దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లను ఆహ్వానించింది. అర్హత కలిగిన సంస్థలు డిసెంబర్ 27లోగా టెండర్లు దాఖలు చేయాలని ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. టెండర్లు దక్కించుకున్న సంస్థలు రెండేళ్లలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలిపింది. ఎన్నో ఏళ్లుగా విశాఖ రైల్వే జోన్ కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. ఇప్పుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణం కోసం టెండర్ల ఆహ్వానించడం వరకు పక్రియ వచ్చింది. టెండర్ల పక్రియ మొదలు కావడంతో ఇక రైల్వే జోన్ పనులు మొదల్కెనట్లేనా? రైల్వే జోన్ పనులు మొదలవ్వడమంటే పెద్ద పెద్ద కార్యాలయాలు కట్టి, ఆ తర్వాత పనులు ప్రారంభించడం కాదు. విశాఖలోని వాల్తేరు రైల్వే డివిజన్‌కు అనేక స్థలాలు, భవనాలు ఉన్నాయి. వాటిలో మొదలు పెట్టినా చాలు. ఏదీ ఏమైనా దక్షిణ కోస్తా రైల్వే పనులకు టెండర్లను పిలిచే వరకు ప్రస్తుతం అడుగు పడిరది కాబట్టి, అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యేటట్లు చూస్తే చాలు. కార్యాలయాల నిర్మాణానికి రెండేళ్ల గడువు విధించింది రైల్వేశాఖ. కానీ ఆ తర్వాత కూడా ’అనివార్య కారణాల వలన’ అంటూ పనులు నిలిపివేయడం, కాలపరిమితి పెంచడం లాంటివి చేయొచ్చు.
ఇలాంటివి జరక్కుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం విరీద ఉంది. అప్పుడే ప్రజలు విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నమ్ముతారు. ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాలను రూ. 149.16 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. గతంలో రైల్వేశాఖకు ఏపీ ప్రభుత్వం కేటాయించిన ముడసర్లోవలోని 52 ఎకరాల స్థలంలోనే ఈ నిర్మాణాలు జరగనున్నాయి. రిజర్వాయర్ పక్కనే ఉండటంతో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని గతంలో రైల్వేశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే అటువంటి ఇబ్బందేవిరీరాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో ఇప్పుడు ఆ భూములను ఖరారు చేసింది. మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణం జరగనుంది. ఇందులో రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లు ఉంటాయి. ఇక్కడ దక్షిణ కోస్తా జోన్ జనరల్ మేనేజర్ కార్యాలయం, ఇతర ఉన్నతాధికారుల ఆఫీసులు ఉంటాయి.
జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలంటే ఒక జనరల్ మేనేజర్, ఆయన సపోర్టింగ్ స్టాప్ కొన్ని కార్యాలయాలు ఉంటే చాలు. మొత్తంగా దీనికి 2 వేల మంది ఉద్యోగులు అవసరమవుతారు. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే నాటికి వారి సంఖ్య క్రమంగా 3 వేలకు చేరుతుంది. ఇప్పటికే ఇక్కడ పని చేస్తున్న వారు కొందరు ఉన్నారు కాబట్టి, చాలా తక్కువ మంది ఉద్యోగులు కొత్తగా అవసరమవుతారు. వీరందరూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఆపరేటింగ్ డిపార్ట్‌మెంట్, కంట్రోల్ రూం, అడిటోరియం, మెకానికల్.. ఇలా మొత్తం 18 రకాల విభాగాలు, దానికి సంబంధించిన అనుబంధ కార్యాలయాలలో పని చేస్తుంటారు. మొత్తానికి ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇప్పటికైనా సాకారమవటం హర్షనీయం.
-కల్లూరి రామకృష్ణా రెడ్డి
(సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్)