మనషివవ్వాలంటే/ అప్పుడప్పుడు / కన్నీళ్లతోటి/ మాట్లాడు అంటారొక నానీలో ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్‌ ఎస్‌ ‌రఘు. నానీలలో అసాధారణ మానవీయ కోణాల్ని దృశ్యీకరించిన ఆయన జీవనలిపి లోకి తొంగి చూస్తే అనంతకోటి ఆర్తి చిత్రాన్ని అజరామరంగా పలికేది ఖచ్చితంగా కవిత్వమేననిపిస్తుంది. హృదయగత భావాలను వెల్లడించగలిగే ప్రక్రియగా నానీలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత సాహితీవేత్త ఆచార్య ఎన్‌ ‌గోపి రూపం పోస్తే ఆ బాటలో ఎంతో మంది నడిచి లెక్కకు మించిన సంపుటాలను వెలువరించారు. 2004లో వెలువడిన జీవన లిపిలోని నానీలు ఆలోచనా సాంద్రతతో ఆర్ద్రంగా, హృద్యంగా, వైవిధ్యంతో కూడిన ముగింపుతో రచనా విలక్షతను ప్రదర్శించాయి. క్లుప్తత పాటిస్తూ నాలుగు పాదాలలో ఇరువై ఐదు అక్షరాల సూత్రీకరణను దృష్టిలో పెట్టుకొని సామాజిక జీవితంలోని, అంతరంగ ఉద్వేగాలలోని అనేక విషయాలను రఘు గొప్పగా దృశ్యీకరించారు.

సమాజంలో విభిన్న మనస్తత్వం కల మనుషులెలా ఉంటారో ఒక నానీలో చెబుతూ అతనిది/ మరీ విడ్డూరం/ పుష్ప విలాపం వింటూ/ పూలు కోస్తుంటాడు అంటారు. ఆగని జీవనది కాలం అని ఒక కవి అంటే కాలం/ జీవనదిలా ప్రవహిస్తుంది/ ఆగిపోయిన పడవల్లా / మనుషులు అని రఘు అభిప్రాయపడ్డారు. ఇది తాత్వికత అద్దిన నానీ. కొండమీద/ ఆ గుడి చిన్నదే కానీ/ భక్తుడి భావం కొండంత అంటారు. ప్రపంచ దర్శిని, మస్తకాలను వెలిగించే తేజోదీపమైన పుస్తకం విలువను చాటిచెప్పే నానీలో పుస్తకాలకు/ రెక్కలుండవు/ చదివితే/ మనకు పుట్టుకొస్తాయి అని భావోద్వేగంతో చెబుతారు. పిల్లల మనస్తత్వాన్ని వర్షానికి అనునయించి రాసిన నానీలో దొంగ వర్షం/ బడికెళ్లాక కురుస్తుంది/ దొంగ జ్వరం/ ఇంట్లోనే వస్తుంది అని వ్యంగ్యాత్మక హాస్య ధోరణిని కనబరిచారు. కవయవః కాళిదాసస్యా అన్నట్టుగా కదులుతున్న/ మేఘాలున్నంత కాలం/ కాళిదాసు/ మహాకవే అన్న ముక్తాయింపును నానీతో ఇవ్వడం ప్రత్యేకంగా కన్సిస్తుంది. కాదేదీ కవిత కనర్హం/ ఔనౌను శిల్పమనర్ఘం అని శ్రీశ్రీ అన్నట్టుగా వస్తువైవిధ్యత, శిల్ప ఔన్నత్యానికి కేంద్రంగా పలు నానీలు రూపొందాయి.

పాత కవి/ వ్య•కరణశీలుడు/ కొత్త కవో/ వాదవివాదలోలుడు అని తీరుతెన్నులను విశ్లేషిస్తారు. ఆ రైలు / జీవిత కాలం లేటైతే/బావుండు/ కొన్ని ప్రాణాలన్నా మిగిలేవి అన్న నానీలో ఆదమరుపుతో ఎదురైన విపత్తును చూపించారు. శిశువుల మార్పిడి గురించి చెబుతూ హాస్పిటల్లో శిశువుల మార్పిడి/ బహ్మ్రదేవుడా/ అమ్మమ్మలు తారుమారయ్యారు అని అంటారు. జీవితం సుడిగుండమని వ్యాకరణంలో/ మూడు కాలాలు ముఖ్యం/ జీవితంలో ఒక్కటే అదే కష్టకాలం అన్న వాస్తవాన్ని వివరిస్తారు. పక్షికి/ ఆకాశమంత స్వేచ్చ/ మనిషికి/ భూమికున్నంత బాధ్యత అన్నది ఆలోచనాత్మకమైన నానీ. మనిషికంటే/ ఊసరవెళ్లే నయం/ అది రంగులు మాత్రమే/ మారుస్తుంది అనడంలో సమాజంలో మనిషి పోకడను చెబుతారు. వాడు ఏ పని/చేసినా భారీగా ఉంటుంది/ గొడ్డలితో పెన్సిల్‌ ‌చెక్కుతాడు అని మనుషుల ధోరణిని స్పష్టపరుస్తారు. శుభలేఖలో/ ఏదో అచ్చు తప్పు/ సర్దుకు పోవడం/ ఇప్పట్నుంచే మొదలు అన్న నానీ సంసార బంధంలోని సర్దుబాటుని చెబుతుంది. విమానానికి గాలిపటానికి ఒకే అవస్థ కృత్యాద్వ్యవస్థ అంటారు.

