నామినేషన్‌ల గడువు రెండు రోజులే..

అన్ని పార్టీల్లో ఇంకా పూర్తిగాని సీట్ల కేటాయింపు
కేటాయించిన సీట్లపై కూడా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు
ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ఆశావహుల్లోనూ అయోమయం

మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్ధుల నుండి నామినేషన్‌ల స్వీకరణకు కేవలం రెండు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. అయినా రాజకీయ పార్టీల సీట్ల కేటాయింపు తతంగం ఇంకా పూర్తి కాకపోవడంతో ఆయా స్థానాల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత నెల తొమ్మిదిన ఎన్నికల కమీషన్‌ తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం అభ్యర్ధుల నామినేషన్‌ స్వీకరణ ఈ నెల 3న మెదలైంది. కాగా నామినేషన్‌లకు చివరి గడువు ఈ నెల పదవ తేదీ కాగా, పోటీ పడుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, కేటాయించిన అభ్యర్ధుల విషయంలో కూడా పార్టీ వర్గాల నుండి వ్యతిరేకత ఎదురవుతుండడంతో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. దీంతో ఎవరు పోటీలో ఉంటారో, ఎవరిని పోటీ నుండి ఆయా పార్టీల అధిష్టాన వర్గాలు విరమింపజేస్తాయన్న ఆందోళనలో అభ్యర్ధులున్నారు. అందరికన్నా ముందు తమ అభ్యర్ధులను ప్రకటించడంలో అధికార బిఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. ఆ పార్టీ ఆగస్టు 21ననే 115 మంది అభ్యర్ధులను ప్రకటించింది. ఇందులో ఒకటి రెండు స్థానాల మార్పిడి జరిగినా అభ్యర్ధులు ప్రచారానికి కావాల్సినంత సమయం లభించినట్లు అయింది. ఆ తర్వాత నర్సాపూర్‌, జనగామ ప్రకటించింది. అయితే నాంపెల్లి, గోషామహెల్‌ శాసనసభ స్థానాలకు ఇంకా అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. అభ్యర్ధులను ముందుగా ప్రకటించడంతో అభ్యర్ధులతో పాటు ఆ పార్టీ అధినేత కెసిఆర్‌తోపాటు కెటిఆర్‌, హరీష్‌రావులు వివిధ నియోజకవర్గాల్లో తమ ప్రచార కార్యక్రమాన్ని ఉదృతంగా సాగిస్తున్నారు. కాంగ్రెస్‌ కూడా మూడవ విడుతగా ప్రకటించిన పదహారు మందిని కలుపుకుని ఇంతవరకు 115 స్థానాలకు తమ అభ్యర్ధులను ప్రకటించింది. అయితే అభ్యర్ధుల విషయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకిస్తుండడంతో ఈ పార్టీ కూడా రెండు మూడు స్థానాల్లో అభ్యర్ధులను మార్చాల్సి వొస్తుంది. ఆవిధంగా బోద్‌, వనపర్తి అభ్యర్థులను మార్చింది. కాగా, తమకే టికట్‌ లభిస్తుందని ఇంతకాలం ఆశగా ఎదిరి చూస్తున్న కొందరు తమ పేర్లు లేకపోవడంతో పార్టీ అధిష్టానవర్గంపైన, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిలో కొందరు అప్పుడే పార్టీకి రాజీనామా చేయగా, మరికొందరు తమ కార్యకర్తలతో రేవంత్‌ ఇంటిముందు, కాంగ్రెస్‌ భవన్‌ ముందు పెద్ద ఎత్తున ఆందోళకు సిద్దమైనారు. అయితే పోలీసులు వారిని నివారించి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడు చిన్నారెడ్డికి కూడా పార్టీ టికట్‌ కేటాయించకపోవడంతో ఆయన తీవ్ర అసహనానికి గురైనారు. తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అలక వహించారు. ఆయన కూడా పార్టీ మారవచ్చన్న వదంతులు వొస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ కూడా ఇంకా పదమూడు స్థానాలను ప్రకటించాల్సి ఉంది. సిపిఐతో ఒప్పందం కుదరటంతో ఆ పార్టీకి కొత్తగూడ స్థానాన్ని కేటాయించింది. ఇంకా తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్‌ మొదలగు నాలుగు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. రోజుల తరబడి తమ పొత్తు విషయంలో ఎటూ తేల్చకపోవడంతో సిపిఎం అలిగి, స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు దాదాపు పదిహేడు స్థానాలకు తమ అభ్యర్ధులను కూడా ప్రకటించింది. అయితే ఇంకా చర్చల అంశం కొనసాగుతూనే ఉందని, తమ అధిష్టానం, సిపిఎం పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చలు జరుపుతున్నదని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఒక వేళ ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగితే మిర్యాలగూడను ఆ పార్టీకి కేటాయించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరిగినప్పటికీ ఆ పార్టీ కేంద్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ లాంటి నేతలు ఒకటికి రెండు సార్లు ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్న భారతీయ జనతాపార్టీ ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్ధులను కేటాయించింది. ఇంకా 31వ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే అనూహ్యంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో ఎన్నికల ఒప్పందం చేసుకోవడంతో ఇప్పుడా పార్టీకి దాదాపు ఎనిమిది స్థానాలను కేటాయింపు ఒప్పందం కుదిరిందంటున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా తాము కోరుకున్న రెండు మూడు స్థానాల కేటాయింపు విషయంలో జనసేన పట్టుపడుతున్నది. ఆ రెండు పార్టీల మధ్య ఇంకా తర్జనభర్జలు జరుగుతున్నాయి. ఈ పార్టీలో కూడా సీనియర్లు చాలా మంది అలిగిన విషయం తెలిసిందే. వీరిలో కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంటస్వామి లాంటివారు కాంగ్రెస్‌లోకి మారగా, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్ది లాంటి ఒకరిద్దరు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఫలితంగా సీట్ల కేటాయింపులో జాప్యం అనివార్యం ఏర్పడిరది. నామినేషన్‌లు దాఖలు చేసేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగలడంతో టికెట్ల కోసం ఆశిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. టికెట్‌ సాధించుకున్నా ప్రచారానికి కూడా పెద్ద వ్యవధిలేదు. మధ్యలో 20 రోజులు మాత్రమే మిగలడం వారిని మరింత అయోమయానికి గురిచేస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *