మట్టికుండ మన నాగరికతకు మూలం. చరిత్రను పట్టి ఇచ్చి గుట్టు విప్పిన గొప్ప ఆనవాలు కూడా అదే. ఆకలి తీర్చే అన్నాన్ని తీరుగా వండేందుకు తోడ్పడే కుండలను నిశితంగా చూస్తే బ్రహ్మాండమే దొరుకుతుందంటారు ప్రముఖ కవి అన్నవరం దేవేందర్. వండుక తినే బువ్వకుండ మూలాలను దీర్ఘ కవిత్వంగా రంగరించి చూపారు. మూడు వేల సంవత్సరాల కింద సింధూ, మెసపటోమియా సందుల నేల తవ్వకాల కింద దొరికిన కుండలో కండ్లు చెదిరే కళాత్మకత ఉందన్నారు. మట్టి పాత్ర అయిన కుండలో తొణకిస లాడిన మానవజీవన దశలను విశదీకరించారు. పచ్చికుండను వాముల కాల్చి/ బువ్వకుండను పుట్టించిన/ ఆ శాస్త్రజ్ఞుడే కుమ్మరి బ్రహ్మ అని ఆ అమృతం నిండిన కలశం పుట్టుకను పరిచయం చేశారు. మన్నులో మట్టిని కనిపెట్టి/ కసపిస మెత్తంగా తొక్కి/ సారె మీద కుంభాకృతిగ చేయడంతో కుండ లోకాన్ని చూస్తుందన్నారు. అది నాగరికతకే తొలి ఇత్తనం/ తొలి వంటకూ అంకురార్పణం/మానవ జాతికే సమర్పణం అని దాని శ్రమశీలతను నిర్వచించారు. ఆహార తయారీకి ఆయువైన బువ్వకుండ సుట్టువార మట్టిగోడలు కట్టి/ సృష్టించిన గుండెకాయ అన్న ప్రాముఖ్యతను గుర్తు చేశారు. మానవ యానానికి అది అడుగన్న గొప్ప అంశాన్ని ఆవిష్కరించారు. మంచిల్ల పట్వదూప తీర్చే సల్వగా, ఆదిమతల్లిగా, ఆదిశక్తిగా అన్నం వండే బువ్వకుండకు కవి మనసారా కృతజ్ఞత సమర్పించారు.
చీకటి తపస్సులోంచి కుమ్మరి బ్రహ్మ మస్తిష్కంలో మొలచిన వెలుగురేఖ బువ్వకుండ శూన్యంలోంచి ఊడిపడిన అద్భుతం ఎంత మాత్రం కాదని అదొక స్వీయ నైపుణ్యపు వికాసమంటారు. కుండను తయారు చేసే మన్ను నుండే మొలక ఎదిగి ధాన్యం కురిసి బువ్వాకూర నోటికంది ఆకలి తీరుతుందన్నారు. గిరగిర తిరిగే సారెచక్రం కుండకు ఆకారమిచ్చి యంత్ర సాంకేతికతకు ఆధారమై పనితనాన్ని వేగిరిపరచిన మహాసాధనమని అభివర్ణించి చక్రం, ఇరుసు, లోహాలను ఆవిష్కరించిన శాస్త్రజ్ఞులను సలాంలతో తలుచుకున్నారు. రాతియుగం, లోహయుగం నుండి ఆధునిక రోబో యుగం వరకు మనిషికి అస్తిత్వ సంవేదనల పరితపన తప్పడం లేదన్న నగ్న సత్యాన్ని తెలిపారు. కుండను సృష్టించడం ఆనాడు వికసించిన ఆధునిక విప్లవమంటారు. కుండ నుండి లోహపాత్రలు, ప్రెజర్ కుక్కర్ల, ఇండక్షన్ స్టౌల దాకా ఎదిగిన వర్తమానం మూల వేరైన కులవృత్తిని