జొన్నరొట్టెలు/ నగరాన్ని చేరాయి/ పిజ్జాలు భయపడుతున్నాయి అన్న నానీ గ్రామీణ జీవితపు ప్రత్యేకతకు ప్రతిబింబంగా కన్సిస్తుంది. ఇతిహాసపు చీకటి కోణాలను గురించి మాట్లాడే ముందు నీ పక్కన చూడు అని అంటారు. రాత్రుళ్ల రంగుల ప్రపంచం, నల్లధనం, వైవాహిక వ్యవస్థ ఆత్మసాక్షి, ఇంటర్నెట్‌, ‌పచ్చదనం వంటి విషయ నానీలు ఆలోచనల పరిధిని విస్తృత పరుస్తాయి. పరుగు పందెంలో/ ఫస్టొచ్చాడు/ జీవితం నడకలో తడబడుతున్నాడు అని అంతరంగ విశ్లేషణ చేశారు. ఇప్పుడే/ అందిన ఉత్తరం/ విప్పకముందే/ ఏదో ఆనంద గీతిక అన్న నానీ కనుమరుగైపోతున్న ఉత్తరం ఒకనాడు ఇచ్చిన ఆనందాన్ని గుర్తు చేసింది. ఏవేవో/ లాకర్లో దాచుకుంటాం/ మనస్సునేమో /నిర్లక్ష్యంగా పారేసుకుంటాం అన్న నానీ స్వీయ సమీక్షకు దారులు తీస్తుంది. ఎగరలేని పుష్పకవిమానం/ అతడి/ ఆశలు మోయలేక అంటూ అత్యాశ అనర్థమని హెచ్చరిక చేశారు. పల్లెల నడకలు, నగరాల పరుగులు పొట్టతిప్పలే అంటారు. వానచినుకుల చప్పుడును భూమి చేసిన చప్పట్ల హర్షంతో పోల్చారు. మనోపేటికలోని జ్ఞాపకాన్ని వెలిగిస్తే చీకటి ఎక్కడిదని అంటారు. కౌగిలింతల్లో/ కుల స్పృహ/ కరచాలనంలో వరద స్పృహ / లోకం పాడైందని వర్తమానాన్ని తలచి బాధపడతారు. దేహమే దేవాలయమైతే కొత్త గుడి ఎందుకని ప్రశ్నిస్తారు. గతంలో/ పోస్టుమార్టం చేసేవాడు/ ఇప్పుడు/ గొప్ప విమర్శకుడయ్యాడు అన్న నానీ ఆలోచింపజేసేదిగా ఉంది. మూడుముళ్లు పడ్డాయనేదే కాదు, వారి మనసులు ముడిపడ్డాయా అన్నది ఆలోచించమంటారు.

ఫ్లోరైడ్‌ ‌సమస్యను చిత్రించిన నానీ పాలకుల నిర్లక్ష్యానికి ప్రతీకగా కన్సిస్తుంది. పల్లె అంగవైకల్యంతో కుంటుంతుంది/ ఫ్ల•రీన్‌/ ‌కాళ్లిరగ్గొట్టాలి అని అంటారు. జీవితానికి పీఠిక, దుః ఖానికి ముగింపు లేదన్నారు. కన్నీళ్లు సంధానమైయ్యాయి కాని నదులు అ అనుసంధానం కాలేదంటారు. తెలుగు వాచకంలో/నెమలీక లేదు/ ఎందుకంటే/ తెలుగే లేదు కాబట్టి అంటూ అమృత భాషగా పేరున్న తెలుగు మృత భాషగా మారుతుండడంపై వేదన చెందారు. మౌనం రాజ్యమేలితే మాట ప్రపంచాన్ని శాసిస్తుందంటారు. మరణం తప్పనప్పుడు చెట్టుగా పునర్జన్మ ఎత్తాలంటారు. లోకంలో అజాత, అజ్ఞాన శత్రువులు ఉంటారని అన్నారు. కవి, సూర్యుడూ ఇద్దరూ ఒకటే/ నిరంతరం దగ్ధదమౌతుంటారు అన్న నానీని చెప్పారు.కొండ మీది బండలు యోగాసనాలు నేర్పే గురువుల్లా ఉన్నాయంటారు. కాలం ఏడువదూ, నవ్వదు కానీ మనిషి చేత ఆరెంటిని చేయిస్తుందని అంటారు. నగరానికి మృత్యువు డొక్కలోనే స్మశాన రూపంలో ఉందని చెబుతారు. రైతే రాజయితే ఆకలి జైలులో ఎందుకు పడ్డట్టు అని ప్రశ్నిస్తారు. మనిషికి/ బలం/ పాలకులకు/ ఇంద్రజాలం తప్పనిసరి అని చెప్పారు. పడ్డారు. నిద్రకూ, మెలకువకు మధ్య కలల అలలు అని విశ్లేస్తారు. ఈ దారికి/ ఎంత ఓపికో/ ఎందరు ప్రయాణించిన అలిసిపోవడం లేదంటారు. బ్రహ్మ/ గొప్ప డిజైనర్‌ ‌కూడా/ సీతాకోకచిలకల/ రెక్కలు చూడండి/ అన్నది అందాల లోకంలో విరబూసిన నానీ.

