దేశానికి స్వచ్ఛత పాఠాలు నేర్పింది సిద్ధిపేటనే…
సర్పంచుల పదవీ గడువు పొడిగింపుపై పార్టీ తరపున కోరతాం
సర్పంచ్, ఉప సర్పంచుల ఆత్మీయ సత్కారంలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 25 : ఎంత కష్టపడినా నూటికి నూరు శాతం ప్రజలను సంతృప్తి పరచలేమనీ, దేశానికి స్వచ్ఛత పాఠాలు నేర్పిన ఘనత సిద్ధిపేట నియోజకవర్గానిదేనని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని సర్పంచులు, ఉప సర్పంచుల ఆత్మీయ సత్కారంలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… అవార్డులలో ఆదర్శం మన సిద్ధిపేటనే..మీ చైతనం గొప్పదని సర్పంచులను ఉద్దేశించి అన్నారు. సిద్దిపేట సాగు…త్రాగు నీరు… గోదావరి జల కల వారి హయాంలో కావడం వారి జీవితంలో ఒక సంతృప్తి అని, సిద్దిపేటకు గోదావరి జలాలు వారి హయాంలోనే జరిగిందనే గొప్ప సంతృప్తి వారి పదవికి వొచ్చిందన్నారు. సాగు నీరు… త్రాగు నీరు మీ హయాంలో వొచ్చింది చరిత్రలో నిలిచే పనులు చేసిన తృప్తి మీకే దక్కుతుందన్నారు.
మండుటెండల్లో మత్తళ్లు దుంకిన చెరువుల్లో గోదారమ్మకు స్వాగతం పలికిన గొప్ప పనిలో వారు భాగస్వామ్యం అయ్యారనీ, అంతేకాకుండా, స్వచ్ఛత స్పూర్తి మన సిద్దిపేటనే… అందులో వారి పట్టుదల అమోఘమని ఆయన ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత దేశంలో తొలి ఓడిఫ్( బహిరంగ మల విసర్జన రహిత) నియోజకవర్గం సిద్దిపేట అని, నియోజకవర్గంలో 47 అవార్డులు, 33 జాతీయ స్థాయి అవార్డులు, 9 రాష్ట్ర స్థాయి అవార్డులు, 5 జిల్లా స్థాయి అవార్డులు, 17మున్సిపాలిటీలలో జాతీయ అవార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో 16 జాతీయ అవార్డులు…మొత్తంగా 33 జాతీయ స్థాయి అవార్డులు వొచ్చాయన్నారు. 5 మున్సిపాలిటీలలో రాష్ట్ర స్థాయి, గ్రామీణ ప్రాంతాల్లో 5 రాష్ట్ర స్థాయి అవార్డులు.. మొత్తంగా నియోజకవర్గంకు 47 అవార్డులు పొందామన్నారు. నియోజకవర్గంలో 46 గ్రామాలకు నిర్మల్ పురస్కార్‌లు, దేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి..గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్ అన్నారు. మొదటి పౌరుడు అనేది ఒక గుర్తింపు మాత్రమే కాదు, గ్రామ అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుండి నడిపేవాడు సర్పంచు అన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే కంటే ఓ ప్రజా ప్రతినిధిగా సర్పంచ్ కొన్ని కఠిన పరిణామాలను ఎదుర్కునాల్సి ఉంటుందన్నారు. గ్రామంలో పంచాయితీలు, గొడవలకు సర్పంచ్‌నే పెద్ద మనిషి అని, ఇరు వర్గాలు నిత్యం కళ్ల ముందే ఉంటారనీ, ఎవరి వైపు తీర్పు చెప్పినా ఇంకొకరికి కంటు కావలసిందేనని, అవతలి వ్యక్తి ముఖం మీదనే నాలుగు మాటలు అని పోతాడన్నాడు. అన్నీ చక్కదిద్దుకుంటూనే మళ్లీ అభివృద్ధిని చూసుకోవాలన్నారు. పథకాలు అందకుంటే సర్పంచ్‌కే తిప్పలు అని, అభివృద్ధి పని చేయకున్నా ఇబ్బందేననీ, సిద్దిపేట నియోజకవర్గ సర్పంచులు అల్ రౌండర్లు, అన్నీ పనుల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారన్నారు. కొరోనా కష్ట కాలంలో ప్రజలకి అండగా ఉన్నారనీ, కొరోనాతో చనిపోతే దహన సంస్కారాలు ధైర్యంగా చేయించారనీ, ప్రజా సేవలో మీ పటిమ ఎల్లప్పుడూ ఉంటాయనీ, ఎన్నో పనులు పట్టుదలతో సాధించుకున్నారన్నారు.
మీరు అంత నా కుటుంబ సభ్యులు.. మీకు కష్టం వొస్తే నేను ఉన్నా… నాకు కష్టం వొస్తే మీరు ఉన్నారన్నారు. మీకు అన్నింటికి ఆండగా ఉంటాయన్నారు. మన ప్రభుత్వం మన రాష్ట్రంలో మీ సారథ్యంలో అద్భుతమైన ప్రగతి సాధించుకున్నామన్నారు. సర్పంచుల పదవీ గడువు పొడగింపుపై పార్టీ తరపున కోరుతామన్నారు. మీరు సర్పంచ్ పదవీనే కాదూ, ఇంకా మంచి పదవులు పొందాలని ఆశిస్తున్నాననీ, పదవీ వీడ్కోలు శుభాకాంక్షలు తెలుపుతూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ ఆత్మీయ సత్కారంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్యరెడ్డి, నంగునూరు జడ్పిటిసి సభ్యురాలు తడిసిన ఉమావెంకట్‌రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, మారెడ్డి రవీందర్‌రెడ్డి, కాముని శ్రీనివాస్, సూరగోని రవిగౌడ్, జాప శ్రీకాంత్‌రెడ్డి, కుంబాల ఎల్లారెడ్డి, రాగుల సారయ్య, గుర్రాలగొంది అంజి, రామునిపల్లి శ్రీనివాస్, కాముని ఉమేష్చంద్రతో పాటు ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.