కూల్చి వేయడం గొప్ప విషాదమంటారు. ఆకలిని తీర్చే బువ్వకుండ వారసత్వంగా మనిషికి అందిన ధర్మ సంపదగా చెప్పారు. మట్టి చేతులు ప్రాణం పోసిన మార్మిక క్రియాత్మకత అయిన బువ్వకుండ వెనక దాగిన జీవనావశ్యకత వ్యక్తావ్యక్తమైంది. కళ,శ్రమ కలెగలిపిన పరిశ్రమ, రొట్టె పెంక రూపు పొద్దు పొడుపే అన్న వాక్యాలు వేల యేళ్ల అంతెరగని చెమట చుక్కల పోరాటానికి బింబ ప్రతిబింబాలనిపిస్తాయి. పాత్రౌచిత్యం, పరిశోధన కన్నా పనితనమే మెరుగంటారు. తగినన్ని నీళ్ళు తడిపి రొట్టెపిండి లెక్క పొద్దంతా కాళ్లు గుంజంగ తొక్కితే మన్నుముద్ద కాటుక లాంటి ముడి సరుకై కుండకు ప్రాణం పోసేందుకు సిద్ధమైందంటారు. సారెకోల కట్టె తోటి సారెను నెమ్మదిగా తింపి వేగం పెంచి చెమట చుక్కను రాలిస్తే పీఠం మీద ముద్దలు ముద్దలుగా మన్ను మురిసి కనిపిస్తుందంటారు.
కూండకు నున్నటి గుండ్రని ఆకారం వచ్చేట్టుగా ఊహాత్మకతతో కొత్తమట్టి పువ్వులను పూయించి మన్ను పండ్లను పండించడం ద్వారా సుతారమైన చేతి వేళ్ళ పనితనంతో సృష్టికార్యానికి మూలమై మన్ను మహాత్మ్యాన్ని అందరికీ తెలిసేలా చేసిన కుమ్మరి బొమ్మను విశ్లేషించి చూపారు. మన్నులో ప్రాణవాయువును నింపడమే కుండ రూపుదాల్చడమంటారు. కుండాకార పిండాన్ని పసిగుడ్డులెక్క చూసి కైనీడకు ఎండబెట్టి ఇచ్చుకోని గట్టితనం లాగా ఆరనియ్యాలే అంటారు. కుండ పూర్ణకుంభం, శ్రమ తపస్విలా సకిలం, ముకులంతో కనిపిస్తుంది. కుండ సృష్టికారుని ఓర్పరితనం ఎంతో గొప్పది అంటూ రౌతుతో నమోనగ అదిమిపట్టడంతో చూపిస్తారు. అనుకున్న తీరుగా వచ్చేదాకా తేమను అంటిస్తూ సరుస్తుంటే సమన్వయ సవ్వడితో అందమైన ఆకారం కుండగా నవ్వుతది అని తెలిపారు. ఎండిన కుండలను ఒక దగ్గర చేర్చి వాములో పేర్చుడు, కాల్చుడు బహునేర్పుతో కూడిన మహా నైపుణ్యతగా చెప్పారు. పంగలకట్టెతో అగ్గిరాజేసి వాము లోపల పొరుక కట్టెలు పెట్టి నిప్పు అంటుబెట్టి నిగురానుగా కాలిస్తే తెల్లందాకా వాము అగ్గిగుండమై కుండలు ఎర్రని పువ్వులై ధగధగ మెరిసి కణకణ ధ్వనించిన తరువాత సృష్టికారుడైన కుమ్మరిబ్రహ్మ నొసటి చెమటను తలరుమాలుతో తూడ్చుకొని తన పనితనానికి తృప్తి పడతాడని చెబుతారు. శూన్యానికి రూపం లేకున్నా అది ఆకృతుల మాయావిగా మారుతుందని అంటారు.
