పతనం తప్పదని హెచ్చరించిన ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్
ప్రజాతంత్ర, ఆసిఫాబాద్, ఏప్రిల్ 8 : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. పెన్షన్ల పేరుతో వృద్ధుల వితంతువులు, ఒంటరి మహిళల ఓట్లను దండుకొని అధికారంలోకి వొచ్చిన తరువాత మహిళలను మోసం చేసిన ఘనుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. కొమురం భీమ్ జిల్లాలో శుక్రవారం ఈటల పర్యటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో వడ్ల సమస్య లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని, రైతులను మోసం చేస్తుందని చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదన్నారు. కేంద్రం ధాన్యం కొనమని ఎక్కడయినా చెప్పిందా అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం వొచ్చిన తరువాత అధికారం చెలాయిస్తున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను, మంత్రులను కేసీఆర్ పట్టించుకోడన్నారు. వాళ్ళు చెప్పిన సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. ఏ నిర్ణయమైన కేసీఆర్ తీసుకుంటాడని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి అయోమయంలో పడ్డాడన్నారు. ఎప్పుడైన గంటల కొద్దీ ప్రెస్ వి•ట్స్ ఉన్నాయా? మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నాడంటూ ప్రశించారు. రాబోవు రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారని ఈటల అన్నారు.