వరల్డ్‌ క్లాస్‌ ఫిలిం సిటీ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం

– సినీ పరిశ్రమకు నాడు, నేడు మేలు చేసింది కాంగ్రెస్సే
– సినీ రంగ ప్రముఖుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: వరల్డ్‌ క్లాస్‌ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి తెలుగు క్లబ్‌లో సినీ రంగ ప్రముఖులు, సినీ రంగ కార్మిక నాయకుల సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు.. కానీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు ప్రత్యేక రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ఏదైనా మేలు జరిగింది అంటే అది కాంగ్రెస్‌ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే అని స్పష్టం చేశారు. వేలాదిమంది సినీ కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి, చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమను హైదరాబాద్‌ రప్పించి సినీ స్టూడియోలు నిర్మించేందుకు ప్రభుత్వమే భూములు ఇచ్చిందని వివరించారు. అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు తదితర సినీ స్టూడియోలు అన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. ఫిలిం క్లబ్‌కు స్థలం సైతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇచ్చినట్లు చెప్పారు. సినీ కార్మికుల కోసం సీనియర్‌ నటుడు ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో చిత్రపురి కాలనీ ఏర్పాటు కోసం దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిని అడిగి మరీ ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ఎలాంటి వినతి వచ్చినా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌ గొప్ప నగరం.. అన్ని భాషల వారిని అక్కున చేర్చుకుంటుంది.. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, చక్కటి వాతావరణం, తక్కువ ధరకే మానవ వనరుల లభ్యత హైదరాబాద్‌కే సొంతం అన్నారు. సినీ పరిశ్రమ బాగా ఎదగాలి.. ఎంత ఎదిగితే అంతమందికి ఉపాధి, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సినీ పరిశ్రమ ఈ రాష్ట్రంలో ఎదగాలంటే ఈ ప్రభుత్వం బలంగా ఉండాలి.. ఈ ప్రభుత్వం బలంగా ఉంటేనే సినీ పరిశ్రమ బాగా ఎదుగుతుందని తెలిపారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ‘మా’ అసోసియేషన్‌ కార్యాలయం నిర్మాణానికి స్థలం విషయంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌తో మాట్లాడి ఆ కల సహకారం అయ్యేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో మంచి సినిమాలు రావాలి… చిన్న సినిమాలు కూడా రావాలి అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page