- కేవలం 40 మిల్స్ లో దాదాపు 4. 54 లక్షల ధాన్యం షార్టేజ్
- టీఆర్ఎస్ దుర్మార్గాలతో సూసైడ్ చేసుకున్న వారిని ఆదుకోండి
- రైతు దీక్ష పేరుతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయొద్దు
- కేసీఆర్ ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- అనుమానం..పలు కీలక వ్యాఖ్యలు
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,ఏప్రిల్ 20:
ధాన్యం బస్తాల షార్టేజ్ విషయంలో తెలంగాణ లోని అన్ని రైస్ మిల్స్ పై త్వరలో సర్పైజ్ ఇన్ఫెక్షన్ కు ఆదేశించనున్నట్లు కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అవకతవకలకు పాల్పడ్డ మిల్స్ పై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు చెప్పారు. అనంతరం ఆయా రైస్ మిల్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్రానికి తెలపాలని త్వరలో తాను కేసీఆర్ కు లేఖ రాయబోతున్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు ప్రధానంగా స్పందింస్తోన్న ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్రంలోని 40 రైస్ మిల్లర్లపై ఎఫ్ సిఐ అధికారులు చేసిన సర్ఫైజ్ ఇన్ఫెక్షన్ లో 4,53, 896 ధాన్యం బస్తాల షార్టేజ్ బయటపడిందన్నారు. 2020-21 కు సంబంధించి యాసంగిలో 21 మిల్స్ లో 1,96,177 బస్తాలు, 2021-22 వానాకాలంలో 19 మిల్స్ లో 2, 57, 719 బస్తాల ధాన్యం షార్టేజ్ వచ్చిందన్నారు.
దాదాపు 2,320 మిల్స్ లో ధాన్యం లెక్కించడానికి అనువుగా లేకుండా ఉందని(కుప్పలుగాపోసి) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల్లో చూపిస్తోన్న ధాన్యం…. రైల్ మిల్స్ లో, గోదాములలో ఎందుకు లేదని నిలదీశారు. ‘ఈ బ్యాగులు ఎక్కడికి పోయాయి. ఎవరిని మోసం చేయడానికి, ఎవరు బ్యాంక్ ఇంట్రెస్ట్ తప్పించుకోవడం కోసం. షార్టేజ్ వచ్చిన బియ్యాన్ని మళ్లీ ఎక్కడి నుంచి సర్దుబాటు చేస్తారు’ అని ప్రశ్నించారు. షార్టేజ్ ఉన్న ధాన్యాన్ని ఈ సీజన్ లో ఇస్తారా? లేక వచ్చే సీజన్ లో ఇస్తారా? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ధాన్యం షార్టేజ్ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇదే అంశంపై ఒక రాజకీయ పార్టీ నేత సిబిఐ దర్యాప్తు చేయాలని తనను లేఖ రాసినట్లు వెల్లడించారు. అయితే, రైస్ మిల్స్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అగ్రిమెంట్ ఉంటుందన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు అదేశించే అవకాశం ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితేనో, కోర్టులు ఆదేశిస్తినో సిబిఐ దర్యాప్తు వేయవచ్చని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ దిశలో ఎందుకు నిర్ణయాలు తీసుకోవడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పార్టీ రాజకీయలు, దుర్మార్గాలు, మాఫీయా కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలను ముందుగా ఆదుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ తర్వాత దేశంలో ఎక్కడి వెళ్లిన తమకేమి అభ్యంతరం లేదన్నారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేసీఆర్ నష్ట పరిహారం ఇవ్వడంలో తమకేమి ఇబ్బంది లేదన్నారు. అయితే, రాష్ట్రంలో పేదలే లేనట్లు, రైతుల ఆత్మహత్యలు జరగనట్లు, నిరుద్యోగ యువకుల బలిదానాలు లేనట్లు చూపించవద్దని హితవు పలికారు. ముందుగా రాష్ట్రంలో చనిపోయిన రైతులు, అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై కేసీఆర్, తండ్రి- కొడుకుల పార్టీ సర్టిఫికేట్ కేంద్రానికి అవసరం లేదని చెప్పారు. తమ ప్రభుత్వానికి దేశ రైతులు సర్టిఫికేట్ ఇచ్చారన్నారు. కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తుందని ఆరోపించారు.
మరిన్ని అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకు వస్తున్నారని విమర్శించారు. ఫస్ట్ ఈ అవినీతిని అరికట్టాలన్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. విదేశాలకు ఫుడ్ గ్రెయిన్స్ ఎగుమతిపై టీఆర్ఎస్ ఎంపీలు అవగాహన లేకుండా పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవాలను మరుగున పెట్టి బాధ్యత నుంచి తప్పుకోవాలని టీఆర్ఎస్ చూస్తుందన్నారు. ఎనిమిదేండ్లుగా తామే ధాన్యం కొంటున్నామని చెప్పుకొన్న రాష్ట్ర ప్రభుత్వం… హుజురాబాద్ ఓటమి తర్వాత కేంద్ర ప్రభుత్వంపై విష ప్రచారం మొదలుపెట్టిందన్నారు.