మన్నుకు జీవం పోసి వంటింటి పాత్రలకు సృష్టికారుడు ప్రాణమై నిలుస్తాడని చెప్పారు. ఇంటి మీద గూనకప్పుగా చల్లని నీడై నిలుస్తాడని, ధాన్యాన్ని దాసిపెట్టేందుకు కుండై తావు సూపెడతాడని అంటారు. గరిడిబుట్టి ఐరెన్లు, కురాడి కుండలు, లగ్గం నాగెల్లికి ఇండ్లలో దీవెనార్తులు అన్నారు. బోనాల పండుగంటే కుండల కుంభమేళగా పల్లె ఆడబిడ్డల భక్తితో మురపెమైందంటారు. ముంతలు, చిప్పలు, కాగులు, దీపంతలు, గోళాలు, పూలకుండీలను కుమ్మరి సృష్టికి రకరకాల రూపాలుగా సూచించారు. చావు పుట్టుక మధ్య పూర్తయ్యే తతంగంగా కుండ సృష్టిని చెప్పారు. పుట్టగానే తీసి అగ్గిపెట్టిన తరువాత కుండకు చావు పుట్టకల ప్రయాణముంటుందని అంటారు. అంతిమ యాత్రకు ముందు అగ్గికుండతో నడిచే పద్ధతిని గుర్తు చేశారు. కుమ్మరి మన్ను ఒక చరిత్ర పరిమళమని, కుమ్మరికుండ ఒక మహత్కార భాండమని అభివర్ణించారు. సాంస్కృతిక వితరశీలతగా బువ్వకుండలను ఊరందరికీ పంచడంగా చెప్పారు. మట్టిలో కుమ్మరిపురుగై తిరిగిన సృష్టికారుడు ఆదరణ లేక ఇచ్చుక పోతున్న బోనంలా మారాడని అంటారు. కుమ్మరివాడ అంటేనే బహుజనుల చేతివృత్తుల వేదికని, ప్రపంచ నాగరికతకు కమ్మని మన్ను వాసనలా కరదీపికని, జీవగంజికి ఇసిరె అని చెప్పారు. చినుకు రాలితే పచ్చికుండలను ఇండ్లలోకి మోసే కుమ్మరి కుటుంబాలకు మట్టే మహాప్రసాదమని తెలిపారు.
ఊరికి కుండానుబంధం గొప్పదని అంటారు. నీళ్ల పటువ, రంజను, దీపావళి దీపాంత, ఉగాదికి పచ్చటి పటువలా పంచాంగం. జాజిరంగుల బొమ్మల సింగారంతో వంటింటి కల్పవల్లిగా కుండను చెప్పారు. మట్టి ఆకృతులే చరిత్రకు ఆధారాలన్నారు. ప్రాచీన చరిత్రలో మట్టిపని అసలైన జీవితంగా తెలిపారు. గ్లోబలీకరణతో కుండల కులవృత్తి దెబ్బతినడాన్ని చూసి వేదన పడ్డారు. చేతి వృత్తుల పనులన్నీ దెబ్బతిన్నాయని అన్నారు. కళాత్మకత కలిగిన ఉత్పాదకతగా కుండల వృత్తిని చెప్పారు. కులవృత్తులతో ఊరు పరస్పర సామాజిక సేవల వాకిలి అయ్యిందని అంటారు. ఊరి ఉత్పత్తి సేవలు ఒక సామాజిక సన్నివేశమని, బహుజనులు అందించిన బహుమాన వారసత్వ సంపద అని నిర్వచించారు. మట్టి నుండే ప్రపంచానికి పట్టెడు అన్నం అందుతుందని తెలిపారు. వస్తుసేవలకు మూల్యాంకనం మట్టేనని గుర్తించుకోమంటారు. మనిషి జీవితం మట్టికుండతో మొదలై ఆ కుండతోనే చివరగా అగ్గిలో మాయమయిపోతుందని ముగింపు పలికారు. గ్రామీణ కులవృత్తులలోని అసాధారణమైన జీవన ప్రవృత్తికి ఆధారంగా నిలిచిన కవిత్వమిది.
– డా. తిరునగరి శ్రీనివాస్, 8466053933