- పోలీసుల దర్యాప్తు ముమ్మరం
- హోమ్ మంత్రి మహ్మూద్ అలీ వెల్లడి
- సిబిఐ చేత విచారణ జరిపించండి : సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్ లేఖ
- కేసును సీబీఐకి అప్పగించాలి : కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు డిమాండ్
- డిజిపి కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : జూబ్లీహిల్స్‌లో జరిగిన మైనర్ బాలిక అత్యాచార ఘటనపై దోషులను వొదిలిపెట్టమని రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ లీ స్పష్టం చేశారు. ఈఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ హజ్ హౌస్‌లో ఏర్పాటుచేసిన హజ్ యాత్రికుల వాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ..అత్యాచార ఘటన బాధాకరమని పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా వొదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఇటు పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పారు. తెలంగాణ పోలీసులపై ఏ ప్రజాప్రతినిధి ఒత్తిడి లేదన్నారు. ఇదిలావుంటే ఈ ఘటనలో.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘనటపై సిబిఐ విచారణకు కాంగ్రెస్, బిజెపిలుఎ డిమాండ్ చేశాయి. ఘటనను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ డిజిపి కార్యలయ ముట్టడికి ప్రయత్నించింది. అసలు వివరాల్లోకి వెళితే..మే 28న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వొచ్చిన 17 ఏళ్ల బాలికతో పరిచయం చేసుకుని ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో శుక్రవారం ఒకరిని అదుపులోకి తీసుకోగా.. శనివారం ఉదయం మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి. పబ్‌లో పరిచయమైన ఒక బాలికపై ముగ్గురు బాలురు, ఇద్దరు యువకులు కారులో సామూహిక అత్యాచారం చేశారు.
వీరిలో ఒక ప్రభుత్వ సంస్థకు కొత్తగా ఛైర్మన్‌గా ఎన్నికైన నాయకుడి కుమారుడు, అతడి స్నేహితులు ఉన్నారు. వీరిలో సాదుద్దీన్ మాలిక్ అనే యువకుడిని శుక్రవారం రోజున పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని కర్ణాటకలో అరెస్టు చేసినట్లు తెలిపారు. కర్ణాటకలో తల దాచుకున్న ఉమర్‌ఖాన్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మైనర్‌లను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఆరు రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకోగా..భయంతో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆమె శరీరంపై గాయాలు చూసి..తండ్రి ఫిర్యాదు చేయగా, జూబ్లీహిల్స్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక షాక్ నుంచి తేరుకున్నాక..భరోసా కేంద్రంలో మహిళా పోలీసులు బుధవారం రాత్రి ఆమెతో అనునయంగా మాట్లాడడంతో వాస్తవం బయటికొచ్చింది. తనపై కొందరు సామూహిక అత్యాచారం చేశారంటూ ఆమె విలపించింది. దీంతో పోలీసులు అత్యాచారం సెక్షన్లు జోడించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రజాప్రతినిధుల సంతానమైనందునే పోలీసులు చర్యలు తీసుకోవడంలేదంటూ కాంగ్రెస్, భాజపా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసు ఠాణా వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నా చేశారు. హోమ్ మంత్రి మహమూద్ అలీ మనవడు పుర్ఖాన్ కూడా నిందితుల్లో ఉన్నారంటూ ప్రచారమవగా, తనకు సంబంధం లేదంటూ పుర్ఖాన్ ఖండించారు.
సిబిఐ విచారణ జరిపించండి..సిఎం కెసిఆర్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ
ఈఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బాలికపై అత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. నిందితులను రక్షించడానికి పోలీస్‌శాఖ కేసును పక్కదోవ పట్టిస్తుందని ఆరోపించారు. బాలికపై అఘాయిత్యం కేసులో ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా.. నిందితులకు అండగా లేమనే అపవాదును తొలగించుకోవాలని సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పలుకుబడిన వారి కుటుంబసభ్యుల ప్రమేయం ఉన్న ఘటనలో పోలీసులు నిష్పాక్షికంగా ఎలా దర్యాప్తు చేయగలరని ప్రశ్నించారు. బాలికపై అత్యాచారం కేసులో సీబీఐతో విచారణ జరిపించకపోతే న్యాయపోరాటం చేసి బాధితులకు అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలోని పబ్బులను మూసివేయాలని కోరారు. శాంతిభద్రతల సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు.
కేసును సీబీఐకి అప్పగించాలి : కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు డిమాండ్
నగరంలో సంచలనం సృష్టించిన బాలిక రేప్ కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇక్కడి వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ప్రభుత్వ నిర్లిప్తత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మర్డర్, రేప్‌లు జరుగుతున్నా దోషులను పట్టుకోవడం లేదని, వారు బయట దర్జాగా తిరుగుతున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్‌ను నిరసిస్తూ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు యత్నించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా…పోలీసులు అడ్డుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోత రోహిత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మోత రోహిత్ మాట్లాడుతూ… వి•డియాలో వొచ్చే వరకు పోలీసులు స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు. నాలుగు రోజుల తర్వాత మంత్రి కేటీఆర్ నిందితులను శిక్షించాలని హోమ్ మంత్రిని ఆదేశించడం విడ్డూరమని తెలిపారు. నిందితులను గుర్తించి శిక్షించడంలో విఫలమైన పోలీసు యంత్రాంగం అందుకు బాధ్యత వహిస్తూ కేటీఆర్, హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ స్పందించి అసలైన దోషులను అదుపులోకి తీసుకొని శిక్షించాలన్నారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మోత రోహిత్ స్పష్టం చేశారు.