కేసీఆర్, కేటీఆర్ తట్టలళ్ల బియ్యం మోస్తరా…?
రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేసేందుకు దాదాపు 15 కోట్ల గోనె సంచులు అవసరమని కిషన్ రెడ్డి చెప్పారు. జనవరి నుంచే అన్ని రాష్ట్రాలు గొనె సంచులకు ప్రిపరేషన్ మొదలుపెట్టాయన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గోనే సంచులు కొనుగోలు చేయలేదన్నారు. “90 శాతం వెస్ట్ బెంగాల్ లో గోనె సంచులు తయారవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ రోజు కనీసం కోటి సంచులు కూడా లేవు. ఏ రకంగా సేకరిస్తరు. ఏ రకంగా ట్రాన్స్ పోర్ట్ చేస్తరు. కేసీఆర్, కేటీఆర్, వాళ్ల కుటుంబ సభ్యులు తట్టలళ్ల బియ్య మోస్తరా?” అని ప్రశ్నించారు. అలాగే, తేమ కొలిచే యంత్రాలు, తుకాలు వేసే కాంటాలు, అకాల వర్షం వస్తే ధాన్యం తడవకుండ ఉండేందుకు టార్పలిన్ లు కూడా అందుబాటులో లేవన్నారు.
నూకలను అరికట్టేందకు కేంద్రం 2018 నుంచే రాష్ట్రాలకు పలు సలహాలు చేసిందన్నారు. స్టేట్ బయోఫ్యూయల్ ఉత్పత్తి బోర్డు ఏర్పాటు, ఫోర్టిఫైడ్ రైస్(పోషక ఆహారం) తయారు చేయాలని సూచించిందన్నారు. బయోఫ్యూయల్ బోర్డు ఏర్పాటు కోసం 2018 లో అప్పటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సీఎం కేసీఆర్ కు లేఖ రాసారని, 2019 లో ఆ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి మరో లేఖ రాసిందని చెప్పారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. అలాగే, ఫోర్టిఫైట్ రైస్ కు కేంద్రం క్వింటాల్ కు అదనంగా 73 రూపాయలు ఇస్తుందని చెప్పారు. బ్రోకన్ వీట్, బియ్యం( విరిగిన గోధుమలు, నూకలు)తో ఈ రైస్ తయారవుతుందని, చిన్న పిల్లలకు, గర్భిణీ స్రీలకు, మహిళలకు హెల్తీ అని చెప్పారు. ఫోర్ట్ రైస్ ఇస్తామని ఎన్నో సార్లు అంగీకరించినా… ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్ కేంద్రానికి ఇవ్వలేకపోయిందన్నారు.
రాజకీయ దీక్షలు చేసి రావణ కాష్టం చేశారు….
బాయిల్డ్ రైస్ పై కేంద్రంతో ఒప్పందం చేసుకున్న టీఆర్ఎస్ సర్కార్… అన్ని మరిచి రైతు దీక్ష పేరుతో రాజకీయ దీక్షలు చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ధాన్యం కొనుగోళ్ల పై పంచాయితీ నుంచి పార్లమెంట్ దాకా అనవసర రాద్ధాంతం చేసి రైతు జీవితాలతో చెలగాటం ఆడిందన్నారు. దీంతో msp కన్న తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకొని చాలా మంది రైతులు నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై, రైతులపై పెత్తనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. కేంద్రం రైతుల విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తుందని చెప్పారు. 60 ఎల్ఎంటీల ధాన్యం ప్రొక్యూర్మెంట్ పై ఈ నెల 13 రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ 14 న కేంద్రానికి అందిందన్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడంతో… 18 వ తేదిన ఫస్ట్ అవర్ లోనే కొనుగోళ్లకు అంగీకారం తెలుపుతూ లేఖ రాసినట్లు చెప్పారు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం సేకరణపై ఇటు రైతులను, అటు మిల్లర్స్ కు క్లారిటీ ఇవ్వలేదని చెప్పారు. 2020-21 రబీ కి సంబంధించి 7.35 ఎల్ఎంటీల బియ్యం ఇంకా కేంద్రానికి పెండింగ్ లో ఉందన్నారు. కేంద్రం ఆరు సార్లు ఎక్స్ టెన్షన్ ఇచ్చినా బియ్యాన్ని సరఫరా చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో 2,470 రా రైస్, 970 బాయిల్డ్ రైస్ ప్రొడ్యూస్ చేసే మిల్స్ ఉన్నాయన్నారు. అయితే, రైతుల్ని చైతన్య పరిచినా, పంట సాగు నెల ముందుకు జరిపినా, సీడ్ మార్చిన బాయిల్డ్ రైస్ సమస్యనే ఉండదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్ లో అనుసరిస్తోన్న పంట విధానం అవసరమన్నారు. దీంతో 90 శాతం బాయిల్డ్ రైస్ సమస్య కు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.