సెల్‌ ‌ఫోన్‌/ ‌మ•గ్రింది/ ఏకాంతపు గుండెల్లో/ ముల్లు గుచ్చుకుంది… కాలాయాపన/ ఖరీదైన దుబార/ సమయపాలన/ అమూల్య చైతన్యం… నినాదాలు లేని/ ఉద్యమం/ గర్జించని సింహంలా/ చప్పగా ఉంటుంది. ఈ లోయలోకి దికాగ/ తెలిసింది. భూమికి హృదయముంటుందని… రాత్రవగానే/ చంద్రుడు/ అలల పరుపుల మీద/ ఆటాడుకుంటాడు… పదవిలోని/ మనిషికెంత బలం/ నీళ్లలోని మొసలిలా.. పొలంలో విత్తిన/ కల్తీ విత్తనం/ రైతు ఆత్మహత్యగా/ మొలకెత్తింది… గ్రంథం కంటే/పీఠిక బరువయ్యింది/ దోమ/ ఏనుగును మింగిసేంది… ఉద్యోగులది/ పదవీ విరమణ/ ఉపాధ్యాయుడిది/ పెదవీ విరమణ… వాడువీడు/ రాసుకుంటే/ రాలేదిప్పుడు/ రాజకీయ బూడిద అన్న నానీలు పలు విశ్లేషణలకు తెరతీస్తాయి. ఆత్మహత్యను లోకాన్ని ధిక్కరించే తాత్విక నిరసనగా చెబుతారు.

ప్రపంచం అరిచేతిలో కుగ్రామమైతే పల్లెల పరిస్థితిని స్పష్టంగా వివరించారు. చింతలు/ చెదపురుగులు/ నిశ్శబ్దంగా జీవిత గ్రంథాన్ని తినేస్తుంటాయన్న వాస్తవాన్ని తెలిపారు. మృత్యువుకీ, స్మశానానికి/ అందరూ సమానమే/ సోషలిజం/ అర్థమైందా అని అంటారు. అన్నప్రాసనలో బ్యాట్‌ ‌పట్టాడు/ తల్లికి/ టెండుల్కర్‌ ‌కలలు… ఆర్టు ఫిలిం చూసొచ్చా/ లోకమంతా స్లో మోషన్‌లో కన్పిస్తుంది… ఆదర్శం అయ్యింది/ ఏకాకి/ మరి ఆడంబరమో అని ప్రశ్నిస్తారు. ఇది/ కవిత్వం కాకపోవచ్చు/ నా మీద నేనే రాసిన ఎలిజి… ఈ నది/ ఎక్కడ పుట్టిందో తెలియదు/ అలాగే/ దుఃఖం కూడా… వాడిన పూలు/ చెప్పే కథలు ఏమై ఉంటాయి/ భక్తి గురించా/ రక్తి గురించా.. అక్కడో నైరూప్య చిత్రం/ చూడాలంటే/ మనసుకు కళ్లుండాలి… కాలాన్ని/ ఆపగలిగితే బావుండు/ అమ్మను వెళ్లనివ్వకపోదును వంటి ఎన్నో నానీలు ఆలోచనాత్మకంగా తారాడాయి. తాడు లేని ఉరితో గ్లోబలైజేషన్‌కు పోలిక చూపి దోపిడీ, పీడన అంతం కావాలన్న పిలుపును ఇచ్చారు. వర్షాన్ని చూసి బాల్యాన్ని పడవలా ఒదిలిన అపరూప భావన ఈ నానీలలో నిండుగా, మెండుగా కన్పిస్తుంది. శోకమా, శ్లోకమా అన్న ఆలోచననూ కలిగిస్తాయి. అర్థాల నిఘంటువు అక్కరలేకుండానే అత్యంత సులవుగా అర్థమై అర్థవంతపు జీవిత నడకకు దారిని చూపుతాయి.
– తిరునగరి శ్రీనివాస్‌, 8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *