దేశంలో అవినీతి ఎక్కడ జరిగినా.. దాని వెనుక కుటుంబ పార్టీ హస్తం..
ఇది మీడియా వారికి హోంవర్క్ .. కావాలంటే చూసుకోవచ్చు
మీ అండతోనే శక్తి వినాశకారులను ఎదుర్కొంటా..
జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చ్ 18: మూడోసారి అధికారంలోకి రాబోతున్న ఎన్ డి ఏ కూటమికి 400 సీట్లు అందించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. శక్తి బిచ్చిన్నకారులను ఎదుర్కొనేందుకు తమ శక్తిని అందించి బలోపేతం చేయాలని కోరారు. జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. మాల్కాజ్గిరిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్.. 400 పార్ అంటున్నారు. మొన్ననే లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పని అయిపోతుంది. పదేళ్లపాటు బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంది. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ ఆడుకుంటోంది. ఇప్పుడు కాంగ్రెస్.. తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంటోంది. బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ ఫైల్స్ను పక్కన పెడుతోంది. కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మకయ్యాయి. లిక్కర్ స్కామ్లోనూ బీఆర్ఎస్ కమీషన్లు తీసుకుంది. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు నన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నాయి. కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది. ఇక్కడ దోచిన డబ్బును కుట్రలకు వాడుతున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు ఢిల్లీలో కుటుంబ పార్టీ పెద్దలకు వెళ్తున్నాయి. దేశంలో జరిగిన స్కామ్లన్నింటికీ కుటుంబ పార్టీలే కారణం. నేను గత మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు మరోసారి వచ్చాను. ఆదిలాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. జగిత్యాల ధర్మపురి మీదుగా జాతీయ రహదారి వరంగల్ కరీంనగర్ రాయపట్నం మీదుగా మరో జాతీయ రహదారి నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రతి మారుమూల ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాం అని మోడీ అన్నారు. తెలంగాణలో బీజేపీని గెలిపించి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను సాఫ్ చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల్లో ఇండియన్ అలయన్స్ శక్తిపై చేస్తున్న యుద్ధాన్ని స్వీకరిస్తున్నానని, ఈ యుద్ధంలో నేను మీకోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమేనని మోడి అన్నారు. భారత గడ్డపై శక్తిని వినాశనం చేస్తానని మాట్లాడుతున్నారు.. యావత్ దేశం శక్తిని పూజిస్తాం. శివశక్తి పేరుతో చంద్రయాన్ సక్సెస్ చేసుకున్నాం. శక్తిని వినాశనం చేసే అవకాశం వారికిద్దామా?.. శక్తిని విచ్ఛిన్నం చేసే వారు విచ్ఛిన్నం కావాలా? వద్దా?. ఈ యుద్ధంలో శక్తిని పూజ చేసే వారు ఒక వైపు.. శక్తిని విచ్ఛిన్నం చేసేవారు ఒకవైపు. ఈ యుద్ధంలో గెలుపెవరిదో జూన్ 4వ తేదీన తేలనుంది అని మోడీ అన్నారు. తెలంగాణ కలలను కల్లలు చేసింది కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది బీఆర్ఎస్. ఇక్కడి ప్రజలు డబ్బులు ఢిల్లీకి చేరుతున్నాయి. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలకు చేరుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేసింది. కానీ ఇప్పుడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ నోరు మెదపడం లేదు. కాళేశ్వరం అవినీతిపై ఎవరూ ప్రశ్నించడంలేదు. ఎన్నో గ్యారెంటీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలుచేయడం లేదు. దీనిపై బీఆర్ఎస్ కూడా నోరుమెదపడం లేదు. ఈరెండు పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయి అని ప్రధాని మోడీ విమర్శించారు. ఈ పార్టీల నాయకులు ఎన్నడైనా భారత్ మాతా కీ జై అనడం వినిపించిందా? అని ప్రజలను మోదీ ప్రశ్నించారు.
కుటుంబ పార్టీలు కేవలం దేశాన్ని దోచుకునేందుకు రాజకీయం చేస్తాయి. అభివృద్ధి కోసం పనిచేయవు. దేశంలో అవినీతి ఎక్కడ జరిగినా దాని వెనుక కుటుంబ పార్టీ హస్తం ఉంటుంది. నేను దీనిపై మీడియా వారికి కూడా హోంవర్క్ ఇస్తున్నా.. కావాలంటే చూసుకోవచ్చు. 2జీ స్కామ్, బోఫోర్స్, నేషనల్ హెరాల్డ్ కేసులో ఎవరి పేర్లొచ్చాయి? ఇలాంటి అవినీతే.. తెలంగాణలోనూ జరిగింది. కాళేశ్వరం అవినీతితో పాటు లిక్కర్ స్కామ్ తో ఢిల్లీ వరకు వచ్చి కమీషన్లు తిన్నారు. కాంగ్రెస్.. అయినా.. బీఆర్ఎస్ అయినా.. వారికి దూరంగా ఉండటమే మనకు మెడిసిన్. అందుకే బీజేపీని గెలిపించాలని మోడీ అన్నారు. కుర్చీతో సంబంధం లేకుండా మీ బాగు కోసం నేనుంటా.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కోపంతో ఎలాగైనా ఆ పార్టీని ఓడించాలనుకున్నారు.. ఓడించారు. కానీ ఈసారి జరిగేవి కేంద్రంలో మరోసారి మోడీ సర్కారును తెచ్చేది. అందుకే బీజేపీకి ఓటు వేయండి. 2014కు ముదు వరకు ఇతర పార్టీలు చేసిన అభివృద్ధి చూడండి. 2014 తర్వాత నుంచి కేవలం పదేండ్లలో జరిగిన అభివృద్ధి చూడండి. జూన్ లో మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. మరింత అభివృద్ధి చేపడుతాం. నేను టెక్నాలజీ వినియోగించి మీతో తెలుగులో మాట్లాడుతాను. ట్విట్టర్(ఎక్స్) వేదికగా ‘నమో ఇన్ తెలుగు’ డౌన్ లోడ్ చేసుకోండి. వందకు వంద శాతం కాకపోయినా.. 80 నుంచి 90 శాతం వరకు ఇది సక్సెస్ అవుతుంది. అందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి. మీరు నా టీచర్లు.. నాకు తెలుగు నేర్పిస్తారు కదా.. ఎవరైనా ఏమైనా అంటే.. గడ్ బడ్.. చేయకు.. మోడీ నా జేబులో ఉన్నాడని చెప్పండి. తెలంగాణలోని ప్రతి మొబైల్ లో మోడీ ఉండాలి. మీ మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి నాకు అండగా ఉంటానని గ్యారెంటీ ఇవ్వండి ప్రజలను ప్రధాని మోదీ కోరారు.




