- ఇప్పటికే రూ.30వేల కోట్ల విలువైన భూముల అమ్మకం
- హైదర్‌నగర్‌లో పిల్లల పార్కు స్థలాన్ని కూడా అమ్మకానికి పెట్టారు
- సామాన్యుల భూములను 22ఎలో చేర్చి వేధింపులు
- విలువైన ప్రభుత్వ భూములు సీఎం బంధుమిత్రులకు ధారాదత్తం
- ఇలా భూములు అమ్ముకుంటూ పోతే, రేపు పరిస్థితేంటి?
- కూకట్‌పల్లి 22ఎ బాధితులకు అండగా నిలుస్తాం
- మాజీ మంత్రి హరీష్‌రావు హామీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ‘అసలు ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ 22ఎ ఆంక్షలను తీసుకొచ్చింది? ప్రభుత్వ బాధ్యత ఏమిటి? ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, రవాణా, ఉద్యోగాలు, రైతుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం.. ఆ సమస్యలను గాలికొదిలేసి కేవలం భూముల చుట్టూ ఎందుకు తిరుగుతోంది? ఒక్క మాటలో చెప్పాలంటే.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలే కేంద్రంగా పరిపాలన సాగింది. కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం భూములే కేంద్రంగా పరిపాలన సాగుతోందని మాజీ మంత్రి హరీష్‌రావు (MLA Hairsh Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కమ్యూనిటీ హాల్‌లో 22ఎ నిషేధిత భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబాలతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు బుధవారం సమావేశమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 22ఎ బాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బాధితుల ఆవేదనను స్వయంగా అడిగి తెలుసుకున్న హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు హైదరాబాద్‌తో సహా రాష్ట్రమంతా కరెంటు కష్టాలు ఉండేవి. తాగునీరు, ట్రాఫిక్, సాగునీటి సమస్యలతో ప్రజలు అల్లాడిపోయారు. కానీ, కేసీఆర్ అధికారంలోకి రాగానే వాటన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి, యువతకు ఉద్యోగాలు వచ్చేలా అద్భుతమైన ప్రగతిని సాధించారు. ఒకప్పుడు తెలంగాణ అంటే కరువు, రైతుల ఆత్మహత్యలు అనే పరిస్థితి ఉండేది. కానీ కేసీఆర్ పాలనలో.. గంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండి దేశంలోనే వరి ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానంలో ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాలను సైతం తలదన్ని తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారు. కూకట్‌పల్లినే తీసుకుంటే.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఇక్కడి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. పెద్ద పెద్ద రిజర్వాయర్లు, పైప్‌లైన్లు, మౌలిక వసతులు నిర్మించాం. నిజాం, బ్రిటిష్ కాలంలో కట్టిన ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపైనే ఆధారపడే పరిస్థితిని మార్చేసి.. నగర నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు నిర్మించాం. ఒక్క కూకట్‌పల్లిలోనే 20కి పైగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేశాం. కేసీఆర్ ఆలోచనలన్నీ పేదల కోసం కల్యాణలక్ష్మి, వృద్ధులకు ఆసరా పెన్షన్లు, ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, బస్తీ దవాఖానాలు, మిషన్ భగీరథ, 24 గంటల విద్యుత్, రైతాంగానికి సాగునీరు.. ఇలా సాగాయని గుర్తుచేశారు.
ఇవే బీఆర్ఎస్ పదేళ్ల సువర్ణ పాలనకు గుర్తులు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో పరిస్థితి ఏమిటి? ప్రజల సమస్యలు పరిష్కరించడం కంటే, ప్రభుత్వ భూములను అమ్ముకోవడానికే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. హౌసింగ్ బోర్డు భూములు, టీజీఐఐసీ భూములు.. ఇలా ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే అక్కడ బోర్డు పాతేసి అమ్మకానికి పెట్టడమే కాంగ్రెస్ విధానంగా మారింది. ప్రభుత్వ భూములు అంటే మన భవిష్యత్ తరాల ఆస్తి, అవి అమ్ముకోవడా నికి కాదు. హైదర్ నగర్‌లో కిషన్ రావు , అక్కడి కాలనీవాసులు పోరాడితే పిల్లలు ఆడుకోవడానికి కేసీఆర్ వెయ్యి గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. దుర్మార్గమైన రేవంత్ రెడ్డి సర్కార్ ఆ పార్కు స్థలాన్ని కూడా అమ్మకానికి పెట్టింది. బీఆర్‌ఎస్ పదేళ్ల ప్రభుత్వ హయాంలో హౌసింగ్ బోర్డుకు చెందిన ఒక్క గజం భూమిని కూడా అమ్మకానికి పెట్టలేదు. కానీ, రేవంత్ రెడ్డి రాగానే ఈ తక్కువ కాలంలోనే సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తెగనమ్మేశాడు.
ఇలా అడ్డగోలుగా భూములన్నీ అమ్ముకుంటూ పోతే.. రేపటి భవిష్యత్ తరాలకు ఒక దేవాలయం, మసీదు, చర్చి నిర్మించాలన్నా, ఆసుపత్రి, పాఠశాల, వాటర్ ట్యాంక్ కట్టాలన్నా.. కనీసం చనిపోతే దహన సంస్కారాలకు వైకుంఠధామం నిర్మించడానికి కూడా స్థలం దొరకని పరిస్థితి వస్తుంది. ఒకవైపు ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతూనే, మరోవైపు దళితులు, గిరిజనులు, బీసీ వర్గాలకు గతంలో కేటాయించిన అసైన్డ్ భూములపై కన్నేశారు. లక్షలాది మంది పేదలకు భరోసాగా ఉన్న ఆ భూములను లాక్కొని దళారుల ద్వారా కమీషన్లకు కట్టబెడుతున్నారు. కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న సామాన్యుల భూములను మాత్రం రాత్రికి రాత్రే 22ఎ నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను వేధిస్తున్నారు. కానీ, ప్రభుత్వ ఆస్తులైన అత్యంత విలువైన భూములను మాత్రం సీఎం తన కుటుంబ సభ్యులకు, అనుయాయులకు కారుచౌకగా దారాదత్తం చేస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. 22ఎ బాధితుల పక్షాన, సామాన్యుల ఆస్తుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచైనా సరే రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.




