బతుకు ఆటలో
మెతుకు వేటలో
అనుక్షణమూ ఆరాటంతో
బ్రతుకంతా పోరాటంతో
భారమైన బానిస బతుకులు
కొందరివైతే,
మమతలన్నీ మాసిపోయి
నీతిపూలన్నీ వాడిపోయి
మానవతలన్నీ మండిపోయి
పైకి మనిషితత్వం
లోలోన రాక్షసత్వంతో
రంగస్థలాన్ని మరపించే
నటనతో కూడిన
జీవనం సాంగిచే బతుకులు
ఇంకొందరివి.
అవసరంకోసం మనుషులను
అవకాశాలకోసం సందర్భాలను
అడుగడుగునా సృష్టించుకొనే
ఈ సృష్టిలో,
నాటికి నేటికి మారని జీవితం
అనైతిక ఎత్తుగడల జీవన విధానం.
మనిషి మనిషిపై
నిత్యం కాలుదువ్వుతూ,
కర్కశత్వంతో కడుపు నింపుకుంటూ,
మాటలతో చేతలతో కుళ్ళబొడుస్తూ,
అట్టడుగుకు దిగజారిన మానవత్వంతో,
ఎక్కడచూసినా బానిసత్వపు బంధనాలే
నైతిక పతన దిశగా అడుగులే.
మృగంనుండి రూపాంతరం చెందిన
మనిషి పాతలక్షణాలను
వదులుకోలేకపోతున్నాడు.
ఇలాగైతే మనిషి ఆనవాళ్లు
శిలాఫలకంపై చూసుకోవాల్సిందే…
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం




