- అప్పులకుప్పగా చేసి నడివీధిలో పెట్టారు
- పన్నులు వేస్తూ ప్రజలను దోచేస్తున్నారు
- జగన్ సిఎం అయ్యాక ఒక్క పరిశ్రమకూడా రాలేదు
- జగన్ తయారు చేసిన సైకోలను అణచివేస్తాం
- విశాఖలో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో బాబు
విశాఖపట్టణం, మే 5 : రాష్టాన్న్రి నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాల్సిన ఏపీని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అన్నింటి ద పన్నులు వేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. గురువారం విశాఖలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు.జగన్ జె బ్రాండ్స్, డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. జగన్‌రెడ్డి చేస్తున్న అప్పులన్నీ మనమే కట్టాలని అన్నారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్టాన్రికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు. గ్రామానికో రౌడీని, సైకోను తయారు చేశారని, సైకోలను పూర్తిగా అణచివేస్తామన్నారు.
పదవులు రావాలంటే ప్రజలతోనే ఉండాలని.. తనతో కాదన్నారు. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మనమేమి బాబాయిని చంపలేదు.. కోడి కత్తి డ్రామాలు ఆడలేదని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఒక్క చాన్సు ఇస్తే.. సీఎం జగన్ రాష్టాన్న్రి అప్పుల పాల్జేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్‌ను కరోనా కంటే ప్రమాదకారిగా అభివర్ణించారు. ఆయన పాలనలో రాష్ట్ర ఆదాయం పెరగలేదు.. ప్రజల ఆదాయం పెరగలేదు.. ఖర్చులు మాత్రం పెరిగిపోయాయన్నారు.
నాడు పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టి.. అధికారంలోకి వచ్చాక గుద్దులే గుద్దుతున్నారని ఎద్దేవాచేశారు. టీడీపీ నాయకులపైన దాడులు.. పార్టీ కార్యాలయంపైనా దాడులు.. నన్ను భయపెట్టేందుకు నాపైనే కేసులు. అసెంబ్లీలో నన్నే కాకుండా నా కుటుంబాన్ని అవమానిస్తున్నారు. అసెంబ్లీ కాదు అది.. కౌరవ సభ. భయపడను. అప్పుడే చెప్పాను.. ధర్మాన్ని పరిరక్షించి మళ్లీ అధికారంలోకి వస్తాం. ప్రజల ముందు దోషిగా నిలబెడతా. వైసీపీకి శాశ్వత రాజకీయ సన్యాసం చేయిస్తానని ప్రకటించారు. మూడేళ్లలో ఏడు సార్లు..నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. పామాయిల్ నుంచి పెట్రోల్, గ్యాస్, కరెంటు చార్జీలు.. ఇలా అన్ని ధరలూ బాదుడే బాదుడు. కరెంటు ఎప్పుడొస్తుందో తెలియదు గానీ బిల్లు మాత్రం బాదుడే బాదుడు. మూడేళ్లలో ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారు. టీడీపీ హయాంలో ఆర్థిక కష్టాలున్నా రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా ఇచ్చాం.
భవిష్యత్‌లో విద్యుత్ చార్జీలు పెంచబోమని స్పష్టంగా చెప్పాం. పవన విద్యుత్, సోలార్ వల్ల రూ.2.50 చొప్పున యూనిట్ లభ్యమయ్యేది. అవన్నీ ఆగిపోయి.. ఇప్పుడు విద్యుత్ బిల్లు చూసి వినియోగదారుడి గుండె ఆగినంత పనవుతోందని బాబు అన్నారు. ఇప్పుడు మద్యం కోసం రోజుకు రూ.200 పైనే ఖర్చుచేస్తున్నారు. అప్పుడు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్‌రెడ్డి.. ఇప్పుడేమో మద్యం తాగవచ్చని చెబుతున్నాడు. హోం మంత్రి మాట్లాడుతూ.. తాగిన మైకంలో అత్యాచారాలు చేస్తున్నారని అంటున్నారు. అలాంటి హోంమంత్రి ఉంటే ఎంత… లేకుంటే ఎంత? మూడేళ్లుగా ఉద్యోగులను కూడా మోసం చేశారని విరుచుకుపడ్డారు.