- 8 ఏండ్లలో వ్యవసాయ రంగానికి రూ.3.75 లక్షల కోట్లు
- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
జగిత్యాల, మే 30(ప్రజాతంత్ర ప్రతినిధి) : అన్నదాతను గౌరవిస్తేనే మనల్ని మనం గౌరవించుకున్నట్లని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్‌లో వ్యవసాయ సన్నద్ధ సమావేశానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మనిషి అంతరిక్షానికి ఎగిరే సాంకేతికత సాధించినా మనుషులు తినే ఆహారం రావాల్సింది భూమి నుండేనన్న విషయాన్ని మరిచి పోవద్దన్నారు. పరులు తినేందుకు పండిస్తున్న వాడు రైతు కాబట్టి అన్నదాత అంటున్నారని, అన్నదాతను గౌరవిస్తేనే మనల్ని మనం గౌరవించుకున్నట్లని అన్నారు. సంతోషమైనా, దుఖమైనా భూమిని మాత్రమే నమ్ముకుని, భూమితోనే ఉండేవాడు ఒక్క రైతు మాత్రమేనని అన్నారు.
రాష్ట్రంలో అన్నదాతను ఆకాశానికి ఎత్తి ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యం నింపడమే ధ్యేయంగా ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగునీరు, రైతుబంధు పలు పథకాలను అమలు చేసి అండగా నిలిచామని అన్నారు. ఎనిమిదేళ్లలో రూ.3.75 లక్షల కోట్లు వ్యవసాయానికే ఖర్చుపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. 8 ఏళ్లలో రాష్ట్ర పథకాలను దేశంలోనూ కాపీకొట్టి అమలుచేస్తున్నారు .. తిరిగి తెలంగాణకే పాఠాలు చెప్పజూస్తున్నారని కేంద్రాన్ని విమర్శించారు. రూ.2 కిలో బియ్యం కోసం ఒకనాడు వోట్లేసినం .. నేడు తెలంగాణ ఎనిమిదేళ్లలో దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండించి అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను పరిశోధించి మార్కెట్ రీసెర్చి అనాలసిస్ వింగ్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం రైతులకు వేయాల్సిన పంటలను సూచిస్తుందని తెలిపారు. రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు పండించి వ్యవసాయం లాభసాటి చేసుకోవాలని కోరారు. తెలంగాణ వరి ధాన్యం సేకరించడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, కొనమని అడిగితే అవమానిస్తున్నదని అన్నారు. రూ.4 వేల కోట్లు పెట్టి రైతుల ధాన్యం కొనడానికి మనసురాని కేంద్రం .. రూ.11 లక్షల కోట్లు కార్పొరేట్ల అప్పులను మాఫీ చేసిందని దుయ్యబట్టారు.
ఏటా రూ.80, 90 వేల కోట్ల విలువైన వంటనూనెలు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం, అందుకే తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. కొరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇచ్చిన సడలింపులనే కేంద్రం గమనంలోకి తీసుకుని దేశవ్యాప్తంగా అమలుచేసిందని అన్నారు. వ్యవసాయం, రైతు కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ అనుకూల విధానాలతో రైతుకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. భవిష్యత్‌లో ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుతుంది .. అప్పుడు ప్రపంచానికి సరిపడా ఆహారం అందించగలిగే సత్తా భారత్‌కు మాత్రమే ఉన్నదన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగరరావు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జడ్పీ చైర్మన్ వసంత, కలెక్టర్ రవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.