ఎన్నో ఆశల సౌధాలు
మరెన్నో నోముల ఫలాలు
రెప్పపాటుకాలంలో
విలువైన జీవితాన్నిడిచి రాలిపోతున్నాయ్‌
‌గుండెల్లో తీరనివేధనను మిగిల్చి కనిపించని తీరం చేరువౌవుతుంటే
చల్లారని కడుపుమంట
నిత్యం రగులుతోంది

ఏంటి చదువులు
ఎటేపు దాని పయనం
మనిషికి మనుగడ లేకుండా చేయ్యడమా
ఒత్తిడిని మనసంతా నింపుకుని
జ్ఞానమెక్కడ జారిపోతోందోనని
నిండైన జీవితాన్ని ఒలకబోసుకుంటున్న భవిష్యత్తు సూర్యులు

మానసిక స్థైర్యం నింపని చదువులెందుకు
మనిషిగా తట్టుకుని నిలబడే బలమివ్వని విద్యాలయాలెందుకు
చదువొక్కటే జీవితం కాదని నేర్పని తల్లిదండ్రులు
భవిష్యత్తునెలా నిర్మిస్తారు
పుడమిపైనున్న మాటలురాని జీవులెన్నో మధ్యలో తనువు చాలించవు

ఒత్తిడి జయించి ఓర్పునద్దుకుంటే
ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించవచ్చు
ఒక్కపూటతో ఆగిపోయేది కాదు జీవితం
ఒడుదుడుకులనెన్నో
మరెన్నో సవాళ్ళను ఛేదించి సాదించేది జీవితం

జీవితం వడ్డించిన విస్తరికాదు
విషయం తెలియాలంటే
నీవు పడే కష్టమేమిటో తెలియాలి
చదువుకంటే జీవితం గొప్పది
గెలుపోటములు సహజం

పోలికలొద్దెవరితో
ఎవడికివాడే
మన ఇష్టాల్ని నెత్తినరుద్ది
కష్టంలోకి నెట్టొద్దు
అయిష్టత ఆత్మహత్యవైపే నడిపిస్తుంది
పెద్దలన్నట్టు
గెలుస్తే మంచిది లేకపోతే మరీమంచిదని నేర్పండి
ఆస్వాదిస్తూ సాగే గమనాన్ని గమనిస్తూ నేర్పండి

ఏదేమైనా
కుటుంబం చేయుతనందిస్తే
సున్నితమైన కౌమారం
నిబ్బరంగా ముందుకెళ్ళి
ఉన్నతశిఖరాలనదిరోహిస్తుంది

(పరీక్ష ఫెయిల్‌ అయిన విద్యార్థులను చూసి రాసింది)
– సి. శేఖర్‌(‌సియస్సార్‌),‌పాలమూరు,9010480557.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *