ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : అన్నీ రాజకీయ పార్టీలు అర్హులైన ఆరె కటికలకు ఎమ్మెల్యే, ఎంపి టికెట్లు ఇవ్వాలని అఖిల భారతీయ కటిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సంతోష్ హింగోలేకర్ విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాలుగు ఖాళీ నియోజక వర్గంలో ఒకటి ఆరేకటికలకు కేటాయించాలని కోరారు. 23 ఏళ్ల నుంచి బిఆర్ఎస్ పార్టీలో ఉంటున్న తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలన్నారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షినాదిలో 12 రాష్ట్రాల్లో ఎస్సిలుగా ఉన్న అరెకటిక కులాన్ని వచ్చే ఎన్నికల లోపు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సి జాబితాలో చేర్చి అన్ని రాజకీయ పార్టీలు కుల అభివృద్ధి పధకాలు తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలన్నారు. కోకపెట్ లో ఆత్మగౌరవ భవన నిర్మాణ వ్యయం రూ.1 కోటి సరిపోదని రూ.10 కోట్లు పెంచి మంజూరు చేయాలన్నారు. అరెకటిక కులానికి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఆరికటిక కులవృత్తి అయిన మటన్ వ్యాపారాన్ని పింక్ రెవల్యూషన్లో భాగస్వామ్యం చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్నీ మేకల మండీలు ఆధునికరించాలన్నారు. గొర్రెల, మేకల పెంపకం స్కీమ్ లు అరెకటిక కులస్తులకు కూడా వర్తింపజేయాలన్నారు. లిక్కర్ స్కీములో ఆరెకటిక కులస్తులకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. ప్రమాదాలకు గురయి చనిపోయిన అరెకటిక కుటుంబాలకు ఇన్సూరెన్స్ పధకం అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు కె.బాలశశిధర్ రావు, రాష్ట్ర అధ్యక్షులు అత్తికారి మల్లేష్, మహేందర్, దుర్గాప్రసాద్, హరి ప్రసాద్, నవీన్ కుమార్, అరుణ్ కుమార్, మహేందర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.