పటాన్చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 23 : పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు వొస్తదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా మెట్రో వొస్తే పటాన్చెరు దశనే మారిపోతదని కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పటాన్ చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డికి మద్దతుగా బాట్లాడుతూ…పటాన్చెరులో కాంగ్రెస్ హయాంలో పరిశ్రమల కాలుష్యంతో ఉన్న నీళ్లను ప్రజల చేత తాగించారని, వాటితో ఎలాంటి జబ్బులు వొచ్చేవి…చర్మ వ్యాధులు వొచ్చేవంటూ నాటి పరిస్థితులను ప్రజలకు గుర్తు చేశారు. నేడు మన సొంత రాష్ట్రం కాబట్టి, మనకు కడుపు నొప్పి మనకు ఉంటది కాబట్టి మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు పరిశ్రుభ్రమైన నీళ్లు అందిస్తున్నామన్నారు. ఇప్పుడు ఆ జబ్బుల బాధ తప్పిందని తెలిపారు. రోగాల బాధ తప్పిందని, కార్మికుల అవసరాల కోసం 350 పడకల హాస్పిటల్‌కి శంకుస్థాపనం చేశామని, నిర్మాణం అవుతుందని కేసీఆర్ తెలిపారు.
కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం
పటాన్చెరులో కాలుష్యం తగ్గాలని, కాలుష్యం తగ్గేందుకు కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కు వచ్చింది. హార్ట్ పేషెంట్స్‌కు అమర్చే స్టంట్లు కూడా ఇక్కడే తయారావుతున్నాయి. కంటి వెలుగు అద్దాలు గతంలో చైనా నుంచి తెప్పించామని అన్నారు. ఇప్పుడు ఈ నియోజక వర్గంలోనే తయారవుతున్నాయి. మీరు ఆల్మోస్ట్ హైదరాబాద్‌లో కలిసిపోయారు. పటాన్చెరు వేరే కాదు. ముగ్గురు కార్పొరేటర్లు కూడా ఉన్నారు. జీహెచ్ఎంసీలోకి వొచ్చేశారు. కాబట్టి మీ దగ్గర బ్రహ్మాఒండమైన కాలుష్యం లేని ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
పటాన్ చెరు నియోజకవర్గం మినీ ఇండియా…
ఔటర్ రింగ్ రోడ్డు పటాన్చెరు మీద నుంచే పోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు డెఫినెట్‌గా మెట్రో వొస్తది. దాంతో చాలా లాభం జరుగుతది. రాబోయే రోజుల్లో మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో వొచ్చేస్తే పటాన్చెరు దశనే మారిపోతదని అన్నారు. ఇక్కడ అమీన్పూర్లో 15, 20 కాలనీలు ఉండేవని, ఇవాళ 300 కాలనీలు వొచ్చాయని తెలిపారు. ఎందుకంటే ఈ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ మాదిరిగా మినీ ఇండియా అని, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారన్నారు. ఉత్తర భారతీయులు ఉంటారని, అన్ని ప్రాంతాల నుంచి ఉంటారని, పరిశ్రమల యజమానులు, అందులో పని చేసే కార్మికులు ఉంటారని కేసీఆర్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆశీర్వదించండి
పటాన్ చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలు కారు గుర్తుకు వోటు వేసి భారీ మెజారిటీతో శాసనసభ్యునిగా హ్యాట్రిక్ గా గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రొద్దున లేచిన నుంచి ప్రజల మధ్యలో ఉంటూ కష్టపడే మహిపాల్ రెడ్డిని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని ఆయన కోరారు. పటాన్ చెరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తీర్చమని, మిగతా కొన్ని సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. వాటిని కూడా నూతన ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే జీవోలు మంజూరు చేసి పనులు చేపిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రసంగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, మాజీ శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





