట్టగా, వచ్చే డిసెంబరు నాటికి ఆ పంపిణీ పూర్తి చేస్తాం. ప్రభుత్వ పని అంటే నాసిరకం అన్న పేరు పోయి, ప్రభుత్వం ఏ పని చేసినా పూర్తి నాణ్యత ఉంటుందన్న పేరు తెచ్చుకోవాలి. అది ఇప్పుడు జరుగుతోంది. ఆ సంకల్పంతోనే ఖర్చు ఎక్కువైనా సరే ఇళ్ల నిర్మాణంలో పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని వివరించారు. నిజానికి ఈ మహాయజ్ఞానికి ఆటంకం కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ శాయశక్తులాప్రయత్నించింది.
అందుకు కారణం ఏమిటంటే, ఇళ్ల నిర్మాణం పూర్తయితే,జగన్‌కు ఇంకా మంచి పేరు వస్తుంది. తమ అడ్రస్ పూర్తిగా గల్లంతు అవుతుందన్న భయంతో ఏవేవో కారణాలు చూపుతూ, కోర్టులను ఆశ్రయించడం వల్ల నా నియోజకవర్గం పులివెందుల, విశాఖతో సహా పలు చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోయింది. ఆ విధంగా ఏడాది పాటు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఇటీవలే విశాఖలో భూముల సేకరణకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో సన్నాహాలు చేయమని అధికారులను ఆదేశించాము. ఏప్రిల్‌లో అక్కడికి వెళ్లి 1.80 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా, ఇంటి కాగితాలు కూడా ఇచ్చి, వెంటనే ఇళ్ల నిర్మాణం మొదలు పెడతామన్నారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా సరే రెండేళ్ల ఈ మిషన్‌లో నిరుపేదలందరినీ ఇంటి యజమానులు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. కచ్చితంగా దాన్ని పూర్తి చేస్తామని గట్టిగా చెబతున్నానని సిఎం జగన్ ప్రకటించారు.