పెట్టుబడి పెట్టనున్న లాయిడ్స్ సంస్థ
ట్విట్టర్ ద్వారా తెలియచేసిన కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి ప్రారంభించాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత బ్యాంకింగ్ సంస్థ లాయిడ్స్ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
లాయిడ్స్ గ్రూప్ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తమ సాంకేతిక కేంద్రాన్ని త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ముందుకు వచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. తొలి ఆరు నెలల్లోనే 600 మందిని లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ నియమించుకోనుంది. అమెరికా, యూకే పర్యటనల్లో భాగంగా మే 13వ తేదీన లాయిడ్స్ బృందంతో సమావేశమైనట్లు కేటీఆర్ తెలిపారు. అతి తక్కువ వ్యవధిలోనే హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 2.8 కోట్లకు పైగా కస్టమర్లతో రిటైల్ అండ్ వాణిజ్య విభాగాల్లో లాయిడ్స్ సంస్థ సేవలందిస్తుంది.


