గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలలో కెసిఆర్‌కు పోటీగా ఈటల, రేవంత్‌లు
సిరిసిల్లలో గెలుపోటములను శాసించనున్న పద్మశాలీల వోట్లు
సిద్ధిపేట పైనా విపక్షాల గురి
రసవత్తరంగా అసెంబ్లీ ఎన్నికలు
మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్ 10 : గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల తంతు రసవత్తరంగా సాగుతోంది. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా ఎవరు ఎటువైపు ఉంటారన్న విషయంలో ప్రతీ క్షణం ఉత్కంఠగా మారింది. చివరి నిమిషంలో టికెట్ల మార్పిడి ఉద్రిక్తతలకు దారితీసింది. నిన్నటితో నామినేషన్ల గడువు పూర్తి అయినప్పటికీ చివరకు మిగిలేదవరన్నది మరో నాలుగు రోజుల్లో తేలనుంది. ఈ నెల చివరన జరుగనున్న ఈ ఎన్నికలపై కేవలం రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశంలోని రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. అందరి చూపు ఇప్పుడు తెలంగాణపైనే ఉందనడంలో అతిశయోక్తిలేదు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకువస్తామంటూ, ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ను బిఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చిన ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరీక్షకు సంబంధించిన ఎన్నికలు కావడమే అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నది. కెసిఆర్ ఇప్పటికి అనేక ఎన్నికలను ఎదుర్కున్నారు. జీవితంలో ఓటమి ఎరుగని నాయకుడిగా కొనసాగుతున్నారు. ఏ నియోజకర్గంలో నిలబడినా ప్రజలు ఆయన్ను ఆదరించారు. సుమారు రెండు దశాబ్దాలకు పైగా సాగిన ఉద్యమంలో ఆయన అనేక తడవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, ఎన్నికలను కావాలని కోరుకున్నవ్యక్తి. అయినా ఈ ఎన్నికల విషయానికొచ్చే సరికి ఆయనలో అభద్రతా భావం ఏమైనా కలిగిందా అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఏనాడు పోటీ విషయంలో వెరువని కెసిఆర్ ఈ సారి రెండు నియోజకవర్గా నుండి పోటీపడటమే. అందులో ఒకటి తన స్వంత నియోజకవర్గమైన గజ్వేల్కాగా మరొకటి కామారెడ్డి. గజ్వేల్‌కు గత రెండు విడుతలుగా ఆయనే ప్రాతినిధ్యం వహిస్తూ వొస్తున్నారు. కొత్తగా ఇప్పుడు కామారెడ్డిని కూడా ఎంచుకున్నారు.
కారణం ఏమైనప్పటికీ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గంప గోవర్ధన్ కోరికమీద తానక్కడ పోటీ చేయాల్సి వొచ్చినట్లు కెసిఆర్ చెబుతున్నారు. అలా అని గంప గోవర్ధన్ అక్కడేమీ బలహీనమైన క్యాండిడెట్ కాదు. 1994 నుండి రెండు సార్లు తెలుగుదేశం, మూడుసార్లు టిఆర్ఎస్(బిఆర్ఎస్) పార్టీల నుండి గెలిచిన వ్యక్తి. అంత సీనియర్ అయి ఉండి కూడా కెసిఆర్‌ను తన స్థానంలో ఎందుకు పోటీ చేయమన్నారన్న ప్రశ్న ఉదయించక పోదు. ముందుగానే చెప్పుకున్నట్లు ఈ ఎన్నికలు గత ఎన్నికలకు బిన్నంగా జరిగే అవకాశముంది. 2014లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో తెలంగాణ ప్రజలంతా కొత్తగా రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న మూడ్‌లో ఉండటం వల్ల ఇక్కడ విపక్షాలకు చోటు లేకుండా పోయింది. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో ఔర్ ఏక్ దక్కా అన్నట్లు, ఇల్లు అలుకగనే పండుగ అవుతుందా మరో అవకాశం ఇచ్చి అభివృద్ధిని చూడాలన్న అభిప్రాయంగా మళ్ళీ గెలిపించారు. ఇప్పుడు బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు తెగ ప్రయాస పడుతున్నది. అయితే ఏ ప్రభుత్వ పాలననైనా ఒక దశాబ్ద కాలం సాగితే ప్రజల నుండి సహజంగా వ్యతిరేకత వొస్తుందంటారు. తమ ప్రాంత ఎంఎల్ఏ ముఖ్యమంత్రి ఆయ్యాడన్న సంబరమే తప్ప ఆయన ఎన్నడూ తమకు అందుబాటులో లేడన్న విమర్శ లేకపోలేదు. దానికి తగినట్లుగా విపక్షాలు కూడా గత పదేళ్ళుగా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను తెలంగాణ ప్రజల చెవుల్లో జోరీగలా ఘోషిస్తూనే వొస్తున్నాయి.
