ఎవుసం చేయడమే
ఏడేడు జన్మల పాపమైంది
అన్నదాతగా మారడమే
మహా శాపమై చుట్టుకుంది
మెతుకు పండించడమే
ఘోర నేరమై వెంబడిస్తుంది
ఈ దేశంలో పుట్టడమే
తప్పిదమై తరుముతుంది
కాదంటే..
దేశానికి వెన్నెముకైన రైతన్నపై
ఇంత చులకన భావన దేనికి ?
జగతిని సుసంపన్నం చేసిటి
సాగుబాటుకు నగుబాటేంటి ?
ప్రకృతి విపత్తులు పెట్రేగినా
చీడల పీడలు కాటువేసినా
కనీస మద్దతు ధర కరువైనా
పెట్టుబడులు మట్టి పాలైనా
లెక్కపెట్టక పంటలు పండిస్తే
పట్టిచ్చుకునే నాధుడు లేడు
ఇపుడు వరి గింజలు కొనాల్సిన
పాలకులే వద్దని తెగేసి చెప్తుంటే
పరస్పర దూషణకు దిగుతుంటే
సరికొత్త నాటకాలు అడుతుంటే
రైతుల వెతలు ఇంకెవరికి పట్టేది?
వడ్డీకి పావుసేరు అమ్మకంబెట్టి
దుఃఖం మూట కట్టడం తప్పా !
ఏది ఏమైనా…
పాలకుల వైఖరి మారేదెపుడో
అన్నదాత వరిగోస తీరేదెన్నడో
సాగుకు గౌరవం దక్కేదెన్నాళ్లకో
(వడ్ల రాజకీయాలకు నిరసనగా…)
– కోడిగూటి తిరుపతి :9573929493