తెరమరుగు అవుతున్న చారిత్రక నిర్మాణాలు…
రక్షణపై శ్రద్ధ లేని ప్రభుత్వాలు
ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినోత్సవం ప్రతి ఏట నవంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా 1984, జనవరి 27న నాటి భారతదేశ ప్రధాని ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చైర్మన్‌గా భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ (ఇండియన్ నేషనల్ ట్రస్టు ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ -ఇంటాక్) అనే సంస్థ ఏర్పాటు చేయబడిరది. దీనికి తోడుగా, భారతదేశ వారసత్వ సంపద విలువ, వాటి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కలిపించేందుకు ‘భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ’, ‘రాష్ట్ర పురావస్తు శాఖ’లకు బాధ్యతలు అప్పగించ బడ్డాయి.
అవి భక్త కరీంనగర్ జిల్లా గత కీర్తికి ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచి ఉంది. రాష్ట్ర పురావస్తు శాఖ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ వి. వి. కృష్ణ శాస్త్రి అపురూప పరిశోధనల ఫలితంగా, జిల్లా పాక్చరిత్ర 50వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నదని రుజువైతే, అది సామాన్యమైన విషయమేమీ కాదు. గౌతమి నదీ దక్షిణ తీరమున పరి వ్యాప్తమై ఉన్న, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, ఉత్తర దక్షిణ భారతీయులకు, సేతువై నిలిచిన ఈ ప్రాంత నాగరికత, కాల ప్రవాహంలో కొట్టుకుని పోయినా, ఉత్సాహవంతులైన చారిత్రక పరిశోధకుల అవిరళ కృషి ఫలితంగా కథలుగా, గాథలుగా, నోళ్లలో, రాళ్లలో, ఆకులలో, రేకుల లో అక్కడక్కడ నిక్షిప్తమైయున్న చరిత్ర కొంతవరకు వెలుగులోనికి రాగలిగింది. చరిత్రలో ఆంధ్రులకు లభించినంత వరకు, శాతవాహనులు మొట్టమొదటి రాజ వంశం అనీ, అదీ మహారాష్ట్రలోని పైఠానో లేక నాసిక ప్రాంతము అనుకుంటే కాదని, అంతకుముందే పురాణాలలో పేర్కొనబడిన ఆంధ్ర భృత్యులని, తొలి ఆంధ్ర ప్రభువుల సేవకులనే విషయం, కోటిలింగాల తవ్వకాలలో బయల్పడడం విశేషం. కరీంనగర్ జిల్లాలోనే శాతవాహనుల మూలపురుషులకు ఆవాస స్థానమని చారిత్రక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీముఖుని కి చెందిన నాణాలను, ధర్మపురి వాస్తవ్యుడైన చారిత్రక పరిశోధకుడు కీర్తిశేషులు సంగనభట్ల నరహరిశర్మ కనుగొన్నాక, శాతవాహన వంశానికి మూల పురుషుడు అనదగిన శ్రీముఖుడు, కోటిలింగాల రాజధానిగా చేసుకొని పరిపాలించాడని రుజువైనాక, చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. క్రీస్తుపూర్వం శతాబ్దాల క్రితమే ఆంధ్ర రాజ్యం, శాతవాహనుల ఏలుబడిలో వర్ధిల్లిన, వారి అభిమాన పాత్రమైన బౌద్ధమతం, ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య మత మై విరాజిల్లింది. ప్రాచీనమైన ప్రతి గ్రామం పేరులో ప్రతి నిర్మాణ కౌశలంలో, ప్రతి కట్టడం లో వస్తువులు, మట్టి పాత్రలు, మతంతో పెనవేసుకున్న చరిత్ర పలుకుతుంది.
శాతవాహన చక్రవర్తుల చత్రచ్చాయలలో, బౌద్ధమతం విస్తరించి, శాంతి అహింసలు, విశ్రమించిన ఈ ప్రాంతాల్లో, నాటి ప్రజల ఆరాధ్యాలైన స్థూపాలు, శిల్పాలు, కట్టడాలు, తవ్విన చోటల్లా దర్శనమిస్తూ, వెలకట్టలేని వేల సంవత్సరాల చరిత్రకు, మౌన సాక్షీ భూతాలుగా నిరాదరణ నీడలో మగ్గుతూ, తమ దుస్థితికి చింతిస్తూ, అనాసక్తులైన, అధికారుల, ప్రజాప్రతినిధుల అశ్రద్ధ, నిర్లక్ష్యానికి క్రుంగి కృశిస్తు, ఆయువు తీరకముందే అస్తమిస్తున్నాయి. నిన్నటి వరకు ఆలనా పాలనా కరువై ‘‘బుద్ధం శరణం గచ్చామి’’ అంటూ దీనంగా విలపించిన ధర్మపురి నియోజకవర్గంలోని పాషా యిగాం బౌద్ధ స్తూపం, ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మూలమట్టం అయింది. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో గంగా మైదానం ప్రాంతాలలో బౌద్ధమత వ్యాప్తి జరిగినా, అశోకుని కాలం కన్నా ముందే ప్రవేశించిన బౌద్ధమతం, శాతవాహనుల హయాంలో విశేష ఆదరణ పొందింది. కరీంనగర్ జిల్లాలో మూడు ప్రాచీన బౌద్ధ కేంద్రాలు ఉండేవి.
