•జూలై 1న అమలు కానున్న కొత్త నేర చట్టాలను అడ్డుకోవాలి
•రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : పౌర, హక్కులను కాలరాసి ప్రజలపై అణచివేతను పెంచే కొత్త నేరచట్టాలను బేషరుతుగా వెనక్కి తీసుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ చట్టాలను స్వతంత్ర న్యాయ నిపుణుల బృందం చేత పునః సమీక్షించాలన్నారు. వాటిని తిరిగి పార్లమెంటులో చర్చించి, వాటిపై విస్తృత ప్రజాభిప్రాయాన్ని, న్యాయ వ్యవస్థలో భాగమైన అన్ని వ్యవస్థల అభిప్రాయాల్ని సేకరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మహిళా ట్రాన్స్ జెండర్స్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పౌర హక్కులను మరింత అణిచివేసే కొత్త నేర చట్టాలలు ఎవరి ప్రయోజనాల కోసం? అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం సామాజిక కార్యాకర్త కె.సజయ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా హాజరైన వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్, ఆంధ్రజ్యోతి సంపాదకులు డా. కె.శ్రీనివాస్, పివోడబ్ల్యూ జాతీయ కార్యదర్శి సంధ్య, మహిళా ట్రాన్స్ జెండర్ సంఘాల జేఏసీ నేత రచన ముద్రబోయిన, సామాజిక కార్యకర్త ఖలీదా పర్వీన్, జాన్సీ, విమల తదితరులు మాట్లాడుతూ గత సంవత్సరం 2023 డిసెంబర్ 20 వ తేదీన ఎన్డీఏ ప్రభుత్వం మూడు కొత్త నేర చట్టాలను ప్రవేశపెట్టి ఎటువంటి చర్చకు అవకాశం సంహిత చట్టం దీనిని ఆమోదింప చేసుకుందన్నారు. ఈ కొత్త చట్టాలతో ప్రమాదకరమైన అంశాలు చేర్చారని పేర్కొన్నారు. సారాంశంలో ఈ కొత్త నేర చట్టాలను పూర్తి స్థాయిలో అమలుచేస్తే మన ప్రజాస్వామ్యాన్ని హరించి దేశాన్ని ఒక పూర్తి స్థాయి ఫాసిస్టు రాజ్యాంగా మార్చి వేసే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పిస్తాయని, అవి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని, ప్రశ్నించే వారిని, ప్రతిపక్షాలను, చట్టబద్ధంగా వ్యవహరించే ఉద్యమకారులను, సామాజిక కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేయటానికి, నిర్బంధించి వుంచటానికి ప్రభుత్వానికి మితిమీరిన అధికారాలను కట్టబెడతాయని తెలిపారు. కాబట్టి ఇంతటి దుర్మార్గమైన చట్టాల అమలును వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు.