Take a fresh look at your lifestyle.

ఉద్వేగం నుండి వెలువడిన కవిత్వం…

కల్లోల క్షుభిత జీవనంలో చోటు  చేసుకునే పరిణామాలు ప్రభావితం చేస్తే ఆ హృదయ ఉద్వేగం నుండి వెలువడే కవిత్వం అనేక  విభిన్న పార్శ్వాలను ఆవిష్కరిస్తుంది. కాల పరీక్షలే మానవ సమాజాన్ని క్షోభపెట్టాయి. భావోద్వేగాలకు అక్షరాకృతి ఇచ్చి స్వాంతన చెప్పుకోవడం సున్నితులైన కవుల పని. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలకు నిలువెల్లా మరిగిపోయిన కవి సోమశిల తిరుపాల్‌. ‌ప్రగతిశీల దృక్పథంతో కూడిన భావావేశంతో కవిత్వం రాస్తున్న కవిగా ఆయన గుర్తింపు పొందారు. తరమెల్లిపోతుంది అన్న తిరుపాల్‌ ‌కవితా సంకలనంలోని కవితల నిండా సహజమైన భాషలో  సామాన్యమైన వస్తువులు ఎన్నుకొని కవి ఎంత వేదన పడ్డారో అవగతమవుతుంది. సమాజం పట్ల స్పష్టమైన నిజాయితీ, నిబద్ధతను వ్యక్తిత్వంతో మిళితం చేసి వ్యక్తీకరించిన భావాల కూర్పుగా ఈ సంకలనంలోని 44 కవితలున్నాయి. కరువొచ్చినా, కరోనా ఆగం చేసినా కష్టజీవులకే చెప్పలేని తిప్పలు అని ఆగంజేసిన ఆకాశ పయనం కవితలో అంటారు. మాయదారి పాడురోగం కరోనా కంటిమీద కునుకు లేకుండా బతుకులను శాపంగా  మార్చిందని కుమిలిపోయారు. ఊరికీ ఊరికీ, మనిషి మనిషికీ మధ్య కరోనా దెయ్యం బంధం తెంచేసిందన్నారు. కరోనా కాలం కవితలో  ఉరుకుల పరుగుల జీవితం ఇంట్లోనే బందీ అయ్యిందని అన్నారు. అష్టదిక్కులను అల్లకల్లోలం చేసిన రూపం లేని కరోనాను ఖతం చేయాలని అన్నారు.

వచ్చేటప్పుడు ఏమి తీసుకురారు/  పోయేటప్పుడేమీ పట్టుకుపోరంటూ చావుపుట్టుకల సారాన్ని వివరించారు. కరోనా వల్ల నగరం లాక్డౌన్తో మూగబోయిందని వేదన చెందుతూ కర్పూరంగా కరోనా కరిగిపోతే ఎంత బాగుండు అంటారు. ఎవరో వస్తారని ఎదురు చూడక తస్మాత్‌ ‌జాగ్రత్తగా ఉండి కరోనా ఎదుర్కొమ్మన్నారు. తాళం తీసిండ్రు, దేశం తెరిసిండ్రు అంటూ ఇతర దేశాల నుండి ఇక్కడికి వచ్చి అంతటా పాకి ఊహించనంత భయంకరంగా  పెరిగి ప్రాణాలు తీసిన కరోనా వైరస్ను బొంద పెట్టాలని అన్నారు. చీకట్ల మగ్గుతున్న ఇండ్లలో, భంగపడ్డ బతుకులలో చిరుదీపం వెలగాలని కోరుకున్నారు. ప్రాణం పోయినంక ప్రవేశపెట్టే కంటితుడుకు చర్యలు మాకొద్దు అంటారు. మాకు గంజి దొరికేటట్టు చేస్తే నీకు పరమాన్నం పెట్టి పూజించుకుంటామని పాలకులను ఉద్దేశించి అన్నారు. నిర్భాగ్యులకు తడారిన గొంతు తడపండి/  మణులు, మాణిక్యాలు మాకేమి వద్దు అని వేదనతో చెప్పారు. శిల్పుల ద్యాసకు, శ్వాసకు జోహార్లు పలికారు. తరమెల్లిపోతుంది కవితలో మరుపు రాని మహనీయుల తరమెల్లిపోతుందని మనల్ని విడిచి  అంటూ ఆ స్వరం తిరిగి వరమై రావాలి అని కోరుకున్నారు. వీరయోధుల చరిత్రలు భావితరాలకు పంచి అక్షర  నీరాజనాన్ని అర్పించాలని చెప్పారు.

మన చెరువులే మన బతుకుదెరువులు/  మన ప్రాజెక్టులే ప్రగతికి ప్రతిరూపాలు అని చెప్పారు. మ్యూజియంలో నా పల్లె అన్న కవిత వర్తమాన పల్లె చిత్రాన్ని ఆవిష్కరించింది. ఇంకెక్కడుంది నా పేరు ?/   ఇంకేడుంది నా వూరు ?/   ఇంకెక్కడుంది నా మెతుకు ?/  ఇంకేడుంది నా బతుకు ? అని వాపోయారు. కదలాలి నేటి కవుల కలాలు,  అలనాటి పదాల దారుల్లో అని కవిగా ఆకాంక్షించారు. దొంగ బాబాల దుర్మార్గపు స్వార్థానికి మరణించేది సగటు మనిషి అయిన భక్తుడే అంటూ జాగ్రత్త పడమంటారు. వాట్సాప్‌ ‌కవిత ఎన్నెన్నో విపరీతాలను స్పష్టంగా వివరిస్తూ సాగింది. అతడొక సైన్యం, సాహసం, సమరం, సహనం అంటూ జ్యోతిబాపూలేను అభివర్ణించారు. బడుగు జీవుల గొడుగుగా అంబేద్కర్ను కొనియాడారు. తొలినాటి ధ్వని కవితలో దాశరథి భవ్య కవితావేశాన్ని  వెల్లడించారు. విశ్వంభరుడు కవితలో జ్ఞానపీఠానికే వన్నెలద్దిన కవిగా సినారెను చూపించి ఆయన కవితా ప్రతిభను కవిత్వీకరణతో చూపించారు.  ముత్తాతలిచ్చిన ముల్లుకర్ర ఎంతగొప్పదో చెప్పారు. పరవశించే ప్రకృతి అందమే బతుకమ్మకు గొప్ప నైవేద్యమని అన్నారు. వీరసైనికుని రుణం ఏమిచ్చి తీర్చుకోగలమని చెప్పి కవితాక్షర నీరాజనం అందించారు. అవినీతిపరుల అత్యాశ ఎప్పటికైనా దగ్దం అవ్వవలసిందేనని అన్నారు. కార్మికుల శ్రమ ఫలం కాళేశ్వరమని చెప్పి అన్నదాత బతుకులు బాగుపడాలని కోరుతూ పచ్చని పొలాలలో కొత్త పాటలు పాడుకోవాలని ఆకాంక్షించారు. యాది మరిచిన కాలిబాట కవితలో గురుతులు ఎప్పటికీ మా యాదిలో అని గొప్ప ముగింపును  ఇచ్చారు. జ్ఞానం పంచిన విజ్ఞాన్‌ ‌భవన్‌  ‌పునాది రాళ్లను తలుచుకొని మనసారా మ్రొక్కారు. ఆశాదీపాలను అకస్మాత్తుగా వచ్చి ఆర్పేసిన రాకాసి రైలుని నిందించారు. కన్నీళ్లు తాగి కడుపు నింపుకున్న ఒంటిపూటలను బొంబాయిలో బాటసారి కవితలో గుర్తు చేశారు. బస్సు కార్మికుల ఆకలి పేగుల నినాదాన్ని కవిత్వంగా పరుగులెత్తించారు. మానవ మనుగడను మరణ రాగంగా మార్చిన మనిషిని నిలేశారు. లోకం మెచ్చిన మాతృమూర్తికి వందనమర్పించారు. నమ్ముకున్న పొలాన్ని తెగనమ్ముకొని ఆకలి కేకలతో వీధిలో నిలబడ్డ కష్టజీవుల గతుకుల  బతుకులను వివరించారు. పాత్రలో పశుపతి, మనసులో పసిడి అన్న కవితలో రైతన్న లాంటి కష్టజీవుల ఘోషను తెలిపారు. అందరి బంధువయా అంటూ వన్నోజు వీరబ్రహ్మయ్యలోని ప్రతి ప్రత్యేకతను ఎలుగెత్తి చాటిచెప్పారు.

