‘‘కారణమేదైనా నేరగాళ్లకు, లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారికి నిస్సిగ్గుగా పార్టీ టికెట్లను కేటాయించి అభ్యర్థులుగా నిలబెడుతుండడం నిజంగా భరించరాని విషయం. ఇందుకు ఇప్పటి ఎన్నికలలో చోటు చేసుకున్న రెండు మూడు పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. ఒక ఘటనలో బాధితురాలు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్ క్రీడలో రాణించిన వనిత సాక్షి మాలిక్. తనపై అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నెత్తి నోరై మొత్తుకునా ఆమెది అరణ్య రోదనే అయింది. అదట్లా ఉంచితే ఆయనను తప్పించినా ఆయన కొడుకుకు బిజెపి ఎంపి టెకెట్ ఇవ్వడంపై ఆమె విరక్తి చెంది క్రీడల నుంచే విరమించుకున్నది. ఈ విషయమై ఆమె తీవ్ర నైరాశ్యానికి లోనైనా ఆమెకు స్వాంత్వన కరువైంది. ఇక కర్నాటకలో తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రజ్వల్ రేవణ్ట విషయం తెలిసిందే..’’
ప్రజల విశ్వాసాలతో రాజకీయాలు
ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగంపై చర్చ అవసరం
రాష్ట్రంలో, దేశంలో ఒక వైపు వేడి గాలులు కొనసాగుతుండగా..మరోవైపు లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాజకీయాలు హీటెక్కాయి. రాజకీయ పార్టీలు వివేచనా రహితంగా గెలుపే లక్ష్యంగా అవకాశమున్న అన్ని అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తున్నారు. అర్థం పర్థం లేని, ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగం లేని సవాళ్లు ప్రతి సవాళ్లతో ఊదరగొడుతున్నారు. ఒకప్పుడు రాజకీయాల్లో నైతికతకు ప్రాధాన్యనిచ్చేవారు. రాజకీయ నాయకులు చాలా వరకు నైతిక విలువలకు కట్టుబడి ఉండేవారు. పార్టీ మార్పిడులూ, అలవి కాని హామీలు అరుదుగా కనిపించేవి. ఇప్పుడైతే నాయకులలో ఏ మాత్రం నిలకడ లేదు. నిన్న చెప్పిన మాటకే నేడు కట్టుబడి ఉండడం లేదు. ఇచ్చిన మాట తప్పడానికి, పచ్చిగా అబద్ధపు ప్రచారాలు చేయడానికి వారు ఏ మాత్రం వెనుకాడడం లేదు. పైగా అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు తేలికగా తీసుకుంటునన్నారు.
ఇక ప్రస్తుతం రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ప్రజలు విశ్వసించే దేవుళ్లను ఇప్పుడు వారి రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం తమ వల్లే సాధ్యమయిందని, ప్రధాని నరేంద్ర మోదీనే దాని సాధకుడని బలంగా ప్రణాళిక ప్రకారమే ఎన్నికల వేళకు ప్రజల్లోకి తీసుకుని వెళ్లి వోట్ల రూపంలో దాన్ని మలుచుకోవడానికి బిజెపి తన శాయశక్తుల కృషి చేసింది. సరే నూటికి నూరు పాళ్లు అది వారితోనే సాధ్యమయింది. అయితే వారు దాన్ని రాజకీయాలకు వాడుకోవడమనేదే వారి చిత్త శుద్ధిలో లోపాన్ని, వారిలోని పారదర్శకత లేమిని స్పష్టంగా కనబరుస్తున్నది. ఇక మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి పోయిన చోటల్లా స్థానిక దేవుళ్లపై ఒట్టు పెట్టడమనేది సరిjైున పద్ధతి కాదు. అవసరమయితే ఓ ఒక్కసారో అలా ఒట్టు పెట్టుకుంటే దానికి సార్ధకత ఉండేదేమో. పోయిన చోటల్లా పదేపదే దేవుళ్లపై ఒట్లు పెడుతుండడం ప్రజలకు కూడా కొంచెం అసహనం కలిగించే విషయమే. చెప్పిన మాటే పదేపదే చెప్పడం వల్ల ఆ మాటకు ఉండే పవిత్రత పోతుంది. ఇలా ప్రజల విశ్వాసాలను రాజకీయలకు ఉపయోగించుకోడం ఏ పార్టీకైనా దీర్ఘ కాలంలో అంత శ్రేయస్కరం కాదు. కేవలం వోట్ల కోసం ఇంతగా దిగజారడం అంత మంచిది కాదు.
