– నాణ్యమైన విత్తనాలనే అందుబాటులో ఉంచాలి
– కో మార్కెటింగ్‌పై నిర్దిష్ట నియమాలు రూపొందించాలి
– హెచ్‌టీ పత్తి విత్తనాలు రాష్ట్రంలోకి రానివ్వద్దు
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలనే అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, విత్తన కంపెనీ ప్రతినిధులతో ఆయన సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. వానాకాలం (ఖరీఫ్) 2026 సాగు సన్నాహకంలో భాగంగా వచ్చే ఖరీఫ్‌కు సంబంధించి విత్తనాల లభ్యతను కంపెనీల వారీగా, పంటల వారీగా సమీక్షించారు. వానాకాలం 2026లో రాష్ట్రంలో సుమారు 134.66 లక్షల ఎకరాల్లో సాగు జరిగే అవకాశముండగా దానికి 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 38.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరానికి దాదాపు రెండింతల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. సుమారు 52 లక్షల ఎకరాల పత్తి సాగు లక్ష్యంతో రైతులకు అవసరమైన 104 లక్షల ప్యాకెట్లకు బదులుగా 212.11 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. గత ఏడాది వినియోగంతో పోలిస్తే ఈసారి అధిక నిల్వలు రైతులకు విశ్వాసాన్ని కలిగిస్తాయని మంత్రి పేర్కొన్నారు. హైబ్రిడ్ విత్తనాల లభ్యతపై ప్రత్యేకంగా చర్చిస్తూ రైతుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలను ప్రాధాన్యంగా సరఫరా చేయాలని సూచించారు. విత్తనాల నాణ్యతపై ఎలాంటి రాజీ పడకూడదని, సీడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. నాణ్యత లేని విత్తనాల తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గతంలో సబ్ స్టాండర్డ్ విత్తనాలపై కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రతి నెలాఖరులో కంపెనీలు తమ స్టాక్ వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని, సెల్ఫ్ సర్టిఫైడ్ విత్తనాల వల్ల నష్టం కలిగితే కంపెనీలే భరించాలని అన్నారు. వరి సన్న రకాల ఎంపికలో రైతులు, మిల్లర్లు, వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా ఎంపిక చేయాలని మంత్రి సూచించారు. కంపెనీలు తమ విత్తనాల స్టాక్‌ను మే 15 నుండి రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ప్రత్యేక టాస్క్‌ఫోర్సు బృందాలు ఏర్పాటు చేయాలి
నకిలీ విత్తనాల నిఘా గురించి మంత్రి మాట్లాడుతూ జిల్లా నుండి మండలస్థాయి వరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి అక్రమ నిల్వలు, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా లూజ్ కాటన్ విత్తనాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలన్నారు. విత్తనాల సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు లైసెన్సింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని మంత్రి పేర్కొన్నారు. జీవోటీ ఫెయిల్ అయిన పత్తి విత్తనాలను వినియోగానికి అనర్హంగా ప్రకటించి రైతులకు చేరకుండా నిరోధించాలని ఆదేశించారు. కో మార్కెటింగ్ విధానంలో ఏ కంపెనీ విత్తనాన్ని, ఏ కంపెనీ, ఏ పేరుతో అమ్ముతున్నదో తెలియని పరిస్థితి నెలకొన్నదని అన్నారు. విత్తన చట్టంలోని లోపాలను కంపెనీలు అవకాశంగా మార్చుకుని రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలను ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. అవసరమైతే కో మార్కెటింగ్ పూర్తిగా రద్దు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మట్టి సారాన్ని పెంపొందించే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వానాకాలం 2026లో 1.95 లక్షల క్వింటాళ్ల విత్తన పంపిణీకి రూ.134 కోట్లు వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. నాణ్యతపై రాజీ లేకుండా, నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విత్తన కంపెనీలతో సమన్వయం కొనసాగించాలని సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, నకిలీ విత్తనాల నిరోధానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. సమీక్షలో సీడ్ కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మంత్రితో డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధుల భేటీ
డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధులు మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు వాతావరణ పరిస్థితులపై సమయానుకూల సలహాలు అందించే దిశగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రతినిధులు మాట్లాడుతూ ఒడిశా, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలలో పైలట్ ప్రాజెక్టుగా తమ సంస్థ స్వతంత్రంగా పనిచేస్తోందని తెలిపారు. రైతులకు సాగుకు ముందుగానే వాతావరణ పరిస్థితులు, వర్షపాతం వివరాలను ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా చేరవేస్తున్నామన్నారు. ఈ సమాచారంతో రైతులు నాట్లు వేయాల్సిన సమయం, పంట కోతలు చేపట్టాల్సిన సమయం, మార్కెట్లో అమ్మకానికి అనుకూలమైన సమయాన్ని ముందుగానే నిర్ణయించుకోగలుగుతున్నారని వివరించారు. అలాగే అకాల వర్షాలు, తుఫానులు, గాలిదుమారాలు వంటి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాన్ని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వ సహకారం అందించాలని ప్రతినిధులు మంత్రిని కోరారు. దీనిపై సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




