హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : అఖిల భారత అసంఘటిత కార్మికులు అండ్ ఉద్యోగుల కాంగ్రెస్(కెకెసి) రాష్ట్ర 20 ఛైర్మన్ కౌశిల్ సమీర్ నూచనల మేరకు క్యాబ్ అండ్ ఆటో డ్రైవర్ల సమస్యలపై శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కెకెసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సంపత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఆటో విభాగం రుద్రాక్ష మల్లేష్, భవన నిర్మాణ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రవల్లి రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మహాలక్ష్మి పథకం ఉచిత బస్ ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ఆడపడుచులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కాని ఉచిత ప్రయాణం వల్ల ఆటోవాలాలపై అధిక భారం పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఇదే అదునుగా ఆటో ఫైనాన్స్ వ్యాపారులు అడ్డగోలుగా ఆటో డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు ఒక కిస్తీ కట్టకపోతే ఆటోలను సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యల వాహనాలు రావడంతో వాటిపైన నియంత్రణ లేక పాన్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ పేరుతో వెండర్స్ విచ్చల విడిగా క్యాబ్ డ్రైవర్లను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంలో మంత్రి జోక్యం చేసుకుని సంబంధిత అధికారులతో చర్చించడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని, అందరికి న్యాయం జరుగుతుందని, ఎవరు అధైర్య పడరాదన్నారు. 6 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసి అసంఘటిత కార్మికులకు న్యాయం చేస్తుందన్నారు.
ఆటో ఫైనాన్షియర్ల ఆగడాలను అరికట్టాలని మంత్రికి విజ్ఞప్తి





