ఉద్యమంలో పిసీసీ ప్రెసిడెంట్ ఎక్కడున్నారు ..?

– కేసీఆర్ దీక్ష గురించి ఆయ‌న మాట్లాడ‌టం హాస్యాస్ప‌దం
– దీక్ష విర‌మించాల‌ని వేడుకున్న‌ది కాంగ్రెస్ నేత‌లే
– దీక్షా దివ‌స్ ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెల‌పాలి
– తెలంగాణ ఉద్య‌మాన్ని అవ‌మానించ‌వ‌ద్దు
– మాజీ మంత్రి కేటీఆర్

 

  పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులు ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఆయన కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నార‌ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీక్షా దివ‌స్ సంద‌ర్భంగా ఆయ‌న కాంగ్రెస్ నాయ‌కుల‌పై విరుచుకుప‌డ్డారు.  కేంద్రంలో, రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ కేసీఆర్ ప్రాణం ముఖ్యమైందని దీక్ష విరమించాలని వేడుకున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలకు గుర్తు చేస్తున్నానన్నారు.   కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే తెలంగాణ లేదు అన్నది సత్యం. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన దీక్షను తక్కువ చేసి, అవమానకరంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. హీరోలు మౌనంగా ఉంటే విలన్లు కూడా మేమే హీరోలని ఫోజులు కొడతారు. అందుకే ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ ఆనాటి ఉద్యమ ఘట్టాలను, దీక్షా దివ‌స్ ప్రాధాన్యతను మరోసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నద‌న్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పిన సంస్కారం మాది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిరి ఏనాడు తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అని మేము అనలేదు. మమ్మల్ని అవమానపరిస్తే ఊరుకుంటాం కానీ తెలంగాణను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిస్తే ఊరుకునేది లేద‌న్నారు. దమ్ముంటే చేర్చుకున్న పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు ఉద్యమాల కోసం, ప్రజల కోసం నిలబడిన వీరులు. తల్లి తెలంగాణను తీసివేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టుకున్నది కాంగ్రెస్ బానిసలే. సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి తల్లి తెలంగాణ విగ్రహం బరాబర్ పెడతామ‌ని కేటీఆర్ ప్రకటించారు. ఈ దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని, అమరవీరుల త్యాగాలను, ప్రజల పోరాటపటిమను గుర్తుచేసుకొని మరోసారి పునరంకితం కావాల్సిన అవసరం వున్న‌ద‌న్నారు.  ఈ సంద‌ర్భంగా కేసీఆర్ దీక్షతో పాటు, తెలంగాణ ఉద్యమ చరిత్రను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ప్రస్థానానికి సంబంధించిన అనేక అంశాలను వివరించారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దశాబ్దాల చరిత్రను, అందులోని విలన్లను, హీరోలను, పోరాట వీరులను, వారి త్యాగాలను, వారి దీక్షలను గుర్తుంచుకోవాల‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *