తను తన అశక్తతను చాటుకుంటున్నాడు
చూడండి ఎలా ఏహ్యమైన వ్యాఖ్యానాల్లో
చిక్కుకుని ఉన్నాడో ఈ అత్యాధునిక మానవుడు
గీసిన గీతలన్నీ ఊహల్లోనే మిగిలిపోయాయి
చేసిన చేతలేమో చుట్టూ ముళ్ళ కంపలై ఉన్నాయి
బాధ్యతో ప్రవాహమో తెలియదు
చేయాల్సిన సమయంలో ఇవేవో చేయక మరేవో చేసి
ఇప్పుడు మొదలెడతానంటే ఏవేవో వచ్చి
నిద్రలేమి లోకంలో సంచరింపజేస్తున్నాయి
ఉన్నట్టే ఉంటది ఇప్పుడే జరిగినట్టు అనిపిస్తది
ఎన్నో గిర్రున తిరుగుతాయ్
ఏఏ మొహాలో ఎక్కడెక్కడివో ఎందరో
ఎన్ని సంఘటనలో ఎన్ని కార్యాలో సమావేశాలో
మనం కాని మనం మిగిలిపోయున్నామని తెల్పుతాయో
మన నుంచి మనం రూపాంతరం చెందామనో
మనం మనల్ని వదులుకున్నామనో
పరిస్థితులు విడదీసాయో వంచాయో
తెలియదు అలా మనలోని ఎందరినో
ఏదేమైనా మనం అంటే మనతో పాటు మన దేహం
అందరూ మన ఆకారాన్నే కదా ముందు గుర్తించుకునేది
మన చేష్టలు ఆలోచనలు ఆశయాలు వగైరాలు
మనల్ని చెక్కుతాయి మన వ్యవహారాన్ని ప్రతిదాంట్లో
ఆశ్చర్యపోవాల్సిన అవసరం అసలే లేదు
ఎప్పుడైతే నువ్వాగిపోయావో
వేరే దారి వెతుక్కున్నావో విసుక్కున్నావో
ఇక అప్పణ్ణించే నువ్వు కనుమరుగైపోయావ్
ఒకప్పుడు… అంటూ కథలు చెప్పుకోవల్సిందే
నచ్చనివి నప్పేవి ఒప్పేవి ఇవే కదా
నిన్ను ఇలా ప్రశ్నార్థక చిహ్నాన్ని చేసేసాయ్
ఎప్పుడో నువ్వనుకున్నది చేయాల్సింది
అప్పుడు తేలిగ్గానే అయ్యేవి అవన్నీ
ఒక స్థిరత లేకే కదా దేనిపై కూడా
ఇప్పుడు నువ్వనుకోవచ్చు
అప్పటికన్నా ఎదిగిపోయానని
కాని ఉత్పత్తిని నిలిపేసావ్ కదా
నిన్ను వెతుక్కునే వాళ్ళకు నీ వృద్ధి దశలు
లేకుండా చేసినట్టే అది నీకైనా సరే
నువ్వెలాగో లెక్కలేసుకుంటావ్ లే తెలిసిందే అది
ఏదో ఒకటి నీకొచ్చింది నీదైన రీతిలో
చేస్తా ఉండుంటే బావుణ్ణు అలాగే నిరంతరంగా
అవన్నీ కూడా వాటంతటవే కలిసేవి
లేదా ఇదే వేరేదయ్యేది అంతే తప్పా
ఎందుకంటే మనకిచ్చిన సమయం
అనిశ్చితి ముల్లుపై తిరుగాడుతుంది కదా
ఒక్క జీవితంలోనే ఎన్నో జీవితాలు
జీవించగలగడం ఆశామాషి కాదు
అన్నీ అన్ని పాళ్ళల్లో కుదరవు
కొన్నింటికి తయారుగా ఉండాలి
కొన్ని భరించగలగాలి
కొన్ని ఛేదించగలగాలి
కొన్ని వదులుకోగలగాలి
కొన్ని సహించగలగాలి
మళ్ళీ పొద్దునయ్యే సరికి తయారుగా ఉండాలి
అప్పుడే ఆవిష్కరించగలం కదా కొన్ని…
– రఘు వగ్గు