- ఐసియులో రోగిని కొరికిన ఎలుకలు.
- తీవ్ర రక్త స్రావం…రోగి పరిస్థితి విషమం
ఎంజిఎం.మార్చి 31, (ప్రజాతంత్ర విలేఖరి)వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో దారణ ఘటన జరిగింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో రోగిని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. హనుమకొండ నగరంలోని భీమరానికి చెందిన శ్రీనివాస్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఈ నెల 26 వ తేదీ సాయంత్రం ఆస్పత్రిలో చికిత్సకోసం అడ్మిట్ అయ్యాడు. 27వ తేదీ ఉదయం లేచి చూసేసరికి శ్రీనివాస్ వేలును ఎలుక కొరికి ఉండడం బంధువులు గమనించి స్థానికంగా వైద్యులకు తెలపడంతో చికిత్స చేశారు. మళ్లీ గురువారం ఉదయం సుమారు మూడు గంటల ప్రాంతంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు శ్రీనివాస్ కాళ్ల వేళ్ళ పై తీవ్రంగా కొరకడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్పటికే ప్రాణాపాయ స్థితి లో ఉన్న శ్రీనివాస్, ఎలకల దాడితో తీవ్ర లో అనారోగ్యానికి గురయ్యారు.
ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం పై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఓ రోగిని ఎలుకలు కొరికేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ కే తలమానికమైన ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరగడం పట్ల రోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వస్తే ఐసీయూలోనే ఎలుకలు కొరికి గాయపరచడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐసీయూలో రోగిపై ఎలుకల దాడి విషయంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు స్పందించారు.
శానిటేషన్ కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేశామని తెలిపారు. పక్కనే కిచెన్ ఉండడంతో ఎలుకల బెడద ఉందని అన్నారు.రోగుల బంధువులు ఆహారాన్ని బయటే పడవేయడం వల్ల ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయని అంతేకాకుండా పాత బిల్డింగ్ కావడం కూడా దీనికి ప్రధాన సమస్యగా ఉందని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు .ఘటనపై సమాచారం అందుకున్న అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ ఆస్పత్రిని సందర్శించి ఎలుకల బెడదకు గల కారణాలపై ఆరా తీశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైనేజీ, పారిశుద్ద్య పనులను మెరుగుపర్చాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.