వాటిలోని ధర్మపురి సమీప క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల సంబంధిత పాశాయిగాం బౌద్ధ స్థూపాన్ని కి విశేష ప్రాధాన్యత ఉండేది. దీనికి 6 వృత్తాకారపు పలకలు ఉండేవి. వీటిపై ఒక పద్మం, ఏనుగు బొమ్మలు, స్థూపానికి ఇరువైపులా, స్తం భాకృతులు కలిగియున్న ఆ స్తూపం రెండవ శతాబ్దానికి చెందినదిగా ‘‘దూళికట్ట స్థూపం కన్నా ప్రాచీనమైనదిగా’’, ‘‘జిల్లాలోని మొట్టమొదటి రాతి కట్టడం’’గా చరిత్రకారులు రుజువు పరిచారు. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాగ సింపీ యకాయ, జమజోరాగ బ్రహ్మ లేఖలు, స్తూపం వద్ద లభ్యమైనాయి. శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటిలింగాలకు మూడు కిలోమీటర్ల దూరంలో, ప్రస్తుత రాయపట్నం – కరీంనగర్ రాష్ట్ర రహదారిని ఆనుకుని, పాశాయిగాం గుట్టపై చెన్నపూస అనే ఆచార్యుడు, బౌద్ధ స్థూపాన్ని నిర్మించినట్లు, సుప్రసిద్ధ బౌద్ధ ఆచార్యుడు దిజ్ఞాగుడు, ఈ ప్రాంతం వాడేనని, చైనా యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ ఏడవ శతాబ్దంలో తన గ్రంథంలో పేర్కొన్నాడు. రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ వి.వి. కృష్ణ శాస్త్రి శాతవాహన కళా ఉత్సవాల సందర్భంగా, 2002 జనవరి 21న కరీంనగర్లో ప్రధాన ప్రాసంగికునిగా ప్రకటించడాన్ని బట్టి, పాషాయిగాం బౌద్ధ స్తూప ప్రాధాన్యత స్పష్టమౌతుంది. ఇంతటి ప్రాచీన చారిత్రక ఆధారమైన బౌద్ధ స్తూపం, రాష్ట్ర రహదారి రోడ్డు నిర్మాణంలో, కాంట్రాక్టర్ అయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ నిర్లక్ష్యానికి అనవసరంగా, అకారణంగా బలిjైు, 1999 డిసెంబర్ 25వ తేదీన నేల కూల్చ బడిరది.
ఆ తర్వాత ముక్కలైన ఆ స్తూప పలకలను చేర్చి, జిల్లా కేంద్ర పురావస్తుశాఖ మ్యూజియంలో భద్రపరిచి, తిరిగి స్థాపించడం జరిగింది. తత్ఫలితంగా పాశాయిగాంకు చెందిన బౌద్ధ స్తూపం, కనుమరుగై ఈ ప్రాంతం, చరిత్ర పుటల్లో నుంచి తొలగించబడి, ప్రాచీనత్వాన్ని కోల్పోయింది. అలాగే జూలపల్లి మండలంలోని క్రీస్తు పూర్వపు రెండవ శతాబ్ధికి చెందిన హుస్సే నియా వాగు – చిన్న వాగుల సంగమ స్థానంలో 47 శిల్పాలంకృత పలకలచే శోభితమై, ఐదు పడగల ‘‘ముచిలింద నాగం’’ బోధివృక్షం మహాభినిష్క్రమణం చెక్కబడిన దూళికట్ట స్థూపం విశేష ప్రాధాన్యతను కలిగి ఉంది. ‘‘కాలచక్ర నిర్వహణ’’కై దూళికట్ట నుండి అపురూప ఫలకాలను, అమరావతికి కొద్దికాలం క్రితం తరలించారు. కోటిలింగాల ధూళికట్ట మరియు మీర్జంపేట మానేరు తీరాన చారిత్రక శిల్పాలను, స్తూపాలను, కోటలను, పరి రక్షించేందుకు నాటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 38 లక్షలకు పైగా నిధులు అర్ధాంతరంగా మళ్లించ బడినాయి. ప్రాచీన కట్టడాలు, బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, శిల్పీకరించిన అపురూప కళాకృతులు, ఈనాటి వారికి ప్రధానంగా చరిత్ర అంటే గౌరవం లేని సరైన అవగాహన లేని, పాలక అధికార వర్గాలకు తెలియక పోవచ్చు కాని, వాటి ప్రాశస్త్యానికి, వేల సంవత్సరాల వెలకట్టలేని, చారిత్రక నేపథ్యం ఉందన్న యతార్థాన్ని విస్మరించ రాదు. ఒకవైపు ప్రాచీనమైన బౌద్ధ వ్యాప్తికి సంబంధించిన, ఈ ప్రాంత చరిత్ర మరుగున పడుతుండగా… మరోవైపు ప్రాచీనత్వానికి ఆనవాళ్లు అయిన, అపురూప చారిత్రక సాక్ష్యాలను కనుమరుగు చేస్తుంటే, వారి ఆత్మ ఘోష వినిపిస్తుంటే, భారతీయ పురాతత్వ విభాగం ప్రపంచ పౌరుల ముందు తలదించుకోవాల్సిన దుస్థితి. గొప్పలు చెప్పుకోవడం కాదు గొప్పలు నిలబెట్టుకోవడమే గొప్ప తనం.
-రామ కిష్టయ్య సంగనభట్ల
9440595494