– ఆర్య వైశ్యులకు ఎవరు ఇవ్వనన్ని పదవులు ఇచ్చింది, గౌరవించిన పార్టీ బిఆర్ఎస్
– ప్రతి ఆర్య వైశ్యుడు కారు గుర్తుకు వోటు వేసి, తమ కృతజ్ఞత చాటుకోవాలి
బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం,ప్రజాతంత్ర: ఆర్య వైశ్యులను ఆదరించి అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఎవరు ఇవ్వనని పదవులు ఆర్య వైశ్యులకు ఇచ్చి సముచిత స్థానం కల్పించిన పార్టీకి ప్రతి ఒక్కరు అండగా నిలిచి, కారు గుర్తుకు వోటు వేసి గెలిపించాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఆర్కే పురం డివిజన్ వాసవి కాలనీలో గల వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో నిర్వహించిన “ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనం” కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమావేశానికి ముందు సబితా ఇంద్రారెడ్డి ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరించి, ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కారు గుర్తుకు వోటు వేసి, గెలిపించాలని విన్నవించారు. అనంతరం సబితారెడ్డి వాసవి మాతకు పూలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి, గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్యవైశ్యుల అభ్యున్నతి, సంక్షేమానికి పెద్ద పీట చేశారన్నారు. కేసీఆర్ ఆర్య వైశ్యులకు ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఐదుకు పైగా కార్పొరేషన్ల పదవులు ఇచ్చి, రాజకీయంగా సముచిత గౌరవం కల్పించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆర్య వైశ్యుల ఆత్మ గౌరవం భవనానికి స్థలం కేటాయించడమే కాకుండా భావన నిర్మాణానికి నిధులు ఇచ్చినట్లు చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ లో వాసవి మాత ఆలయానికి స్థలం కేటాయించడంతో పాటు కమ్యూనిటీ భవనానికి ఐదు వందల గజాల స్థలం ఇవ్వనున్నట్లు చెప్పారు. అదే విధంగా రంగా రెడీ జిల్లా ఆర్య వైశ్య సంఘం సభ్యులు కోరిన విధంగా జిల్లా పరిధిలో రెండు ఏకరాల స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు. అన్ని విధాలుగా ఆర్య వైశ్యుల అభ్యున్నతికి పాల్పడుతున్న బిఆర్ఎస్ పార్టీకి ప్రతి ఆర్య వైశ్యుడు అండగా నిలిచి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొందరు ఎన్నికలు రాగానే మతం, కులం పేరుతో ఓట్ల కోసం వస్తుంటారని అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో వచ్చేవారిని కాకుండా ఎల్లపుడు మీకు అందుబాటులో ఉంటూ.. మీ అభ్యున్నతికి కృషి చేస్తున్న వారికి అండగా ఉండాలన్నారు. మీకు అండగా ఉంటూ, సముచిత గౌరవం ఇచ్చి, మీ అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడు అండగా ఉండి, కారు గుర్తుకు వోటు వేసి గెలిపించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జి ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, సంఘం నాయకులు లక్ష్మీ నారాయణ, చంద్రయ్య గుప్తా, పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు,మహిళ ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.