• మెరుపు తీగెలు

-బమ్మిడి జగదీశ్వరరావు

‘ఇదే కొండ!’

‘ఏది?’

‘ఇదే… గుట్టకాదు, మనం వున్నదే కొండ. ఉంది అంటే వుంది. లేదు అంటే లేదు’

‘అదేంటి?’

‘అంటే, కొండని పనసకాయ చెక్కినట్టు చెక్కేశారు. అంతే’

‘నాకయితే మనకి చిన్నప్పుడు చేసిన డిప్ప కటింగు గుర్తుకొస్తోంది’

‘రెండ్రోజులు ఆగితే ఆపక్కంతా నున్నగా గుండు గీకినట్టు గీకేస్తారు’

‘అడవి… అడవిలోని జంతువులు యేవి?’

‘అవన్నీ వుంటే, మనం యిక్కడ నిలబడగలమా? టూరిజం నిలబడగలదా?’

‘అడవిని నరికి ఆర్టిఫిషియల్ చెట్లు పెట్టారేమిటి?’

‘ఆర్టిఫిషియల్ చెట్లయితే మొక్కప్పుడే కాదు, మానప్పుడూ వొంగుతుంది. నైట్ లైట్లూ అవీ…’

‘అదిసరే, పక్షులూ జంతువులూ అన్నీ బొమ్మలు పెట్టి కింద బోర్డుమీద పేర్లు కూడా రాశారే?’

‘ఈ ప్రాంతంలో యింతకుముందు సంచరించిన పక్షుల గురించి జంతువుల గురించి జంతుప్రేమికులు సహా అందరూ తెలుసుకొంటారని…’

‘తెలుసుకొని యేంచేస్తారు?’

‘చరిత్రలో భాగం చేస్తారు…’

‘బాగుంది, బొమ్మ జంతువుల్ని పెట్టి మనల్ని పిల్లల్ని చేసి ఆడిస్తున్నారు…’

‘మీ బాల్యాన్ని మీకు యిస్తున్నారని కూడా అనుకోవచ్చు…’

‘ఏమిటో?’

‘చూడు… పెద్దవాళ్ళు కూడా ఆ బొమ్మజంతువులమీద యెక్కి ఆడుకుంటున్నారు, అవే ప్రాణమున్న నిజం జంతువులయితే ఆ అవకాశం వుండేదా?’

‘ఇదంతా యెందుకు, కాంట్రాక్టర్లని మేపడానికి కాకపోతే?’

‘అలా అనకు, పర్యావరణంకన్నా పర్యాటకం ముఖ్యం! అడవి అలా వుంటే మనీ జనరేట్ అవదు కదా? హోటళ్ళూ బిజినెస్సూ వుంటే ఆదాయమూ అభివృద్ధీ…’

‘నువ్వు పేపర్లూ టీవీలూ చూసి ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వుంటావనుకుంటా.’

‘వై?’

‘ఎలా ఆలోచించాలో వాళ్ళు డిజైన్ చేసి పెట్టారు కదా?’

‘అదంతా కాదు, నెగటివ్ మైండ్ హాని! పాజిటివ్ మైండ్ హనీ!!’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *