టిడిపి సానుభూతిపరులు ఎటువైపు..?

గెలుపోటములను పలుచోట్ల ప్రభావితం చేసే సత్తా

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయంతో బిఆర్‌ఎస్‌ ‌లాంటి పార్టీల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది. టిడిపి పోటీ చేయకపోవడం తమరు లబ్ది చేకూర్చే అంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఆ పార్టీ అభిమానుల వోట్లు గంపగుత్తగా తమకే పడతాయన్న ధీమాలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోతే.. ఆ పార్టీ సానుభూతిపురులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న చర్చ కొంత కాలంగా ఉంది. చంద్రబాబు అరెస్ట్ ‌తర్వాత గ్రేటర్‌ ‌హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే వీటిపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ సానుభూతిపరులు అసంతృప్తికి గురయ్యారు. సోషల్‌ ‌డియాలో బీఆర్‌ఎస్‌కు వోటు వేయకూడదన్న ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు అరెస్ట్ ‌పరిణామాల వెనకు బీజేపీ కూడా ఉందని నమ్ముతున్నారు కాబట్టి టీడీపీ సానుభూతిపరులు బీజేపీ కూడా వోటు వేయరని కొంత మంది విశ్లేషిస్తన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి టీడీపీకి మద్దతుగా ఉండే సానుభూతిపురులు బీఆర్‌ఎస్‌ ‌కు మద్దతుగా నిలుస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకుంది సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే. టీడీపీ కూడా ఆయా ప్రాంతాల్లో బలంగా ఉందని ఇప్పటివరకు అనుకుంటున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలు ఏపీలో సీఎం జగన్‌కు బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉండటం వంటి అంశాలను చూస్తే… బీఆర్‌ఎస్‌కు ఈ సారి టీడీపీ సానుభూతిపరులు వోట్లు వేయరని చెబుతున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుండి తెలంగాణలో టీడీపీ కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయి. మధ్యలో బాలకృష్ణ నేనున్నానంటూ సమావేశం పెట్టారు.

కానీ తెర వెనుక ఏం జరిగిందో కానీ.. ఆయన పూర్తిగా పట్టించుకోలేదు. ఆఖరికి• పోటీ చేయడం లేదని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పోటీ చేయకపోతే ఎవరికి లాభం కలుగుతుందన్న చర్చ ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ ‌కు పెద్ద భారం దిగిపోయినట్లవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు మేలు జరుగుతుందని, టిడిపి వాదులంతా కాంగ్రెస్‌లో చేరడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పకుంటున్నారు. అసలు ఇదంతా బీజేపీకి లాభం కలుగుతుందని అనుకునే వారూ ఉన్నారు. తెలంగాణలో టీడీపీ బలమైన శక్తి కాకున్నా ప్రభావితం చేసేంత శక్తిని కలిగి ఉంది. తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఓ ఫోర్స్ ‌కాదు. చంద్రబాబునాయుడు ఖమ్మంలో సభ పెట్టే వరకూ ఆ పార్టీకి క్యాడర్‌ ఉం‌దని కూడా ఎవరూ అనుకోలేదు. ఖమ్మం .. ఆ తర్వాత సికింద్రాబాద్‌లో సభలు పెట్టి మళ్లీ పార్టీని యాక్టివ్‌ ‌చేశారు. కాసాని జ్ఞానేశ్వర్‌ ‌ను అధ్యక్షుడిని చేసిన తర్వాత కొన్ని చేరికలూ జరిగాయి. పార్టీ బలోపేతం అవుతోందని..ఏదో ఓ పార్టీతో పొత్తు లేకపోతే.. బలమైన ఓ ఇరవై స్థానాల్లో పోటీ చేయాలని ప్లాన్లు రెడీ చేసుకున్నారు. కానీ మొత్తం తిరగబడిపోయింది. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఓ సారి కాసాని జ్ఞానేశ్వర్‌ ‌ములాఖత్‌ అయినప్పుడు ఏ విషయం చెప్పలేదు. ఆ సమావేశం తర్వాత కాసాని 75 మంది అభ్యర్థుల జాబితాను రెడీ చేసుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం పోటీ వద్దని తేల్చేశారు.

దాంతో ఆయన టీ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ క్యాడర్‌, ‌నేతలకు సమాధానం చెప్పుకోలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణలో టిడిపిక బలం లేదని ప్రచారం జరిగింది. కాసాని రాజీనామా నిర్ణయం కూడా పార్టీని కొంత కలవరపాటుకు గురి చేసింది. అలాగే కొందరు నేతలు కూడా పార్టీని వీడారు. రావుల చంద్రశేఖర్‌ ‌రెడ్డి లాంటి వారు పార్టీని వీడి బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కారణాలతోనే టిడిపి ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించి ఉంటుంది. ఇకపోతే చంద్రబాబు అరెస్ట్ అయిన నెల రోజులకు.. నారా లోకేష్‌.. అమిత్‌ ‌షాను కలిశారు. ఆ సమయంలో అమిత్‌ ‌తెలుగు రాష్టాల్ర బీజేపీ అధ్యక్షులు ఉన్నారు. తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి కూడా ఉన్నారు.

ఆ చర్చల్లో తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ పాత్రపై చర్చకు వొచ్చిందో లేదో తెలియదు. కానీ తర్వాత జనసేనతో పొత్తు కోసం.. పవన్‌ ‌కల్యాణ్‌తో కిషన్‌ ‌రెడ్డి చర్చలు జరిపారు. ప్రస్తుతం ఆ పొత్తులు కూడా తుదిదశకు చేరలేదు. జనసేనతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టమయింది. కానీ టీడీపీని కలుపుకునే అంశంపై చర్చలు జరగలేదు. తెలుగుదేశం పార్టీ అంటూ పోటీ చేస్తే.. ఒకటి, రెండు స్థానాలు అయినా దక్కించుకుంటుందో లేదో చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ పార్టీ చాలా వరకూ నిర్వీర్యం అయిపోయింది. బలమైన అభ్యర్థి దొరికితే.. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌, ‌ఖమ్మం వంటి చోట్ల..ఒకటి , రెండు చోట్ల గెలుపొందే అవకాశం ఉండేది. కానీ కనీసం నలభై నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని తారుమారు చేసే రీతిలో వోట్లు పొందుతుందన్న అభిప్రాయం మాత్రం బలంగా ఉంది. ఇప్పుడు ఈ వోట్లన్నీ ఎవరికి దక్కుతాయన్నది అంచనా వేయడం కష్టమే అయినా టిడిపి సానుభూతిపరులు తలచుకుంటే గెలుపోటములను తారుమారు చేయగలరని కూడా భావించాలి. కాబట్టే ఇప్పుడు టిడిపి సానుభూతిపరుల వోట్లు ఎటువైపు అన్న చర్చ సాగుతోంది.
– ప్రజాతంత్ర నెట్‌వర్క్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *