డిజిటల్ యుగపు మానవుడి జీవనశైలిలో పను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతికూల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ కరువు కావడం, కూర్చొని గంటల తరబడి పని చేయడం, అర్థ రాత్రి వరకు మెలకువగా ఉండడం, స్మార్ట్‌ఫోన్ దుర్వసనాలకు లోనుకావడం లాంటివని సర్వసాధారణం అయ్యాయి. వీటికి తోడుగా శీతలపానీయాలు/మద్యం విచ్చలవిడిగా సేవించడం, పొగ తాగడం, జంక్/ప్యాకేజ్ ఫుడ్స్‌ను లొట్టలేసుకుంటూ తినడం లాంటి అలవాట్లు నేటి ఆధునిక యువత జీవనశైలిలో భాగాలు అవుతున్నాయి. బ్రెడ్స్, ఫ్రోజెన్ మీల్స్, బేక్డ్ పదార్థాలు, చీజ్, చిప్స్, చాకోలెట్స్, క్యాండీ,ఐస్ క్రీమ్స్, నూడుల్స్, సూప్స్, మీట్, సూసులు, నగెట్స్, ఫింగర్స్, సోడా ఉత్పత్తులు, శీతలపానీయాలు, ఫ్రోజెన్ ఫుడ్స్ లాంటివి ప్రాసెస్టీడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ జాబితాలోకి వస్తాయి. ఇటీవలి అధ్యయనాల ప్రకారం 30 బ్రెవరేజ్ ఫుడ్స్ తయారు చేస్తున్న 1,306 ప్యాకేజ్ ఫుడ్స్‌లో 95 శాతం వరకు ఆరోగ్యాన్ని హరించే ఆహార పదార్థాలే ఉన్నట్లు తేలింది. ఇలాంటి ఆహార పదార్థాల్లో డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన మోతాదుకు మించి హానికారక పదార్థాలు ఉన్నట్లు తేలడం ప్రమాద హెచ్చరికగా తీసుకోవాలి. ఇలాంటి ఉత్పత్తుల్లో 62 శాతం వరకు మూడు లేదా అంత కన్న ఎక్కువ న్యూట్రిషన్ కాంపొనెంట్స్ మోతాదులు అధికంగా ఉన్నాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వెల్లువ: ప్రస్తుతం మార్కెట్‌ను ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్స్ ముంచెత్తుతున్నాయి. నేటి యువత ఇలాంటి హానికారక ఫుడ్ ప్యాకెట్స్‌ను మితిమీరి తినడం సర్వసాధారణం అయ్యింది. ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్స్‌లో మోతాదుకు మించి ఉప్పు, షుగర్, లేదా కొవ్వులు ఉంటున్నాయనే వాస్తవాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి ప్యాకేజ్ ఫుడ్స్‌పై మోతాదుకు మించి ఉన్న పోషకాల వివరాలను హెచ్చరికలుగా ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలని పిల్లల వైద్యులు, పోషకాహార నిపుణులు, ప్రజారోగ్య సంస్థలు, వినియోగదారుల సంఘాలు లాంటి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ‘‘న్యూట్రిషన్ అడ్వకసీ ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్, ఎన్ఏపిఐ’’ వివరాల ప్రకారం డిజిటల్/ప్రింట్ మాద్యమాల్లో ప్యాకేజ్ ఫుడ్స్‌ను ప్రోత్సహించే ప్రకటనల్లో అమితాబ్ లాంటి సెలబ్రీటీలను వాడుకోవడం కూడా తప్పుదారి పట్టించే విధంగా ఉంటున్నాయని కూడా పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాలప్రకారం ప్రతి నెల 10 ప్రముఖ టీవీ చానెల్స్‌లో 2 లక్షలకు పైగా ప్యాకేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన ఆకర్షణీయ ప్రకటనలు వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తున్నది. ఇలాంటి ప్రకటనలపై ప్రభుత్వ ప్రమేయం లేకపోవడం విచారకరం. జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్లపై ‘‘మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్’’ అనబడే పూర్తి సమాచారం ఉండాలంటూనే మోతాదుకు మించి ఉప్పు, చక్కెరలు, సంతృప్త కొవ్వులు, ప్రమాదకర కృత్రిమ రసాయనాలు ఉన్నట్లు ముఖ్య సమాచారం ముద్రించాలని ఏన్ఏపిఐతో పాటు పౌర సమాజం కూడా కోరుకుంటున్నది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ దుష్ప్రభావాలు: అల్ట్రా ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌లో మోతాదుకు మించి చక్కెరలు, ఉప్పు, సంతృప్త కొవ్వులు ఉంటున్నాయని – ఇలాంటి ఆహార పదార్థాలను అతిగా తీసుకున్నపుడు స్థూలకాయం, మధుమేహం లాంటి జీవనశైలి రుగ్మతలు కలుగుతున్నాయని తేల్చారు. నేటి భారతంలో అధ్యయనం చేసిన 6 శాతం మంది 5 ఏండ్ల లోపు బాలల్లో 43 లక్షల మంది అధిక బరువు లేదా స్థూలకాయ బారిన పడ్డారని తేల్చారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తరుచుగా అధిక మోతాదులో తీసుకునే అలవాటు ఉన్న వారిలో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని తేలింది. ప్రాసెస్డ్ ఫుడ్ 10 శాతం వరకు వినియోగం పెరిగితే వారిలో 12 శాతం క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అధిక ఉప్పు, కొవ్వులు తీసుకున్నపుడు మధుమేహం, అధిక బిపీ, స్థూలకాయం, గుండెజబ్బులు, ఆకలి మందగించడం, జీర్ణ వ్యవస్థ రుగ్మతలు, ఎముకల బలహీనతలు, నీరసం, చర్మ సమస్యలు, దంతాల్లో రంథ్రాలు, కాలేయ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, అధిక కొలెస్టొరాల్ లాంటి అనారోగ్యాలు పెరుగుట గమనిస్తున్నాం. ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో శరీర ఎదుగుదలకు అవసరమైన పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు తక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి ఆహార పదార్థాలు తొందరగా జీర్ణ కావడంతో ఆ కాలనీలను వినియోగించడానికి వీలు చిక్కక బరువు పెరగడం కనిపిస్తుంది. ప్రాసెస్డ్/జంక్ ఫుడ్స్‌లో దాదాపు 5,000 వరకు కలరింగ్, టెక్చరింగ్, ఫ్లేవరింగ్, సువాసనకు సంబంధించిన అడిటివ్స్, ప్రజర్వేటివ్స్ లాంటి కృత్రిమ రసాయనాలు కలుపుతున్నారనితెలుసు కోవాలి. ఇలాంటి రసాయనాల దుష్ప్రభావాలను ఇప్పటి వరకు ప్రభుత్వాలు శాస్త్రీయ అధ్యయనం చేయకపోవడం సోచనీయం.
అదే పనిగా చక్కెర బుక్కితే చక్కర రుగ్మత వస్తుందని, ఉప్పు ఎక్కువ తింటే రక్తపోటుకు దారులు బారుగా తెరుచుకుంటాయని, లొట్టలేసుకుంటూ కొవ్వులు ఆరగిస్తే ఒళ్లంతా కొవ్వెక్కుతుందని తెలుసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. దుకాణాల్లో వెలసిన ప్యాకెట్ ఫుడ్స్ నోటిని ఊరిస్తూ నిశ్శబ్దంగా మన ఆరోగ్యాలను హరిస్తున్నాయని తెలుసుకుందాం. అమ్మ వండిన వంట ఆరోగ్య సద్దన్నం మూట అని, బజారు ఆహారపు పొట్లాలు ఆరోగ్యానికి తూట్లు పొడిచే గరళ కత్తులని తెలుసుకుందాం. అమ్మ చేతి వంట సమస్త ఆరోగ్య సంరక్షణకు ఔషధాల మూట అని నమ్ముదాం.
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037





