‘యంగ్ ఇండియా’ నా బ్రాండ్

విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు తొలి ప్రాధాన్యం
దేశంలోనే అత్యుత్తమంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
సైనిక్ స్కూల్ కు దీటుగా పోలీస్ స్కూల్ ని తీర్చిదిద్దాలి
సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు ఆర్థిక సహాయం అందించాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఘనంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10:  హైదరాబాద్ లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని, రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్ ను గుర్తుంచుకుంటారని, తాను క్రియేట్ చేసిన బ్రాండ్ “యంగ్ ఇండియా”  అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో స్టాఫ్ రూమ్స్, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. అనంతరం  ఫుట్ బాల్ గ్రౌండ్ ను సందర్శించి చిన్నారులతో సరదాగా కాసేపు ఫుట్ బాల్ డారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రతీ పోలీస్ సిబ్బందికి ఇది అత్యంత ముఖ్యమైనదని అన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని, ఆనాడు పండిట్ జవహర్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయని, నెహ్రూ దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందని అన్నారు. దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారు. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయి. ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పుకుంటున్నారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. హైదరాబాద్ లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్ ను గుర్తుంచుకుంటారు.

అలాగే నేను ఈ రోజు క్రియేట్ చేసిన నా బ్రాండ్ “యంగ్ ఇండియా” మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామని అన్నారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని, అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది తమ బ్రాండ్ అని పేర్కొన్నారు. నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని, ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్నామని గుర్తుచేశారు. ఈ రోజు యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉందని, దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం

వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుతోందని తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి… ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సైనిక్ స్కూల్ కు దీటుగా పోలీస్ స్కూల్ ను తీర్చి దిద్దాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పోలీస్ స్కూల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు పోలీస్ స్కూల్ కు ఆర్ధిక సాయం అందించాలని, పోలీస్ స్కూల్ కోసం రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలని,  ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ విధానం
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ విద్యా విధానంలో ప్రాథమిక స్థాయిల్లోనే అస్పష్టత ఉన్నదని గమనించి, ఆలోచన చేసి ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేసినట్టు వివరించారు.విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ప్రజా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతలని తెలిపారు. ప్రజలు మాకిచ్చిన అధికారం ప్రజలకు ఉపయోగపడాలి. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలి. యంగ్ ఇండియా మా బ్రాండ్. అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలుగా పనిచేస్తుందన్నారు.

ప్రభుత్వ బేసిక్ ఎడ్యుకేషన్‌లో విధానంలోనే చిన్న అస్పష్టత ఉన్నదని నిపుణులతో ఎడ్యుకేషన్ కమిషన్ వేశాం. నిపుణులతో చర్చించాం. ప్రభుత్వ బడుల్లో ప్రీస్కూల్ విధానం ప్రవేశపెట్టాలని ఆలోచన చేశాం. ప్రైవేటు స్కూళ్లల్లో ఎలాగైతే పిల్లలకు రవాణా సౌకర్యం ఉంటుందో అదే తరహాలో నిరుపేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా రవాణా సదుపాయాలు కల్పించి వారికి ఉత్తమమైన ప్లే స్కూల్ విద్యను అందించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో 29 వేల ప్రభుత్వ స్కూళ్లు ఉంటే, వాటిల్లో 18.50 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రైవేటులో 11,500 స్కూళ్లు ఉంటే వాటిల్లో 30 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ క్వాలిఫికేషన్స్ ఉన్న వారు పని చేస్తున్నప్పటికీ విద్యార్థులు చేరడం లేదంటే మన విధానంలోనే లోపం ఎక్కడుందో ఆలోచన చేశాం. 5 సంవత్సరాల వయసు ఉంటేనే ప్రభుత్వ స్కూళ్లకు పంపాలన్న నిబంధన ఉంది. అదే ప్రైవేటు స్కూళ్లల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అంటూ విధానం ఉండటంతో తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లల్లో చేర్పిస్తున్నారు. మూడేళ్లు ప్రైవేటు స్కూళ్లల్లో చదివించి ఒకటో తరగతికి ప్రభుత్వ స్కూళ్లకు ఎవరూ మార్చడం లేదని సీఎం రేవంత్ అన్నారు.

విధి నిర్వహణలో కాలం గడుపుతూ కుటుంబాలకు సమయం ఇవ్వలేక, పిల్లల చదువులపై సరైన దృష్టి సారించలేక వారు ఎలా చదువుకుంటున్నారో తెలియక ఆందోళన పడుతున్న పోలీసు సిబ్బందికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఒక మంచి అవకాశం. హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారి వరకు కాకీ డ్రెస్ వేసుకునే ప్రతి పోలీసుకు ఈ స్కూల్ అత్యంత ప్రాముఖ్యమైనదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో కూడా 58 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను చేపట్టాం.  ఆర్మీ స్కూల్, సైనిక్ స్కూల్, డిఫెన్స్ అకాడమీ అంటూ రకరకాల బ్రాండింగ్‌తో గొప్ప గొప్ప స్కూళ్లు ఉన్నట్టుగానే సమాజంలో నిత్యం సేవలు అందిస్తున్న పోలీసు కుటుంబాల పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పోలీసు స్కూల్ ను ప్రారంభించామని సీఎం తెలిపారు. కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, లోక్‌సభ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, యంగ్ ఇండియా పోలీస్ అకాడమీ, స్కూల్ ఇంచార్జ్ సీవీ ఆనంద్, గ్రేహౌండ్స్ అదనపు డీజీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page