ఫోటోలకు ఫోజులివ్వడం కాదు.. పిల్లలకు నాణ్యమైన తిండి పెట్టండి..
మాజీ మంత్రి, ఎమ్మెల్మే హరీష్ రావు..
ప్రభుత్వ నిర్లక్ష్యం.. అభం, శుభం తెలియని పిల్లలకు శాపంగా మారిందని, తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్మే తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని మాజీ మంత్రి హరీష్ రావు, ఎల్వోపీ మధుసూదన్ చారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈనెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, వెంటనే వీరికి మంచి దవాఖానకు పంపించకుండా హాస్టల్‌లో ఉంచి చికిత్స అందించారని తెలిపారు. నాలుగు రోజులు గడించినా కూడా వారు పూర్తి ఆరోగ్యవంతులు కాలేదు. ఆ తరువాత విద్యార్థిని లీలావతిని నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి..మౌనంగా ఇలా నిమ్స్ ఆసుపత్రి బెడ్ పై ఉండటం చూస్తే మనస్సు కలిచివేస్తున్నదని హరీష్ రావు అన్నారు. ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
వాంకిడి గురుకుల విద్యార్థులకు చికిత్స అందించడంలో ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ కనిపిస్తున్నది. మొన్న శైలజ మృతికి ప్రభుత్వం కారణమైంది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు దవాఖానల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థల ప్రాణాలు పోతున్నాయని ఎన్నిసార్లుచెప్పినా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటున్నారు. సబితా ఇంద్రా రెడ్డిని, సత్యవతిని అరెస్టు చేశారు. దిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, కనీసం జిల్లాలో ఉన్న పిల్లల భవిష్యత్తు పై లేదా? అని హరీష్ రావు ప్రశ్నించారు. నిన్న నల్లగొండ – కేతేపల్లి మండలం గురుకులంలో ఐదో తరగతి చదువుతున్న నీలం సాయి గణేష్ పాము కాటుకు గురై దవాఖాన పాలయ్యాడు. ఫుడ్ పాయిజన్ కేసులు, కుక్క కాట్లు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కరెంటు షాకులు నిత్య కృత్యమవుతున్నా ప్రభుత్వం ముద్దు నిద్ర వేడడం లేదని, ఇప్పటి వరకు 49 మంది విద్యార్థులు చనిపోతే ఉలుకుపలుకు లేదు. ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.




