అధికారులు నిర్లిప్తతను వదిలేయండి..
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు ఉద్యోగులు చిత్తశుద్దితోపనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి పథకాలపై ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పంటలు, ధాన్యం సేకరణ, నీటిపారుదల విషయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న జిల్లాగా పేరుగాంచిందన్నారు. నల్లగొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్రానికి మార్గదర్శకం కావాలని అన్నారు. అధికారులు ఇప్పటివరకు ఉన్న నిర్లప్తతని వదిలేసి పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని, ముఖ్యంగా రానున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి ప్రజల సేవకు అందరూ కలిసి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులందరూ మరింత ప్రతిభావంతంగా పని చేయాలని కోరారు. జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు.
అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ సంవత్సరం అత్యధికంగా ధాన్యం సేకరణ చేయడంపై కలెక్టర్లను ప్రత్యేకంచి నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠిని అభినందించారు. వొచ్చే సీజన్ నుంచి అన్ని కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని శుభ్రపరిచే యంత్రాలు, ధాన్యం ఆరబెట్టే యంత్రాలను ఇస్తామని, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో 12 లక్షల భూములు సాగులో ఉన్నాయని, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువగా పండించామని, ఇందుకు గాను జిల్లా కలెక్టర్‌ను ఆయన అభినందించారు. సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట, నల్లగొండ యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.