- విద్యుత్ షాక్ తగిలి నాలుగో తరగతి విద్యార్థిని మృతి
- పరిగి మండలం మంచన్ పల్లి గ్రామంలో ఘటన.
- న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యుల ఆందోళన
- సమస్యలకు నిలయాలుగా సర్కార్ బడులు
పరిగి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 03 : పరిగి మండలం మంచన్ పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న దీక్షిత అనే విద్యార్థిని మూత్రశాలకు వెళ్లి అక్కడ వేలాడుతున్న విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. ఈ ఘటనకు ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్, అధికారులే కారణం అంటూ విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబీకులు వాపోయారు. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ బడులు సమస్యలకు నిలయంగా మారుతుండడంతోనే ఈరచూ ఇటాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు కొనసాగిస్తున్నామని చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు దర్శనం ఇస్తున్నాయి.
ఏ బడిలో చూసినా ఏదో ఒక సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక విద్యాభ్యాసం అందించే విద్యాలయాలే విద్యార్థుల పాలిట మృత్యు కూపాలుగా మారుతున్నాయి. దీనికంతటికీ అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యమే నిదర్శనంగా నిలుస్తున్నది. క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం ఒక కారణం అయితే, మరో పక్క తనిఖీలు నిర్వహించినా వాస్తవాలను పక్కన పెట్టి తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు అనే ఆరోపణలు సైతం కోకొల్లలు. అంతేకాక మరికొన్ని ఘటనల్లో అధికారులు అక్రమార్కుల పట్ల అండగా నిలిచి జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మన ఊరు-మన బడి వంటి కార్యక్రమాలతో పాఠశాల విద్యను బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా క్షేత్ర స్థాయిలో అందుబాటులోకి రాలేక పోతున్నాయి.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబీకులు, ప్రజాసంఘాల ఆందోళన
మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి తగిన న్యాయం చేసి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి మండల విద్యాధికారిని సస్పెండ్ చేయాలని, జిల్లా కలెక్టర్ వొచ్చి బాధిత కుటుంభానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం : డిఎస్పీ .
విద్యార్థి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై ధర్నా చేపట్టిన బాధిత కుటుంబ సభ్యులతో పరిగి డిఎస్పీ కరుణా సాగర్ రెడ్డి మాట్లాడి వారిని సముదాయించారు. విద్యార్థి మృతి చాలా బాధాకరమని, మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు డిఎస్పీ బాధిత కుటుంబానికి తెలిపారు.