‘‘బతికెటందుకు దినాం సావుకెదురు బొయి అడుగడుగున పోరు జెండెత్తిన త్యాగాలశెరిత మనది.గసొంటి మట్టిల పుట్టినోళ్ళు యేండ్లకేండ్లు బందూకు బట్టని దినవంటున్నదా! జనం దండు గట్టని పల్లెలున్నయా!? గీ మట్టిల మొలిషిన శెట్లకన్న మర్లవడ్డ తుపాకులే ఎక్కువుంటయి. కన్నపేమను కడుపుల దాసుకొని ఇంటికో కన్నపేగును పోరుదారిన తోలిన అవ్వలెందరో గువ్వలోలిగె రాలి పోయిన కన్నబిడ్డ కోసం కంట నీరింకెదాంక గుండె పగిలే తీరేడ్శిన తల్లులెందరో ’’
తోవ దప్పని ‘‘తోక పతంగులు’’
తప్పిదాలు మాగ మోపైతయి.చారిత్రక తప్పిదాలు సుత మళ్ళ మళ్ళ మోపైతయా!? అవ్! తాతలు నేతులు తాగిండ్లు గావచ్చుగని మీ మూతులు వాసన జూడమంటె యెట్టైతదుల్లా! ఎత్తుగడలు ఎసొంటియైనా,ఓట్ల పండుగ రాంగనె సాలు దప్ప కుంట తోక పతంగులై ఎగుర బట్టె! పల్లె పల్లెన జనం నెత్తుటి త్యాగం జేశి నిల్పుకున్న ఎర్ర జెండాను సాగర్ నీళ్ళల్ల ముంచినంక యింకా ఇజ్జతేమన్న మిగిలి గిట్ల వుంటెనా! పుసుక్కున, వున్నదనిగిట్ల అనుకుంటె గనుక మునుగోడుల ముంచితె ఒక్కచిత్తమనుకున్నారా యేంది!ఇసొంటి ముచ్చటిన్నంక లాలూచీ ఎండపొడకు ఎర్రజెండ ఎలిశిపోయిందనే మాట నిజమే ననుకోవాల్నా! ఓట్ల పండుగలచ్చిప్పుడల్లా సాలు మరువక తోకపతంగులై ఎగిరేటి ఎర్రన్నలిద్దరికి ముందుగాల లాల్ లాల్ లాల్సలాములు. ఏ ఎర్రజెండా తోవల గుడ్డగోషి బక్క రైతన్నలు తుపాకులు బట్టుకోని గుట్టలెక్కి వేల పల్లెల్ని ఇముక్తి జేశిన్లో,ఏ ఎర్ర జెండా తోవల గోదారి లోయపొంటి నెత్తురొడిశిన తెలంగాణ రైతాంగ సాయుధపోరు జోరై పారిందో!ఏ ఎర్ర జెండాతోవల పల్లెపల్లెనా నిజామోడి రివాజుల బూజు బట్టిచ్చి రాజ్జెమేలిండ్లో ఆ జెనం జెండా!దొరల దోతుల తడిపిచ్చిన జెండాలే ఆ దొరీర్కం కాళ్ళ కాడ బాంచెనంటె బక్కజీవుల కండ్లు శింతనిప్పులైతయి.మీ యెన్కపొంటి దండుగట్టిన బడుగు జనమే మీ మీద మర్లబడే దినం మోపైటట్టే కానత్తాంది.
గుట్టల సందులల్ల తుపాకులు,అడివిల పూశిన తుపాకులు, అక్కలు బట్టిన తుపాకులు బతుకు తోవలు జూపినై. దినదినగం డమాసొంటి శీకటి బతుకులకు వెలుగుదివ్వెలు బట్టినయి. ఆ యెలుగుల ఇల్లిడిశి,ఊరిడిశి సంఘం తొవ్వ బట్టిన పల్లెలన్నీ మళ్ళోపాలి బాంచబతుకులు బతుకనంటానయి. చెట్టుపుట్టలల్ల దేవులాడినా,భైరాన్ పల్లె బోయి గల్మగల్మనడిగినా, కడివెండికాడి ఎగురాడే ఏ జెండ నడిగినా,సుట్టు పక్కల యేగుట్ట మీది రాళ్ళ కనీలడిగినా నెత్తురొడ్డిన నేలపొత్తిళ్ళ జాడసూపుతై.గుండెల్ల పాయిరంగ దాసుకున్న వీరులత్యాగాల నెత్తుటి నిశానీలు తీశి జూపేటి మట్టిపొత్తిళ్ళ జాడలేమయినై. నిజామోని రక్కసి దండు రజాకర్ల ఉరికిచ్చి ఉరికిచ్చి గజ్జున వణికిచ్చినోళ్ళం, మర్లబడి నిలవడుడే గని కాలుజేతులు బిసీకేటి బతుకలద్దంటిమి. జమిందారీ దేశ్ ముక్ ల నెత్తుటేర్ల రాజ్జెంతోని ఏగలేక గుట్టలెక్కితిమి,గుండ్లు పేలిత్తిమి. యేందక్కువ! ఎన్కకు జూత్తె తెలంగాణ శెరిత్రంత నెత్తురు బారిచ్చిన పోరు శెరిత్రే!దోపిడి దొరగాండ్ల గఢీలు గూల గొట్టి దొరీర్కమిగ రద్దని ఎగురేఏశిన ఎర్రజెండ పాటలేమైనయి!? బతికెటందుకు దినాం సావుకెదురు బొయి అడుగడుగున పోరుజెండెత్తిన త్యాగాలశెరిత మనది.
గసొంటి మట్టిలపుట్టినోళ్ళు యేండ్లకేండ్లు బందూకు బట్టని దినవంటున్నదా! జనం దండు గట్టని పల్లెలున్నయా!? గీ మట్టిల మొలిషిన శెట్లకన్న మర్లవడ్డ తుపాకులే ఎక్కువుంటయి. కన్నపేమను కడుపుల దాసుకొని ఇంటికో కన్నపేగును పోరుదారిన తోలిన అవ్వలెందరో గువ్వలోలిగె రాలి పోయిన కన్నబిడ్డ కోసం కంట నీరింకెదాంక గుండె పగిలే తీరేడ్శిన తల్లులెందరో !ఛల్! ఇగ ఎగబడ్తామురో! ఎములడ రాజన్న.! అనుకుంటగుడ్లల్ల నీరొత్తుకొని,కొంగు నడుం జుట్టుకొని ముందు నడ్వని అవ్వలున్నరా! ఏ కాలంల,ఎసోంటి మిలిట్రి, పోలీసులదండు దిగినా ఎదిరిచ్చి నిలిషి,గెలిశిన తెలం గాణ పల్లెంటె నిప్పు కనికెలిసిరేటి ఆరని మంటల దివిటీ! ఆసొంటి తెలంగాణ గుండెల్ల ఎగిరే ఎర్ర జెండా ఏ తొవ్వ తొక్కబట్టె! ఎకురాలల్ల బూమి యెట్లచ్చె ననుకుంట దొరల బూములల్ల జెండాల నాట్లేశి.ఎండుడొక్కలన్ని యెదురు తిర్గిన తెలంగాణ మూలమూలనా సెమట సుక్కల సాగు ఇరువాలు దున్నింది.ఇసిరిసిరి గొట్టేటి గాలికి కొరసు పాడుకుంట,యెర్ర జొన్న కంకులు తలలుపుకుంటా పల్లెపల్లెన గజ్జెగట్టినయి.బూమి నుంచి రైతును యేరు జేయాలని జూషిన యే జులుమైన బతికి బట్ట గట్టిందా!? తెలంగాణ గడ్డ మీద అన్నాయాల సవాలు జేశి నిలిశేగొంతులెందుకు కానత్తలేవో సమజయితలేదు.
ఆట,మాట, పాట లేయి లేకుంటబోయినయి. ఎట్లాసోంటి ఎర్రటెండల కొండలు,గుట్టలు,ఆగులంకలు తిరిగి తిప్పలు బడ్డోళ్ళం! జలగల కాలంల నిఘాలు రాజ్జెమేలినప్పుడు, అనుమా నాలే తుపాకి తూటలై వూరూర పాణాలు దీశినప్పుడు సుత ఎన్కకు బోని ధైర్నం గిప్పుడెటమట మెట్లాయె!? బరివాత బతుక మ్మాడిచ్చిన బలిషిన దొరోళ్ళను,పండిన పంట దోసుకోనచ్చిన బద్మాషి దొరోళ్ళను పట్నం తొవ్వబట్టిచ్చిన గుత్ప సప్పుళ్ళపోరు నేలకేమైంది! ఎన్కటి పౌరుషాలెటు బాయె! మన ఆటయి,మన పాటయి మన జెండానే ఎజెండాగా ఎగిరేశేటి ఇందిరా పార్క్, ధర్నా చౌక్ లాఠీ దెబ్బలకు,రాజ్జెం జూపిన జులుంకు గవాయి గాకుంట వోతదా! గన్ ఫౌండ్రీ అమర వీరుల స్తూపం కాడ రోడ్లను గీ తీర్గబడ్డ శెరిత్ర వారసత్వమే ఇచ్ఛంత్రంగ ఎన్కటి త్యాగాలను మర్శి,మూలకు కూలవడ్డది.వున్న రొండు కండ్లుమస్కబారి పగటి సూపు సుత సాపులేదు.కాల్జేతులు అంకర తింకరై ఎజెండాలు,జెండాలు తొవ్వదప్పితె తెలంగాణ పల్లెలూకుంటయా! తెలంగాణ పోరుబాటల త్యాగాలు జేశి,బుగ్గయి నోళ్ళ కుటుంబాలు తిండి తిప్పలై ఏడ్వబట్టినయి.ఆకలి సావుల పాలుగాబట్టినయ్. తెలంగాణ కొట్లాటకు అడ్డం బడ్డోళ్ళు,ఆంధ్రోళ్ళ మోశేతికింద నీళ్ళు తాగినోళ్ళే రాజ్జె మేలుతున్నరు.మనం నడిశే బాటపొంటి గులాబీ ముండ్లారబోశిన దొరల సంక జేరుడెట్ల జూడాలె!? జలగల కాలంల నిఘాలు రాజ్జెమేలినప్పుడు,బరివాత బతుకమ్మాడిచ్చిన బలిషిన దొరోళ్ళను పండిన పంట దోసుకోనచ్చిన బద్మాషి దొరోళ్ళను పట్నం తొవ్వబట్టిచ్చిన గుత్ప సప్పుళ్ళపోరు నేలకేమైంది!? ఆసొంటి కండ్లెర్ర జేశిన ఎర్రజెండా ఎన్కటి పౌరుషాలెటువొయినయి !?
రొండు పూల రొంపి రోతబుట్టే కంపే అయినంక ఏ పూవు పంచజేరినా ఎర్రజెండా ఇజ్జత్ బజాట్నేసుడే నన్న సోయి కరువాయె! పంతా పడమరాయె! పనులు తూరుపొయె! నమ్ముకున్న ప్రజాసంగాలాగమాయె! ఎత్తుగడల పేరం జెప్పి ఏలికల సంక జేరి ముల్లెలు గడ్తనంటె ఎర్రమల్లెలెట్లయితరు! ఎర్ర జెండా శెరిత్ర ఒయ్యిల నాలుగైదు కమ్మలు కాదుల్లా! లచ్చలాది గుడ్డగోచిల నెత్తుటి త్యాగాలన్నయన్న సోయిమరువకుంటుండాలె! అసొంటి త్యాగాల ఎలుగున కొత్త తొవ్వలు జూపిన ఎర్ర జెండాలు బతుకుతోవల బాంఛననుకుంట దొరల గల్మ కాడ బుచ్చానికి జోలె వట్టే కాడికి ఎట్లచ్చినయి!? దోతులూడంగ దొరసానితోని కచ్చీర్లెక్కి బలుసాకైన సాలని పట్నాలుర్కిబోయిన దొరలెట్ల ఎన్కకచ్చిరి? కల్వకు దెచ్చిన ఇసిరెలు దొరల బొండికాయల మీద బెట్టిన నాటి ఎర్రవారిన జూపులిప్పుడు బాంచ బతుకు లెట్లయితయి!? సర్కార్ జేశే దిక్కుమెల్ల పనులమీద జెండెత్తి జనంల కూడగట్టే ఉద్దెమాలు ఉట్టెక్కిచ్చిండ్లు.ఓట్ల పండుగచ్చె నంటె ఊసరెల్లుల తీర్గ రంగు మారే రాజకీయాలు ఎవలి సాలనాలె! సుత్తి కొడ్వలి జెండెత్తి మిలిటెంట్ కొట్లాటలు ఎవలి మీద జేత్తనంటాండ్లో గని,ఎర్రన్నల తీరుమటుకు గురిగింజ శాత్రమోలి గున్నది. పొద్దటీలి కలవడ్తనంటరు, మాపటీలికి కావిలిచ్చుకుంటరు.గీ తాకట్లు బడే లాలూశీల బతుకు ఎర్రజెండా తీరెట్లయితది! ఎన్నికల ఎత్తుగడెట్లయితది! నెత్తుటి త్యాగాలతో తడిశిన ఎర్రజెండాను దొరల కాళ్ళకాడికి జేర్చి చారిత్రక తప్పిదాల తోవబట్టిండ్లు. ఓట్ల పండుగచ్చెనంటె తోక పతంగులయే సాలు మరువకుంట సాగుతుండ్రు.
– ఎలమంద




