- నిండుకుండలా మారిన ప్రాజెక్టులు
- మత్తడి దుంకుతున్న చెరువులు
- భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
- దుమ్ముగూడెం వద్ద వంద కుటుంబాల తరలింపు
- ఉప్పొంగుతున్న మంజీన నది..జలదిగ్బంధంలో వలిమెల
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు….మత్తడి పారుతున్న భద్రకాళి చెరువు
- జూరాలకు పెరుగుతన్న వరద…నెట్టెంపాడుకు నీటి విడుదల
- ఇలెందు సింగరేణి ఓపెన్ కాస్టుల్లోకి భారీగా వరదనీరు…నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
- ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు…గర్భిణిని వాగు దాటించి కాపాడిన గిరిజనులు
- నిర్మల్ జిల్లాలో వరదల పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్ సమీక్ష…అధికారులకు దిశానిర్దేశం
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం… 20గేట్ల ఎత్తి దిగువకు నీటి విడుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : అల్ప పీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్‌ప్లో కొనసాగుతున్నది. గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఓవైపు వరద ఉద్ధృతి..మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో వొచ్చే ప్రవాహంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. కొన్ని చోట్ల చెరువుల కట్టలు తెగి సమీప ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. గోదావరితో పాటు ఉపనదులు ఉరకలెత్తుతున్నాయి. భారీ ప్రవాహంతో జలాశయాలు నిండుకుండలా మారటంతో..గేట్లను ఎత్తి, నీటిని దిగువకు వదులుతున్నారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం వేగంగా పెరిగి ప్రస్తుతం నిలకడగా ప్రవహిస్తుంది. నీటిమట్టం 53అడుగులు దాటి ఉండడంతో.. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. రాత్రి వరకు 53.9 అడుగుల వరకు పెరిగిన నీటిమట్టం..మంగళవారం ఉదయానికి ఐదు పాయింట్లు తగ్గింది. పెరిగిన గోదావరి నీటిమట్టం వల్ల భదాద్రి రామయ్య సన్నిధి వద్ద అన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరాయి. భద్రాచలంలోని లోతట్టు కాలనీలు మునిగిపోయాయి. అక్కడున్న వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. స్నానఘట్టాలు, కల్యాణ కట్ట ప్రాంతం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. భద్రాచలం నుంచి చర్ల, దుమ్ముగూడెం మండలాలతోపాటు.. దిగువన ఉన్న ముంపు మండలాల రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని సుమారు 100 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
జిల్లా కేంద్రంలో ఉట్నూర్, ఆదిలాబాద్ మధ్య రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని అధికారులు బయటకు వదులుతున్నారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంజీర నది ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల్లో వర్షాలకు నదిలోకి వరద తరలివస్తున్నది. మోర్గీ వంతెన వద్ద మంజీర నది ఉరకలేస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పెద్దపేట వంతెన కొట్టుకుపోయి మహదేవ్‌పూర్ పలిమెల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా లేక అవస్థలకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 62వేల 840 క్యూసెక్కుల వరద వొచ్చి చేరుతుండగా..20 గేట్ల ద్వారా 69వేల 450 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 14వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం వెయ్యి 87 అడుగుల నీటిమట్టం, 75 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోకి భారీగా వరద ప్రవహిస్తుంది.

ప్రాజెక్టులకి లక్షా 40 వేల క్యూసెక్కుల వరద చేరుతుండడంతో..11 గేట్ల ద్వారా లక్షా 29 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 692 అడుగులకు చేరింది. సారంగాపూర్ మందలంలోని స్వర్ణ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతుంది. జలాశయంలోకి 4వేల క్యూసెక్కుల వరద వొస్తుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 11వందల 83 అడుగులు కాగా ప్రస్తుతంస నీటిమట్టం 11వందల 79 అడుగులు చేరింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, భదాద్రి కొత్తగూడెం, సూర్యాపేటతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా కుమ్రంభీం జిల్లా కెరిమెరిలో 17 సెంటీవి•టర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ జంట జలాశయాల్లోకి వరద కొనసాగుతుంది. ఉస్మాన్‌సాగర్‌కు 250 క్యూసెక్కుల వరద వొస్తుండగా..రెండు గేట్ల ద్వారా 312 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులుకాగా.. ప్రస్తుత నీటి మట్టం 17వందల 86 అడుగులు ఉంది. హిమాయత్‌సాగర్‌కు 500 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా.. రెండు గేట్ల ద్వారా 515 క్యూసెక్కులు మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులుకాగా.. ప్రస్తుత నీటిమట్టం 1760.55 అడుగులు ఉంది. హుస్సేన్‌సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. హుస్సేన్‌సాగర్‌కు మీటర్లు వొస్తున్న నీటికి సమానంగా తూముల ద్వారా బయటకి వెళ్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో భారీగా వర్షాలు…. మత్తడి పారుతున్న భద్రకాళి చెరువు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్ని జలకళను సంతరించుకుని చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. వరంగల్‌లో భద్రకకాళి చెరువు పూర్తిస్థాయిలో నిండి మత్తడి దూకుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయిదు చెరువులకు గండిపడగా పలుచోట్ల రోడ్లు ధ్వంసమై పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదలతో రవాణా సౌకర్యం లేని గ్రామాల్లోని గర్భిణీ స్త్రీలను ముందస్తుగా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య అధికారులు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునారావస కేంద్రాల ఏర్పాటు చేసి సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వర్షం వరదలపై మహబూబాబాద్‌లో అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్షించారు. వర్షం వరదల వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడమే కాకుండా విద్యుత్తు సప్లైకి అంతరాయం ఏర్పడి త్రాగునీటి సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
జూరాలకు పెరుగుతన్న వరద… నెట్టెంపాడుకు నీటి విడుదల
గడచిన నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లోగా వస్తుండంగా అవుట్‌ప్లో 12 వేల 225 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.130 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి సామర్ద్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.969 టీఎంసీలుగా ఉంది. కుడి,ఎడమ కాలువలతోపాటు నెట్టెంపాడు ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి, నారాయణపూర్‌కు భారీగా వరద నీరు వొచ్చి చేరుతుంది. నారాయణపూర్ ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వొదులుతున్నారు. ఈ నీళ్లు బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం వరకు జూరాల చేరే అవకాశం ఉందని జూరాల ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. వరద ఉదృతి పెరిగే అవకాశం ఉండటంతో నదీతీరా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నదిలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరిస్తున్నారు.
ఇలెందు సింగరేణి ఓపెన్ కాస్టుల్లోకి భారీగా వరదనీరు… నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
భదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో వర్షాలకు సింగరేణి ఏరియాలోని ఓపెన్‌కాస్ట్‌లో వరద నీరు చేరింది. దీంతో ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నది. ఇల్లెందు పదో గనిలో 10వేల టన్నుల ఒగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నది. టేకులపల్లి కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. 40వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీసే పనులకు అంతరాయం కలుగుతున్నది. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. భూపాలపల్లి కాకతీయ ఓపెన్ కాస్ట్ ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 35వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నాలుగున్నర కోట్ల మేర సంస్థకు నష్టం వాటిల్లింది. జలదిగ్బంధలో భూపాలపల్లి మండలం చికెన్ పల్లి గ్రామం బాధితులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ఘనపురం మండలంలోని వంగపల్లి వాణి చెరువు, ఊర చెరువు, ఎల్లారెడ్డి పల్లి చెరువులు మత్తడి పొయ్యడంతో గణపసముద్రానికి వరదనీరు భారీగా చేరుతుంది. చిట్యాల మండలం మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అందుకుతండా, వెంచరామి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు… గర్భిణిని వాగు దాటించి కాపాడిన గిరిజనులు
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిట్యాల గ్రామ సమీపంలో గల గోదావరి మధ్యలో ఉన్న కూర్రులో 9 మంది కౌలు రైతులు, వలస కూలీలు చిక్కుకున్నారు. గోదావరి ఉద్రిక్తంగా ప్రవహిస్తుడటంతో కూలీలు భయందోళనకు గురవుతున్నారు. రోజురోజుకీ గోదావరి మట్టం పెరగడంతో తమను రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే గుట్ట చుట్టూ మూడు వైపులా గోదావరి పాయలు ఉధృతంగా ప్రవహిస్తుందటంతో వీడియో కాల్స్ ద్వారా స్థానికులు బంధువులకు సమాచారం అందించి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు రంగంలోకి చర్యలు చేపట్టారు. మహిళకు పురిటి నొప్పులు రావడంతో అతికష్టంగా గిరిజనులు వాగు దాటించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతోవాగు ఉప్పోంగి ప్రవాహిస్తుంది. పైగా కల్వర్ట్ పై నుంచి నీరు ప్రవాహిస్తుంది. అయినప్పటికీ గిరిజన మహిళలు ఉప్పోంగే వరద ఉదృతిలో వాగులో చేతులు పట్టుకొని మరి గర్బీణీ మహిళను వాగు దాటించారు. వాగు దాటించిన ఆనంతరం 108లో వాహనంలో హాస్పిటల్‌కి తరలించారు.

నిర్మల్ జిల్లాలో వరదల పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్ సమీక్ష… అధికారులకు దిశానిర్దేశం
గతమూడు రోజులుగా క్షేత్రస్థాయిలో వరదలను పరిశీలించిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో నేరుగా సమీక్షించారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాలపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వల్ల ముంపుకు గురైన ప్రాంతాల పరిస్థితిని, పంట నష్టం, పునరావాస ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ, ఆర్‌అండ్ బీ విద్యుత్ శాఖ, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు, అంచనాలతో ప్రాథమిక నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో తలెత్తిన పరిస్థితి, ప్రస్తుతం తీసుకున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశర చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం… 20 గేట్ల ఎత్తి దిగువకు నీటి విడుదల
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువనుంచి భారీగా వరద రావడంతో నిండుకుండలా మారింది. ప్రస్తుతం జలాశయానికి 81,730 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఇప్పటికే 20గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు తాజాగా.. మరో ఆరుగేట్ల ఎత్తివేశారు. ప్రస్తుతం 26 గేట్లను ఎత్తి దిగువకు 1,07,118 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1087.50 అడుగుల మేర నీరున్నది. డ్యామ్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90.30 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 74.826 టీఎంసీలు నిలువ ఉన్నది.




