బూర్గంపాడు, ఏప్రిల్ 13(ప్రజాతంత్ర విలేఖరి) : ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలోని సారపాక గోదావరి బ్రిడ్జి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషయమై పాల్వంచ ఏఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు బూర్గంపాడు పోలీస్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో గోదావరి బ్రిడ్జి ప్రాంతంలో అదనపు ఎస్సై ఖాజానసీరుద్దీన్ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం వైపు నుంచి మోటారు సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు బ్యాగ్ వేసుకుని అనుమానాస్పదంగా కనిపించారు.
పోలీసులు వారి వాహనాన్ని ఆపగా ఆ వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తాము హేమ్లా గంగి, సవలం నగేష్‌లమని, సీపీఐ మావోయిస్టు పరేడ్ ఎల్వోసీ సభ్యులమని తెలిపినట్లు ఏఎస్పీ వెల్లడించారు. నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ చత్తీస్‌ఘఢ్ పామేడు ఏరియా కమిటీ ఎల్వోఎస్ కమాండర్ కమల, తెలంగాణ సీపీఐ మావోయిస్టు పార్టీ నేతలు దామోదర్, ఆజాద్ ఆదేశాల మేరకు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ అటవీప్రాంతంలో పేలుడు పదార్థాలను దాచేందుకు, పారవేసేందుకు ఇక్కడకు వొస్తున్నట్లు తెలిపారని అన్నారు.
వారి బ్యాగును తనిఖీ చేయగా పేలుడు పదార్ధాలు జిలిటెన్ స్టిక్స్ 30, డిటోనేటర్లు 24, కార్డెక్స్ వైర్ రెండు బండిల్స్, రూ.31,500 నగదు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో హేమ్లా గంగిది బీజాపూర్ జిల్లాకు చెందిన ఉసూరు పీఎస్ పరిధిలోని కమాన్పరాలోని టేకుమట్ట గ్రామమని, సవలం నగేష్ ది బీజాపూర్ జిల్లాలోని పామేడు పీఎస్ పరిధిలోని ఉడతమల్ల గ్రామంగా గుర్తించినట్లు ఏఎస్పీ తెలిపారు.
ఏప్రిల్ మొదటివారంలో ఈ ఇద్దరు నిందితులు రాసవల్లి, యర్రపల్లి సమీపంలో ఇతర పార్టీ సభ్యులతో కలిసి మావోయిస్టు టీసీఓసీ కార్యక్రమంలో పాల్గొన్నారని, ఈ కార్యక్రమంలో కిస్తారంపాడు, బత్తినపల్లి గ్రామాల మధ్య అటవీ వాహనాలను తగులబెట్టేందుకు వ్యూహం పన్నారని, ఈ సమయంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయన్నారు. అరెస్టు చేసిన వీరిని కోర్టులో రిమాండ్ చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్వంచ సీఐ సత్యనారాయణ, ఎస్సై సముద్రాల జితేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.