బీజేపీ నాయకుల,కార్యకర్తల అరెస్టులను ఖండిస్తూ ప్రకటన విడుదల
హైదరాబాద్,జూన్ 3: జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా శుక్రవారం శాంతియుతంగా ధర్నా చేస్తున్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చింతల రాంచంద్రారెడ్డి తో పాటు, బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి , బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్ , బిజెపి సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు తో సహా 300 మందికి పైగా బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ హైదరాబాద్ లో పత్రికా ప్రకటన విడుదల చేసారు. గత నెల 20వ తేదీన బంజారాహిల్స్ లోని ఓ పబ్ లో మద్యం తాగిన కొంతమంది ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన దిగ్భ్రాంతికరం..అని పేర్కొంటూ ..25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా ఈ కేసును నీరుగార్చాలని పోలీసులు ప్రయత్నం చేశారు.
హైదరాబాద్ నగరంలో టీఆర్‌ఎస్ స్టీరింగ్ నడుపుతున్న ఎంఐఎం నాయకుల ఒత్తిడి మేరకే నిందితులను తప్పించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటనను పోలీసులు నీరుగార్చేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగానే బిజెపి భావిస్తున్నది. ఈ సంఘటనకు బాధ్యులైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తుండగా అరెస్ట్ చేసిన బిజెపి నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఘటనకు సంబంధించిన నిందితులను వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయపరంగా చర్యలు తీసుకొని అత్యాచారం జరిగిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం..అని ప్రకటనలో పేర్కొన్నారు.