- నిపుణులతో కమిటీల ఏర్పాటు
- బొగ్గు నుంచి కీలక ఖనిజాల దిశగా సింగరేణి
- వ్యూహాత్మక ప్రణాళికతో సింగరేణి విస్తరణ
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026-ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ నిర్వహణలో భాగంగా ప్రజాభవన్‌లో తక్షణమే ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ కోసం అతిథులకు ఆహ్వాన పత్రాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా పంపించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. బుధవారం మహాత్మా ఫూలే ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో ఈ వార్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతలను సీఎస్ పటిష్టం చేయాలని సూచించారు.
సమ్మిట్ కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలలో అవసరమైన నిపుణులను కీలక అధికారులను తీసుకోవలని ఆయన చెప్పారు. గతంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల ప్రస్తుత పురోగతిపై సమగ్ర విశ్లేషణ చేసేందుకు ప్రత్యేకంగా కమిటీకి బాధ్యతలు అప్పగించాలన్నారు. డిసెంబర్ లో జరగనున్న సమ్మిట్ కోసం దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తృతంగా రోడ్ షోలు నిర్వహించి పెట్టుబడిదారులను ఆకర్షించాలని చెప్పారు.
ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ కోసం అతిథులకు ఆహ్వాన పత్రాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా పంపించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమ్మిట్ పనుల పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రోజుకు కనీసం ఒక గంట కేటాయించి రోజువారీ సమీక్షలు నిర్వహించాలని, ప్రతి కమిటీకి కేటాయించిన బాధ్యతలను టైమ్‌లైన్ ప్రకారం పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
వ్యూహాత్మక ప్రణాళికతో సింగరేణి విస్తరణ
తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయవంటి ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిని లాభదాయక సంస్థగా నిలబెట్టి భవిష్యత్ తరాలకు అందించడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బొగ్గు తవ్వకాలతో పాటుగా కీలక, ప్యూహాత్మక ఖనిజాల అన్వేషణ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. క్రిటికల్ మినరల్స్, బొగ్గు గనులకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే అన్ని వేలం ప్రక్రియల్లో పాల్గొనాలని ఆయన అధికారులకు చెప్పారు. బుధవారం ఉదయం మహాత్మా జ్యోతీరావు ఫూలే ప్రజాభవన్ లో సింగరేణి అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఎల్ నినో ప్రభావం వల్ల విద్యుత్ అవసరాలు పెరిగిన నేపథ్యంలో సింగరేణి డిమాండ్ కు తగ్గట్టుగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని అధికారులకు సూచించారు. సింగరేణి కేవలం బొగ్గు మైనింగ్ కే కాకుండా అన్ని రకాల మైనింగ్ లోకి ప్రవేశించాలని ఆయన అధికారులకు చెప్పారు. ఇందుకు ప్రజాప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని అన్నారు. రానున్న కాలంలో వెనిడీయం, టైటానియం లాంటి ఖనిజాల బ్లాక్ లు వేలంలోకి వస్తున్న తరుణంలో వాటిని దక్కించుకునేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకువ వెళ్లాలని ఆయన అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన భద్రత విషయంలో సింగరేణి తన పాత్రనే మరింత గా పోషించాలని ఆయన చెప్పారు.
ప్రపంచ మార్పులకు అనుగుణంగా కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాలు మైనింగ్ వైపు సింగరేణిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ అవకాశాలను అధ్యయనం చేసేందుకు సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, చిలీ వంటి దేశాల కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్లను నియమించామని డిప్యూటీ సీఎం చెప్పారు.