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు భక్తి ముదిరి  నెత్తురు అయిందని వేదన చెందారు. మన తరం – ఓ వరం కవితలో నాటికి నేటికీ ఉన్న ఎన్నో వ్యత్యాసాలను వివిధ అంశాలుగా విభజించి చూపారు. ప్రచార కూలీలు కవిత ఓట్ల కాలంలోని కూలీల ఆకలి కష్టాలను వివరించింది. సీటు కోసమే మీ పోరాటం/  పూట కోసమే మా ఆరాటం/  పదవుల కోసమే మీ పాకులాట/  బతుకుల కోసమే మా  దేకులాట అనడంలో కూలీ కార్యకర్తల వేదనాంతర రంగం వ్యక్తమైంది. ఒక్కసారి వచ్చి చూడు కవిత బువ్వ జీవుల వెయ్యి బాధలను కండ్ల ముందు నిలిపింది. మాకో పడవ కావాలి కవితలో నిత్య కష్టంపై బతికే వారి పక్షాన భూమాతకు కవి శతకోటి వందనం చేశారు. సకల కళల భారతిని ప్రజలకు అందిన రవీంద్రభారతిని రమణీయ కానుకగా అభివర్ణించారు. కవికి రవీంద్రభారతితో ఉన్న గాఢమైన అనుబంధాన్ని ఈ కవితలోని  ప్రతి వాక్యం చెబుతుంది. డబ్బు శ్రీమంతుల జబ్బు తేల్చారు. పాత ఊరు పేరిట సోమశిల సొగసులు ఆనాటి గుర్తులను హృదయం కదిలించే కవితా వ్యాక్యాలతో గుర్తు చేశారు. నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా సోమశిల గ్రామానికి చెందిన కవి గ్రామాన్ని అన్ని కోణాలలో విశ్లేషిస్తూ రాసిన  ఊరు కన్న ఎత్తు తరాలు గడిచిన రాగి చెట్టు/  గంగిరెద్దులొల్ల ఆట /  బ్రహ్మంగారి ఆట అల్లిరాని పాట/  బంక మన్ను తడిపి మిద్దెకప్పు వేస్తే.. ఎండకాలం గూడా సల్లంగ ఉండేది వంటి ప్రయోగ వ్యాక్యాలు ఎంతో  లోతుగా ఆలోచింపజేసి అంతరంగ జ్ఞాపకాలను తడుముతాయి.

కవి పడ్డ తపనకు ఈ కవితా సంపుటిలోని ఎన్నో కవితలలో కనిపించే అరుదైన వ్యాక్యాలు సాక్ష్యమవుతాయి. సహజమైన శైలిలో, అతిసామాన్యమైన వస్తువును కూడా ఎంతో ప్రావీణ్యతతో చక్కగా మలిచేందుకు కవి చేసిన ప్రయత్న పరంపర ఇందులో ప్రత్యేకంగా  కన్పిస్తుంది. కవనంలో కవి పరిణామక్రమాన్ని అనేక కవితలు ప్రతిబింబించాయి. జీవితాన్ని    స్వేచ్ఛామయంగా విహరింపజేసే రీతిలో నిజమైన కవిత్వం ఉండాలన్న కవిపండితుల అభిప్రాయాలకు నిదర్శనంగా నిలిచే కవితలే ఈ సంపుటిలో ఎక్కువగా ఉన్నాయి. వర్తమానమే కాకుండా భవిష్యత్తు పట్ల, బ్రతుకు పట్ల ఎంతో కాంక్ష కవి తిరుపాల్లో  ఉన్న తీరు స్పష్టమవుతుంది.  సార్వజనీన, సార్వకాలిక, సర్వజనామోదం పొందే రీతిలో కవి తన కవిత్వాన్ని మలచుకున్నారని  ఈ సంపుటిలోని ఎన్నో కవితలు వెల్లడించాయి. నువ్వు చదవాలనుకున్న పుస్తకాన్ని ఇంతవరకూ ఎవరూ రాయకపోతే ఆ పుస్తకాన్ని నువ్వే రాయాలి అన్న మాటలను  బలంగా  కవి విశ్వసించారనడానికి తరమెల్లిపోతుంది అన్న కవితా సంపుటి ఉదాహరణగా మారుతుందనడంలో సందేహం లేదు.
              – డా. తిరునగరి శ్రీనివాస్‌
8466053933

Leave a Reply