దానికి జవాబుగా అన్నట్లు ఇటీవల కెసిఆర్ తాను అందుబాటులో లేని విషయం నిజమేనని బహిరంగ సభలోనే ఒప్పుకున్నారు. ఇక నుండి అలా జరుగదని హామీ కూడా ఇచ్చారు. కాగా ఒకవైపు దేశంలోని అన్ని రాష్ట్రాలను కాషాయంలో ముంచేయాలని బిజెపి అడుగులు వేస్తుండగా, పూర్వ ఉన్నతిని సాధించుకోవాలన్న కాంగ్రెస్ తాపత్రయం మరోవైపు దూసుకువస్తున్న తరుణంలో తన అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు బిఆర్ఎస్ పోరాటం చేయక తప్పటం లేదు. అందులో భాగంగానే కెసిఆర్ కామారెడ్డిలో కూడా పోటీ చేసేందుకు కారణంగా భావిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంతో కెసిఆర్‌కు అనుబంధం కూడా ఉంది. అక్కడ కోనాపూర్ పట్టణంలోని పోసాన్పల్లి గ్రామం ఆయన మాతృమూర్తి జన్మస్థానం కావడం వల్ల కూడా ఆయన గంప గోవర్ధన్ ఆహ్వానాన్ని కాదనలేక పోయారు. కెసిఆర్ ఇక్కడి నుండి పోటీ చేయడాన్ని స్థానిక ప్రజలు ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఇక్కడ నిర్వహించిన ఎన్నికల సమావేశంలో కెసిఆర్ స్వయంగా అన్నమాటలు అక్కడి ప్రజలను ఆకట్టుకునేవిగా ఉన్నాయి. కెసిఆర్ సింగిల్‌గా రాడు. ఆయన వొస్తే అభివృద్ది వెంట వొస్తుందని చెప్పడం చూస్తే కామారెడ్డి ప్రజలకు గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు గుర్తుకు వొచ్చే ఉంటాయి. రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే ముందుగా పేర్కొనేవి ఆ మూడు నియోజకవర్గాల పేర్లు మాత్రమే అన్నది తెలియంది కాదు. అయితే ఎట్టి పరిస్థితిలో కెసిఆర్ నిలబడుతున్న రెండు స్థానాల్లో ఆయన్ను ఓడించాలన్న పట్టుదలతో బిజెపి, కాంగ్రెస్‌లు ఉన్నాయి. కామారెడ్డిలో నిరంతరం కెసిఆర్‌ను విమర్శించే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలి వేరే నియోజకవర్గాన్ని ఎంచుకోవడంతో ఆ పార్టీ అధిష్టానం పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే పోటీకి నిలిపింది.
ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయమని చెబుతున్న రేవంత్‌రెడ్డినే స్వయంగా కెసిఆర్‌తో ఢీ కొంటుండటంతో ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ బిజెపి అభ్యర్ది రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కొనసాగబోతున్నది. అయితే రేవంత్‌రెడ్డి కూడా కామారెడ్డితో పాటు తన స్వంత నియోజకవర్గం అయిన కొడంగల్‌లో పోటీచేస్తున్నారు. ఆయన నామినేషన్ల చివరి రోజు అయిన శుక్రవారం నాడు కామారెడ్డి శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కూడా.
ఇక గజ్వేల్ విషయానికొస్తే కెసిఆర్‌కు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఎందుకంటే గజ్వేల్ ఆయన స్వంత నియోజకవర్గం కావడం వల్లే. ఇక్కడి నుండి ఆయన రెండు సార్లు గెలుపొందారు. గజ్వేల్‌లో ఏ రాజకీయ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్న ఒక సెంటిమెంట్ ఇక్కడ బలంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గం కావడంతో రాజు తలుచుకుంటే డబ్బుకు కరువా అన్నట్లు గత దశాబ్దకాలంలో గజ్వెల్ రూపురేకలే మారిపోయాయి. తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్న సంపూర్ణ నమ్మకంతో కెసిఆర్ ఉన్నారు. కామారెడ్డిలో లాగానే ఆయన్ను గద్దె దింపడమే లక్ష్యంగా ఉన్న బిజెపి, ఆయనకు ఇటీవల బద్ధ శత్రువుగా మారిన ఈటల రాజేందర్‌ను రంగంలోకి దింపింది. బిఆర్ఎస్లో కెసిఆర్ తర్వాత నాయకుడిగా ఎదిగిన ఈటల తనపై కుట్రపూరిత ఆరోపణలు చేసి పార్టీనుంచి వెళ్ళగొట్టిన కెసిఆర్ అంతం చూడడమే తన లక్ష్యమంటున్నారు. ఇక్కడ వోటర్లలో సగం మంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కావడంతో బిసి అయిన ఈటల ఇక్కడ ఫలితాలు తనకు అనుకూలిస్తాయనుకుంటున్నారు.
ఇక విపక్షాల మరో టార్గెట్ కెసిఆర్ కుమారుడు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కెటిఆర్). ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిస్తే కాబోయే ముఖ్యమంత్రి కెటిఆరే అన్న వదంతులు ఇప్పటికీ ప్రబలంగా ఉన్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్న కెటిఆర్ తండ్రిలాగానే అక్రమాలకు పాల్పడ్డాడన్నది విపక్షాలు చేస్తున్న విమర్శ. నాటి సిరిసిల్లను చూసి వోటు వేయాల్సిందిగా ఆయన నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుండగా, ఆయన అవినీతిని బయటపెడతానంటుంది బిజెపి నుండి ఆయనతో పోటీ పడుతున్న రాణి రుద్రమరెడ్డి. రాణి రుద్రమ రెడ్డి మొదటిసారిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. గతంలో రెండు సార్లు ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన ఈమె స్థానికేతరురాలన్న వివాదాన్ని ఎదుర్కుంటున్నది. స్థానికులను కాదని ఆమెకు టికెట్ ఇచ్చినందుకు అలిగిన నాయకులు పార్టీకి రాజీనామా చేయడం బిజెపికి కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే అత్యధిక సంఖ్యలో ఇక్కడున్న పద్మశాలీల వోట్లు గెలుపు ఓటములను శాసించగలవనుకుంటున్నారు. రెండు సార్లు సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కెటిఆర్ ఇక్కడ నేతన్నలను ఆదుకునే విషయంలో శక్తిమేర కృషిచేశారన్న పేరుంది. అయినా బిజెపితో ఈసారి గట్టిపోటీని ఎదుర్కునాల్సి వొచ్చింది.
మూడవ వ్యక్తి రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు. కెసిఆర్‌కు మేనల్లుడు కావడంతో విపక్షాలు హరీష్‌రావు వెంటపడ్డాయి. బిఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హరీష్‌ను టార్గెట్ చేయడం ద్వారా కెసిఆర్‌ను నైతికంగా కృంగదీయవచ్చన్నది ఆ పక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయన ఇప్పటికి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన వ్యక్తి. 2004 నుండి ప్రతీ ఎన్నికల్లో గత ఎన్నికలకు మించి వోటర్ల అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. 2018 ఎన్నికల్లో లక్షా 18వేలకు పైగా వోట్ల అధిక్యతను సాధించుకుని రికార్డు నెలకొల్పారు. ఆయన కూడా సిద్దిపేట నియోజకవర్గ రూపురేకలను మార్చడంలో తన వంతు కృషి చేశారు. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ, అందరి తలలో నాలికగా మెదులుతాడన్న పేరు సంపాదించుకున్నారు.
ఈ ఎన్నికలే ఆయనకు చివరి ఎన్నికలు కావాలని కాంగ్రెస్, బిజెపి పార్టీలు సమ ఉజ్జీలను పోటీలో పెట్టారు. టిపీసీసీ ప్రధాన కార్యదర్శి, సిద్దిపేట పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా అయిన పూజల హరికృష్ణను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. 26 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు స్థానిక కార్యకర్తలు, నాయకులతో పాటు ఓయు విద్యార్ధులు అండగా నిలుస్తున్నారు. అందరూ అనుకున్నట్లు హరీష్‌రావు నీతిమంతుడేమీ కాదని, ఆయన అవినీతి చిట్టా అంతా బయటపెడుతానంటున్నాడు హరికృష్ణ. ముప్పై సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని అయిదు సంవత్సరాల్లో తాము చేశామంటున్న హరీష్‌రావు కన్నా రాజకీయాల్లో తానే సీనియర్నంటున్నాడు. అలాగే సిద్దిపేట బిజెపి జిల్లా అధ్యక్షుడైన దూడి శ్రీకాంత్‌రెడ్డి కూడా అంతే తీవ్రంగా హరీష్‌ను ఎదుర్కునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బిజెపి, ఎబివిపి, బిజెవైఎంలలో అనేక పదవులు నిర్వహించిన శ్రీకాంత్ రెడ్డి మొదటిసారిగా శాసనసభ ఎన్నికల్లో హరీష్ రావును డీ కొనబోతున్నారు. ఆయనకు పార్టీ అండ దండ ఉండటంతో ముందుకు దూసుకుపోతున్నాడు.