ఇక ఇటీవల ఎన్నికల ప్రచారంలో పదేపదే చర్చకు వొస్తున్న అంశాలు రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రజల ఆర్థిక-సామాజిక గణన. వీటిపై చర్చలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు కేవలం ఎన్నికల కోసమే. ఎన్నికల అనంతరం వీటి ఊసే ఉండదు. వీటిపై విస్తృత స్థాయిలో చర్చ జరిగితేనే ప్రజలకు ఉపయోగం. కాని కేవలం ఎన్నికల్లో అబ్దికి తప్పితే ఏ రాజకీయ పార్టీ అయినా పారదర్శకతతో, చిత్త శుద్ధితో నిజంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే రీతిలో వీటిని ఆచరణలోకి తెస్తుందన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లింది. రాజ్యాంగం రద్దు కానీ, తద్వారా రిజర్వేషన్ల రద్దు కానీ మనలాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో అంత ఆషామాషీ విషయం కానీ, సాధ్యమయ్యే విషయం కానీ కాదు. అయితే నేటి పాలకులు రాజ్యాగం అమలులో ఉండగానే అది ప్రజలకు కల్పించిన అనేక హక్కులను, అవకాశాలను అధికార దుర్వినియోగంతో కాలరాయడం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అధికారం చేతులో ఉంటే అవలీలగా ప్రజల హక్కులను హరించగలిగినప్పుడు తేనె తుట్టె వంటి రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ల రద్దు వంటి చర్యలకు పాల్పడే సాహసం చేస్తారనేది అవివేకమే. కనుక ఈ అంశాలను పక్కన పెట్టి నిజంగా ప్రజలకు మేలు చేయదలుచుకుంటే రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను, స్వేచ్ఛను పరిరక్షించడానికి శాయశక్తులా పాటు పడితే అది ప్రజల్లో వారికి తప్పనిసరిగా గుర్తింపును తెస్తుంది. ఇక ప్రజల జీవన స్థితి గతులను తెలుసుకోవడానికి పిరియాడికల్‌గా సామాజిక-ఆర్థిక సర్వే వంటివి అత్యావశ్యకం…ప్రజలకు అవసరం. ఎందుకంటే ప్రభుత్వం పక్షపాత రహితంగా ప్రణాళికలు రచించడానికి, ఆ దిశగా చర్యలు చేపట్టడానికి అవి తప్పనిసరి. రోజురోజు ఆర్థిక అంతరాలు పెరుగుతున్న నేటి తరుణంలో వాటిని సాధ్యమయినంత మేర, రాజ్యాంగానికి లోబడి నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టడానికి ప్రజల వాస్తవ స్థితిగతులను తెలియబరిచే గణాంకాలు అవసరం.
ఇక రాజకీయ పార్టీల్లో, నాయకుల్లో అదర్శం, శీలం అనే మాటలకు ఇప్పుడు అర్థమే లేకుండా పోయింది. కారణమేదైనా నేరగాళ్లకు, లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారికి నిస్సిగ్గుగా పార్టీ టికెట్లను కేటాయించి అభ్యర్థులుగా నిలబెడుతుండడం నిజంగా భరించరాని విషయం. ఇందుకు ఇప్పటి ఎన్నికలలో చోటు చేసుకున్న రెండు మూడు పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. ఒక ఘటనలో బాధితురాలు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్ క్రీడలో రాణించిన వనిత సాక్షి మాలిక్. తనపై అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నెత్తి నోరై మొత్తుకునా ఆమెది అరణ్య రోదనే అయింది. అదట్లా ఉంచితే ఆయనను తప్పించినా ఆయన కొడుకుకు బిజెపి ఎంపి టెకెట్ ఇవ్వడంపై ఆమె విరక్తి చెంది క్రీడల నుంచే విరమించుకున్నది. ఈ విషయమై ఆమె తీవ్ర నైరాశ్యానికి లోనైనా ఆమెకు స్వాంత్వన కరువైంది. ఇక కర్నాటకలో తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రజ్వల్ రేవణ్ట విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఇటువంటి అంశాలు వారి పార్టీలకు కానీ, దేశానికి కానీ అంతగా శ్రేయస్కరం కాదు.
-వి.రామ్మోహన్ రావు,
ప్రజాతంత్ర ప్రతినిధి





